జైపూర్ : చిరుత పులి.. ఆ పేరు వింటేనే శరీరంలో వణుకు పడుతోంది. అలాంటి భయంకరమైన పులిని ప్రత్యక్షంగా చూస్తే గుండె ఆగిపోయినంత పని అవుతుంది. మరి ఓ చిరుత ఏకంగా లేడిస్ హాస్టల్‌లోకి ప్రవేశించింది. దీంతో అక్కడున్న మహిళలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ ఉదయ్‌పూర్ జిల్లాలోని హీరాన్‌మగరి సెక్టార్ 4లో ఓ లేడిస్ హాస్టల్ ఉంది. అయితే ఆ హాస్టల్ మెట్లపై నుంచి ఓ వంట మనిషి కిందకు దిగుతోంది. అంతకంటే ముందు అక్కడున్న ఓ గదిలోకి చిరుత మెల్లిగా ప్రవేశించింది. అంతలోనే ఆమెకు ఓ గదిలో నుంచి బయటకు వస్తున్న చిరుత కనిపించింది. ఇంకేముంది వంట మనిషి భయంతో మళ్లీ పైకి పరుగులు తీసింది. చిరుత కిందకు దిగిపోయింది. చిరుత సంచారంతో ఒకే గదిలో పది మంది అమ్మాయిలు ఉండి, లాక్ వేసుకున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
లేడిస్ హాస్టల్ వద్దకు చేరుకున్న అటవీశాఖ అధికారులు.. పులి సంచారంపై నిఘా పెట్టారు. హీరాన్‌మగరి కాలనీ వాసులను అప్రమత్తం చేశారు. ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. పులిని బంధించేందుకు మూడు కేజ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు.