హైదరాబాద్, అక్టోబర్ 03(విధాత): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొలంబియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన భారతదేశ సంస్థ అయిన బజాజ్ పల్సర్ బైక్ ముందు దిగిన ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. బజాజ్, టీవీఎస్, హీరో వంటి సంస్థలు కొలంబియాలో రాణించడం చూస్తుంటే గర్వంగా ఉందని కొనియాడారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అలాగే ది ఫ్యూచర్ ఈజ్ టుడే పేరిట ఈఐఏ యూనివర్సిటీలో రాహుల్ ప్రసంగించారు. మూడు, నాలుగు వ్యాపార సంస్థలు దేశ ఆర్థికవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనను ఖండించారు. భారత్‌లో అనేక మతాలు, కులాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ అందరికీ చోటు కల్పిస్తున్నది, కానీ ప్రస్తుతం ఈ వ్యవస్థ ముప్పేట దాడిని ఎదుర్కొంటోందని అన్నారు. రాహుల్ ఈ విధంగా మాట్లాడటంపై స్వదేశంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతర దేశాల్లో భారత్‌ను అవమానించడమే ఆయన పని అని, దేశ ప్రజలను నిజాయతీ లేనివారిగా చిత్రీకరిస్తున్నారని ఎంపీ కంగనా రనౌత్ ధ్వజమెత్తారు.