Site icon vidhaatha

Rajnath Singh | వచ్చే పదేళ్లు మోదీనే ప్రధాని: రాజ్‌నాథ్ సింగ్

ఆయన పదవీ విరమణ గురించి ఆలోచించనే లేదు
రిజర్వేషన్లు ఎత్తివేస్తారన్న ప్రచారంలోనూ వాస్తవం లేదు

విధాత: బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే మోడీనే ప్రధాని అవుతారని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఈ విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. వచ్చే ఏడాది ప్రధాని మోడీకి 75 ఏళ్లు పూర్తి కానుండటంతో ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొని అమిత్‌షాకు పగ్గాలు అప్పగిస్తారని కేజ్రీవాల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు.

మరో పదేళ్లు మోడీనే ప్రధానిగా ఉంటారని, ఆయన పదవీ విరమణ గురించి ఆలోచించనే లేదన్నారు. బీజేపీ మూడోసారి అధికారం చేపడితే రిజర్వేషన్లు ఎత్తివేస్తారన్న ప్రచారంలోనూ ఏమాత్రం వాస్తవం లేదని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగం అనుమతించదని తెలిపారు. దేశ రాజకీయాల విశ్వసనీయతపై ప్రశ్నలు ఉత్పన్నం కావడానికి ప్రతిపక్షాలే కారణమని రాజ్‌నాథ్‌ సింగ్‌ ధ్వజమెత్తారు.

బీజేపీ సీనియర్‌ నేతగా చెబుతున్నానని, 2024, 2029లోనూ ప్రధాని మోడీయే ఉంటారు. ఆయన తప్పుకునే విషయంలో మేం ఆలోచించనే లేదు. ఆ వ్యక్తి అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్టను పెంచారు. ఆ వ్యక్తి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. అత్యధిక వేగంతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గా మారింది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా చెబుతున్నాయి. 2014 వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ 11వ స్థానంలో ఉండేది.

మోడీ హయంలోనే 5వ స్థానానికి ఎగబాకింది. 2027 ఆరంభంలోనే మూడో స్థానానికి చేరనున్నది. అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్‌ అవతరించనున్నది. విశ్వమహాశక్తిగా అవతరించే దిశగా భారత్‌ దూసుకుపోతున్నది. ఎవరినో బెదిరించడానికి మహాశక్తి కావాలనుకోవడం లేదు. విశ్వకల్యాణం కోసమే మహాశక్తిగా అవతరించాలనుకుంటున్నామని రాజ్‌నాథ్‌ తెలిపారు.

Exit mobile version