Ayodhya Ram Mandir | ఎన్నికల తర్వాత అయోధ్యకు తగ్గిపోయిన సందర్శకులు..

ఆలయం ప్రారంభించిన కొద్ది నెలలకే తమ ఆదాయాలు గణనీయంగా తగ్గిపోవడంపై అయోధ్యలోని ఈ రిక్షావాలాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గిపోయిందని చెబుతున్నారు

  • Publish Date - June 11, 2024 / 02:12 PM IST

అయోధ్య: బీజేపీ ఈ ఎన్నికల్లో ప్రధానంగా నమ్ముకున్నదే అయోధ్యలోని రామాలయాన్ని. ఆలయ నిర్మాణం ఇంకా పూర్తికాక ముందే సంప్రదాయానికి విరుద్ధంగా అసంపూర్ణంగా ఉన్న ఆలయంలో హడావుడిగా ప్రాణప్రతిష్ఠ చేసి, దాన్నే ఎన్నికల అజెండాగా బీజేపీ చేసుకున్నది. కానీ.. అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ లోక్‌సభ సీటులో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. ఇక్కడ ఎస్పీ అభ్యర్థి అవధేశ్‌ ప్రసాద్‌.. బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్‌ను మట్టికరిపించారు. తాము నమ్ముకున్న అయోధ్య ఆలయం ఎన్నికల్లో ఎందుకు ముంచిందో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. కానీ.. అయోధ్యలోని ఈ రిక్షా నడిపే వ్యక్తి.. బీజేపీ ఓటమి వెనుక కారణాన్ని స్పష్టంగా చెప్పాడు. అయోధ్యలో రామాలయం నిర్మాణం తర్వాత చాలా మంది ఉపాధి కోల్పోయారు. కొత్త గుడి కట్టడం కోసం అనేక పాత గుళ్లు సైతం తొలగించారని వార్తలు వస్తున్నాయి. ఆలయం ప్రారంభించిన కొద్ది నెలలకే తమ ఆదాయాలు గణనీయంగా తగ్గిపోవడంపై అయోధ్యలోని ఈ రిక్షావాలాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గిపోయిందని చెబుతున్నారు.
అయోధ్యలో ఆలయం నిర్మించే సమయంలో దాని మీదుగా సాగే అనేక మార్గాలను ప్రభుత్వం మూసివేసింది. దీంతో ప్రయాణికులు, వారిని తీసుకువెళ్లే ఈ రిక్షావాలాలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అయోధ్య అభివృద్ధిపట్ట కూడా ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని ఒక ఈ రిక్షావాలా చెప్పాడు. ‘మేం ఇక్కడ పదేళ్లుగా రిక్షాలు నడుపుతున్నాం. అయోధ్య నిర్మాణాన్ని, అందంగా అభివృద్ధి చేయడాన్ని మేం చూశాం. బీజేపీ ప్రభుత్వం ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఇక్కడ ఓటమికి బీజేపీ అభ్యర్థే కారణం. ఆయన మా సమస్యలు పట్టించుకోలేదు. ఎవరినీ కలవలేదు. మంత్రులు తరచూ ఇక్కడికి వచ్చేవారు కానీ.. ఇక్కడి సాధారణ ప్రజల సాదకబాధకాల గురించి ఆలోచించేలేదు. వారిని కలవలేదు. వచ్చేవారు.. ర్యాలీలు నిర్వహించేవారు. పేద ప్రజలను పట్టించుకోకుండా వెళ్లిపోయేవారు’ అని ఆయన ఒక వార్తా సంస్థకు చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. అయోధ్య, ఇంకా ఇలాంటి చాలా ప్రదేశాలు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాయని ఆయన అన్నారు. ‘మా ఆదాయం బాగా పడిపోయింది. మాకు ఒకప్పుడు రోజుకు 500 నుంచి 800 వచ్చేవి. ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు 250 రావడం కష్టంగా మారింది. రెండు రోజుల్లోనే పరిస్థితి దయనీయంగా తయారైంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘సందర్శకులు రామమందిరం దగ్గర, హనుమాన్‌గర్హి వద్ద కూర్చొనేవారు. ఇప్పుడు సందర్శకులే లేరు. దానితో మాకు గిరాకీ తగ్గిపోయి, ఆదాయం కూడా తగ్గిపోయింది’ అని తెలిపాడు. ప్రత్యేకించి ఎన్నికల ఫలితాల అనంతరం సందర్శకుల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. ‘గతంలో చాలా మంది వచ్చేవారు. ఇప్పుడు చాలా తక్కువ మంది వస్తున్నారు’ అని పేర్కొన్నాడు. ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలను అయోధ్యకు తీసుకువచ్చారని చెబుతున్నారు. నాయకులు కూడా తమ ఎన్నికల ప్రసంగాల్లో అయోధ్యకు తీసుకువెళతామని హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Latest News