Site icon vidhaatha

Jan Suraaj Party । కొత్త పార్టీ పెట్టిన ప్రశాంత్‌ కిశోర్‌.. బీహార్‌లో ప్రభావం చూపగలడా?

Jan Suraaj Party । మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న బీహార్‌లో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. రాజకీయ వ్యూహకర్తగా పనిచేసి, తర్వాత రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్‌ కిశోర్‌.. చెప్పినట్టుగానే తన జన్‌ సూరజ్‌ మూవ్‌మెంట్‌ను.. జన్‌ సూరజ్‌ పార్టీగా బుధవారం పాట్నాలోని వెటర్నరీ కాలేజీ మైదానంలో నిర్వహించిన సభలో ప్రకటించారు. ఈ సందర్భంగానే ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ మాజీ అధికారి మనోజ్‌ భారతిని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చారు. భారతి ఐఐటియన్‌. దళితుడు. బీహార్‌లోని మధుబని జిల్లాకు చెందినవారు. ‘ఈ రోజు ఆయన ఒక దళితుడిగా ఇక్కడ లేరు. ప్రశాంత్‌ కిశోర్‌ కంటే మెరుగైన వ్యక్తి కావడంతోనే ఆయనను ఎంపిక చేశాం. ఆయన దళితుడు కావడం యాదృచ్ఛికం’ అని ప్రశాంత్‌ కిశోర్‌ పాట్నా సభలో చెప్పారు. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని ఎత్తివేయడం తమ అజెండాలో ఒక కీలక అంశమన్నారు. మద్య నిషేధం కారణంగా బీహార్‌ ఏటా 20వేల కోట్ల రూపాయలను నష్టపోతున్నదని, తాము మద్య నిషేధాన్ని ఎత్తివేసి,  ఆ డబ్బును ఉత్తమ విద్య, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వినియోగిస్తామని ప్రకటించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయ రంగానికీ అమలు చేయడం ద్వారా రైతులకు సహకరిస్తామని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు పావలా వడ్డీకే రుణాలు అందిస్తామని ప్రకటించారు. వృద్ధులకు నెలకు 2వేల రూపాయలు పెన్షన్‌ ఇస్తామని చెప్పారు.

ప్రస్తుతం బీహార్‌లో బీజేపీ-జేడీయూ ఐక్య కూటమి అధికారంలో ఉన్నది. మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ), కాంగ్రెస్‌ కలిసి మహాఘట్‌బంధన్‌గా ఉన్నాయి. గాంధీ జయంతి రోజున ఆవిర్భవించిన జన్‌ సూరజ్‌ పార్టీ రాకతో రాష్ట్రంలో ఏ కూటమికి సవాలుగా మారుతుందనేది కీలక అంశంగా ఉన్నది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మాత్రం జన్‌ సూరజ్‌ పార్టీ ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని అంటున్నాయి. గతంలో ప్లూరల్స్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ బీహార్‌ రాజకీయాల్లోకి వచ్చి విఫలమయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్‌ రంజమ్‌ పటేల్ అన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్‌ సింగ్‌ టైగర్‌.. నోటాకు ఎన్ని ఓట్లు వస్తాయో జన్‌ సూరజ్‌ పరిస్థితి కూడా అంతేనని తేల్చిపారేశారు. ప్రశాంత్‌ కిశోర్‌ను బీజేపీకి బీ టీమ్‌ అని గతంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ అభివర్ణించారు. ముస్లింలు, యాదవులు ప్రశాంత్‌ కిశోర్‌ వైపు మొగ్గు చూపుతారని తాను అనుకోవడం లేదని ఆర్జేడీ సీనియర్‌ నేత అబ్దుల్‌ బారి సిద్ధిఖీ చెప్పారు. మహాఘట్‌బంధన్‌ నుంచి లేదా ఎన్డీయే కూటమి నుంచి టికెట్లు లభించనివారికి అదొక వేదికగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2025 అసెంబ్లీ ఎన్నికలు రెండు ప్రధాన కూటముల మధ్య ఉంటాయని, జన్‌ సూరజ్‌ నామమాత్రమేనని జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్‌ రంజన్‌ చెప్పారు. కొత్త పార్టీ పెడతానని జూలై నెలలో ప్రకటించిన ప్రశాంత్‌ కిశోర్‌.. తమ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 243 సీట్లలో పోటీ చేస్తుందని చెప్పారు.

Exit mobile version