ఇక మోదీ కంట కన్నీరు

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ భయపడుతున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు

  • Publish Date - April 26, 2024 / 06:44 PM IST

  • ఫలితాలపై భయంతో ప్రధాని
  • అందుకే బేలగా మారిపోయారు
  • సమస్యల నుంచి దృష్టి మళ్లించే యత్నం

విజయపుర: ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ భయపడుతున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల్లోనే ఆయన సభా వేదికలపై కంట కన్నీరు పెట్టే అవకాశాలు లేకపోలేదన్నారు. కర్ణాటకలోని విజయపురలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కొద్దిమందిని వేలకోట్లకు అధిపతులను చేస్తే.. కాంగ్రెస్‌ పార్టీ కోట్ల మందిని లక్షాధికారులను చేస్తుందని ప్రకటించారు. ‘మీరు మోదీ ఉపన్యాసాలు వినే ఉంటారు. ఆయన బేలగా మారిపోయారు. కొన్ని రోజుల్లోనే ఆయన కంట నీరు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నయి’ అని ఎద్దేవా చేశారు. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ‘ఆయన చైనా గురించి పాకిస్థాన్‌ గురించి మాట్లాడుతుంటారు. చప్పట్లు కొట్టమంటారు. లేదంటే మొబైల్‌ ఫోన్‌ లైట్లు వెలిగించాలని చెబుతారు. కానీ.. దారిద్ర్యం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటిపై మాత్రం మౌనం పాటిస్తారు’ అని రాహుల్‌ విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను కాంగ్రెస్‌ మాత్రమే పరిష్కరించగలదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో పేద ప్రజల నుంచి సొమ్మును మోదీ దోచుకున్నారని ఆరోపించారు.

‘70 కోట్ల మంది వద్ద ఉన్న సంపద కంటే 22 మంది వ్యక్తుల వద్ద ఉన్న సంపద ఎక్కువ. దేశంలో 40 శాతం సంపదను ఒక శాతం ప్రజలు నియంత్రిస్తున్నారు. మోదీ వేల కోట్లకు అధిపతులకు సొమ్మును ఇచ్చారు. మేం పేద ప్రజలకు ఇస్తాం’ అని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని ఒక వ్యక్తి, ఒక పార్టీ చూస్తున్నాయని బీజేపీ, మోదీల నుద్దేశించి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తాము గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని బీజేపీ ఎంపీలు చెబుతున్నారని గుర్తు చేశారు. మరోవైపు రాజ్యాంగాన్ని, బసవన్న ఆదర్శాలను రక్షించేందుకు కాంగ్రెస్‌, ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. గత పదేళ్లలో మోదీ దేశంలో 20 నుంచి 25 మందిని వేలకోట్లకు అధిపతులను చేశారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, డిఫెన్స్‌ ప్రాజెక్టులు, సోలార్‌ ప్రాజెక్టులు వంటివి గౌతమ్‌ అదానీ వంటి వ్యక్తులకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు. ‘న్యాయ్‌’ పథకాలను అమలు చేయడం ద్వారా తమ ప్రభుత్వం కోట్ల మంది ప్రజలను లక్షాధికారులను చేయబోతున్నదని చెప్పారు. బీజాపూర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని విజయపురలో మే 7న పోలింగ్‌ జరుగనున్నది.

Latest News