అయోధ్యపై ఆరెస్సెస్, బీజేపీ రాజకీయం
న్యూఢిల్లీ : రామమందిరం ప్రారంభోత్సవం మోదీ కార్యక్రమమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ మంగళవారం విమర్శించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరి 22 నాటి కార్యక్రమాన్ని ఆరెస్సెస్, బీజేపీ నరేంద్రమోదీ రాజకీయ కార్యక్రమంగా మార్చివేశాయని విమర్శించారు. ఇది ఆరెస్సెస్, బీజేపీ కార్యక్రమంగా మారింనందునే తాను దానికి హాజరుకాబోవడం లేదని తెలిపారు. ‘అన్ని మతాలు, సంప్రదాయాలు మాకు సమానం.
హిందూమత పెద్దలు సైతం ఇది రాజకీయ కార్యక్రమంగా మారిందని తమ అభిప్రాయాలు వెల్లడించారని చెప్పారు. ప్రధాని మోదీ చుట్టూ, ఆరెస్సెస్ చుట్టూ తిప్పుతున్న కార్యక్రమం కనుకే తాము హాజరుకావడం లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ వచ్చిన ఆహ్వానాలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభలో పార్టీ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తిరస్కరించారు. అయోధ్య కార్యక్రమాన్ని ఎన్నికల ఫలితాల కోసం ఉద్దేశించిన రాజకీయ ప్రాజెక్టుగా మార్చివేశారని వారు ఆరోపించారు.