Rahul Gandhi | అధికారంలోకి వస్తే.. చెత్తబుట్టలోకి అగ్నివీర్‌

లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి విజయం సాధిస్తే అగ్నివీర్‌ పథకాన్ని చెత్తబుట్టలో పడేస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు

  • Publish Date - May 23, 2024 / 11:55 AM IST

ఇది మోదీ పథకం.. ఆర్మీది కాదు..
మన ఆర్మీకి ఇది అవసరం లేదు
హర్యానా ఎన్నికల సభలో రాహుల్‌గాంధీ

మహేంద్రగఢ్‌: లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి విజయం సాధిస్తే అగ్నివీర్‌ పథకాన్ని చెత్తబుట్టలో పడేస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. బుధవారం హర్యానాలోని మహేంద్రగఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. భారత సైనికులను కూలీలుగా మార్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి హర్యానా వచ్చిన రాహుల్‌.. రైతుల పట్ల మోదీ అనుసరిస్తున్న తీరుపైనా నిప్పులు చెరిగారు. అగ్నివీర్‌ పథకాన్ని ప్రస్తావించిన రాహుల్‌.. ‘ఇది ఆర్మీ పథకం కాదు.. మోదీ పథకం.. ఆర్మీకి ఇది అవసరం లేదు’ అని చెప్పారు.

ఇండియా సరిహద్దులను దేశ యువత కాపాడుతుందని, దేశ యువత డీఎన్‌ఏలోనే దేశభక్తి ఉన్నదని అన్నారు. ‘రెండు రకాల అమరజవాన్లు ఉంటారని వారు చెబుతున్నారు. ఒకరు సాధారణ జవాన్‌ లేదా అధికారి. వారికి పెన్షన్‌ వస్తుంది. చనిపోతే అమర జవాన్‌ హోదా వస్తుంది. అన్ని సదుపాయాలు అందుతాయి. మరోవైపు ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి అగ్నివీర్‌ అని పేరు పెడతారు. అగ్నివీర్‌కు ఎలాంటి పెన్షన్‌ ఉండదు. అమర జవాన్‌ హోదా రాదు.. క్యాంటిన్‌ సదుపాయం ఉండదు’ అని రాహుల్‌ చెప్పారు. 2022లో కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్‌ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం స్వల్పకాలానికి సాయుధ బలగాల్లో చేర్చుకుంటారు.

తద్వారా త్రివిధ దళాల సర్వీసుల వయోపరిమితిని తగ్గించాలనేది లక్ష్యం. పదిహేడున్నర ఏళ్లు మొదలుకుని 21 ఏళ్లలోపు యువతను ఈ పథకం ద్వారా నాలుగేళ్ల కాలపరిమితికి సాయుధ దళాల్లోకి రిక్రూట్‌ చేసుకుంటారు. వారిలో 25శాతం మందిని 15 ఏళ్లపాటు కొనసాగిస్తారు. దీనిపై యువతలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది. ఇదిలా ఉంటే.. రైతుల అంశాన్ని ప్రస్తావించిన రాహుల్‌ గాంధీ.. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని మోదీ ప్రభుత్వం.. శతకోటీశ్వరులకు మాత్రం 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందని మండిపడ్డారు. ‘జూన్‌ 4న మేం అధికారంలోకి రాగానే.. రైతుల రుణాలు మాఫీ చేస్తాం’ అని ఆయన ప్రకటించారు. ఈ విషయంలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Latest News