అయోధ్య విమానాశ్రయం రెడీ

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 25న అయోధ్యలోని శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు

  • Publish Date - December 13, 2023 / 02:28 PM IST
  • ఈ నెల 25న ప్రారంభించనున్న మోదీ
  • వచ్చే ఏడాది జనవరిలో అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ
  • అంతకు ముందు నుంచే విమానాల రాకపోకలు

అయోధ్య : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 25న అయోధ్యలోని శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. జనవరి 2024లో ప్రతిపాదించిన రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు అయోధ్యలో విమాన సేవలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, కేంద్రమంత్రి వీకే సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య విమానాశ్రయాన్ని పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ పనులను ఈనెల 15 నాటికి పూర్తి చేయాలని కోరారు. విమానాశ్రయంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


డిసెంబరు 25 నాటికి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి విమానాల రాకపోకలను ప్రారంభించనున్నారు. విమానాశ్రయం పనులన్నీ మూడు దశల్లో జరగాల్సి ఉన్నది. ఇందుకోసం ప్రాజెక్టులో ఉన్న మొత్తం ఎనిమిది వందల ఇరవై ఒక్క ఎకరాల భూమిని సేకరించి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీకి అప్పగించారు. విమానాశ్రయం మొదటి దశలో 2,222 మీటర్ల పొడవు 45 మీటర్ల వెడల్పుతో రన్‌వే పనులు 100% పూర్తయ్యాయి. భవిష్యత్తులో రన్‌వేను 3750 మీటర్లకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం భూమిని కూడా సేకరించారు.


పొగ మంచులో రాత్రి పూట ల్యాండింగ్ కోసం సీఏటీఎస్‌ఏ సౌకర్యాల పని కూడా 100% పూర్తయింది. విమానం ల్యాండింగ్ కోసం ఏర్పాటుచేసిన లైటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఏపీసి టవర్ పనులు కూడా పూర్తయ్యాయి. అగ్నిమాపక దళం వాహనాలు కూడా విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఆపరేషన్ కోసం లైసెన్సింగ్ ప్రక్రియ పురోగతిలో ఉంది. విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత అయోధ్య ధామ్ విమానాశ్రయంలో ఎయిర్‌బస్‌ ఏ 320 విమానాలను లాండింగ్ చేసే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.