న్యూఢిల్లీ : ఓట్ చోరీ అంశంపై తరచు మీడియా సమావేశాలు..పవర్ పాయింగ్ ప్రజెంటేషన్లతో బీజేపీపైన, ఈసీపైన విమర్శలు సంధిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా మరోసారి ఓట్ల చోరీ అంశంపై కీలక ఆరోపణలు చేశారు. హర్యానా రాష్ట్రంలో 5 లక్షలకు పైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని ఆరోపించారు. హర్యానా ఎన్నికల్లో బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్‌కు కూడా 22 ఓట్లు ఉన్నాయని రాహుల్ బయటపెట్టారు. ఆమె ఫొటో ఒకటే అయినప్పటికీ సీమా, స్వీటీ, సరస్వతి వంటి వివిధ పేర్లు, వయసులు, జెండర్లతో 22 ఓట్లను సృష్టించారన్నారు. ఓట్‌చోరీపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల దొంగలను ఈసీ కాపాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తుందని ఆరోపించారు. 2024 హర్యానా ఎన్నికల్లో మేం గెలుస్తామని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని..అందుకు విరుద్దంగా మేం ఓడిపోయం అని..ఇందుకు ఓట్ల చోరీ కారణమని రాహుల్ గాంధీ ఆరోపించారు. హర్యానా రాష్ట్రంలో ఓట్ల చోరీ చేయడంలో బీజేపీకి ఎన్నికల సంఘం సహాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో 25 లక్షల ఓట్లను దొంగలించారన్నారు. ఎన్నికల్లో పోల్ అయిన మొత్తం ఓట్లలో దాదాపు 12.5 శాతం నకిలీవేనన్నారు.
ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీదని, ఫేక్ ఫొటోలతో లక్షకు పైగా ఓట్లు ఉన్నాయని.. ఒకే ఫొటోతో రెండు బూత్‌లలో 223 ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. తప్పుడు చిరునామాలతో 93 వేలకు పైగా ఓట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎన్నికల సమయంలో కొందరు వ్యక్తుల నకిలీ ఓట్లను కావాలనే జోడిస్తున్నారని పేర్కొన్నారు.
బీజేపీ ఓట్ల చోరీకి ఈసీ దన్ను
డూప్లికేట్ ఓటర్లను గుర్తించేందుకు ఈసీ వద్ద సాఫ్ట్‌వేర్ కూడా ఉన్నప్పటికీ.. ఓటరు జాబితాలో 5లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఎలా వచ్చారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈసీ తలుచుకుంటే నకిలీ ఓట్లను సెకన్లలోనే తొలగించేదని.. బీజేపీకి లబ్ధి కలిగించేందుకు ఎన్నికల అధికారులు ఈ విషయాలను పట్టించుకోకుండా వదిలేశారని ఆరోపించారు. యూపీలో ఓటు వేసిన వారు వేల సంఖ్యలో హర్యానాలోనూ ఓటు వేశారు అని ఆరోపించారు. బీజేపీ ఓటర్లు అయితే చాలు..వారు దేశంలో ఎక్కడైనా ఓటు వేస్తారా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
