మంత్రులవి అవగాహాన రాహిత్యమైన మాటలు: మాజీ మంత్రి పొన్నాల ధ్వజం

బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై మంత్రుల స్పందన ఆవేశంతో కూడి అవగాహాన లోపం, అనుభవరాహిత్యంతో ఉన్నాయని మాజీ మంత్రి పొన్నా ల లక్ష్మయ్య విమర్శించారు

  • Publish Date - April 8, 2024 / 11:50 AM IST

అన్నారం..సుందిళ్ల నుంచి లిఫ్టు ఎందుకు చేయలే

విధాత, హైదరాబాద్‌ : బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై మంత్రుల స్పందన ఆవేశంతో కూడి అవగాహాన లోపం, అనుభవరాహిత్యంతో ఉన్నాయని మాజీ మంత్రి పొన్నా ల లక్ష్మయ్య విమర్శించారు.మాజీ కార్పోరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డితో కలిసి ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సాగుతాగునీటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వైఫల్యంతో ఇబ్బందులు పడిన రైతుల కోసం కేసీఆర్ మరో రెండు అడుగులు ముందు వేశారన్నారు. కేసీఆర్‌కు గోదావరి జలాలపై అవగాహన లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని, అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాధ్యత లేకుండా పారిపోయింది ఎవరో తెలియదా? అని పొన్నాల విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాకు, సొంత ఊరికి వచ్చే ప్రాజెక్టు గురించి ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. మేడిగడ్డ ఆనకట్ట వద్ద సమస్య ఉంటే…అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి ఎందుకు ఎత్తిపోయలేదని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అన్నారం, సుందిళ్లలోని నాలుగు టీఎంసీలు ఎత్తిపోయకుండా కిందకు ఎందుకు వదిలారని ప్రశ్నించారు. తప్పుడు సమాచారంతో నీచ రాజకీయాలకు పాల్పడిన వారు క్షమాపణ చెప్పాలన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి బిజీగా ఉన్నట్లున్నారని, రాత్రి క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లారని ఎద్దేవా చేశారు. కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి, మళ్లీ లోక్ సభ ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ జాతీయ మ్యానిఫెస్టోతో మరోసారి ప్రజలను దగా చేస్తున్నదన్నారు. కిసాన్ న్యాయ్ అంటున్న కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది? డిసెంబర్ 9 పోయి 120 రోజులు అవుతుంది కదా అని ప్రశ్నించారు. రైతు భరోసా ద్వారా ఎకరానికి 15 వేలు, కౌలు దారులకు ఇస్తానన్న 15 వేలు, వ్యవసాయ కూలీలకు ఇస్తానన్న 12 వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. యువ న్యాయ్.. తెలంగాణలో యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ఇచ్చిన నిరుద్యోగ హామీ భృతి ఏమైందని, మహాలక్ష్మి పథకంలో భాగమైన మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయల హామీ ఏమైందని, చదువుకుంటున్న యువతులకు ఇస్తానన్న స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పార్టీలు మారే నాయకులపై ప్రత్యేక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు బీఆరెస్‌ నుంచి గెలిచి ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించి హామీ నిలబెట్టుకోవాలన్నారు.

Latest News