రెండు వారాల భీకర పోరాటం, ప్రకృతితో నిరంతర సంఘర్షణతో చివరకు జాతి ఊపిరి పీల్చుకున్నది. ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు.. సమిష్టి కృషి వల్ల సురక్షితంగా బయటకు వచ్చారు. కార్మికుల కుటుంబాలు, మొత్తం దేశం అంతా సంతోషించారు.అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తుతున్నది. మోదీ ప్రభుత్వ హయాంలో ఇలా వరుస వైఫల్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఊహించడానికే భయంకరమైన ఉత్తరాకాశీ ఘటనలో బాధాకరమైన విషయం ఏమిటంటే ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకూడదు. ప్రమాదకర పని స్థలాల్లో తగిన భద్రతా ప్రమాణాలతో రక్షణ ఏర్పాట్లు ఉండాలి. కానీ వాస్తవంగా ఇటువంటి ప్రాజెక్టులు నిర్మిస్తున్న సందర్భాల్లో నిర్ణయించిన సేప్టీ ప్రొటోకాల్ పద్ధతులను అనుసరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉత్తరకాశీ టన్నెల్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. తూ.చ తప్పక అమలు చేయాల్సిన సేఫ్టీ పద్ధతులను నిర్లక్ష్యం చేయడం వల్లనే కార్మికులు రెండు వారాలు తమ ప్రాణాలు నిలబెట్టు కోవడానికి నరక యాతనలు పడవలసి వచ్చిందని అంటున్నారు. ప్రాజెక్టులను కాంట్రాక్టు తీసుకున్న కంపెనీలు భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం వెంటనే పట్టించుకొని వాటిని సరిచేసేలా చూడాలి. మోదీ ప్రభుత్వం ఉత్తర కాశీ టన్నెల్ డ్రిల్లింగ్ పనుల సందర్భంగా ఆ నియమాలను అమలు జరిపే విధంగా చూడలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఉత్తరకాశి టన్నెల్ తవ్వకాలు ప్రారంభించి, కొంత దూరం పూర్తయిన తర్వాత ఏదైనా దుర్ఘటనలు సంభవించి, అందులో పని చేసేవాళ్లు చిక్కుకుపోతే, ఎమర్జెన్సీగా బయటికి తీయడానికి నియమాల ప్రకారం ప్రత్యామ్నాయ టన్నెల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కిలోమీటన్నర టన్నెల్ పని పూర్తయితే ఒక ఎమర్జెన్సీ టన్నెల్ ఉండానేది నియమం. కానీ.. ఉత్తరకాశీ సొరంగం విషయంలో అత్యవసర మార్గాన్ని నిర్మించలేదు.
సొరంగం పనులు చేసే సమయంలో భూకంపాలు గాని, ఇతర ప్రకృతి విపత్తులు కానీ చోటు చేసుకుంటే సురక్షితంగా బయటపడటానికి శాస్త్రీయ పద్ధతుల్లో ఏర్పాట్లు లేవు. మూడో విషయం ఈ సొరంగంలో పనులు జరుగుతున్నప్పుడు సేఫ్టీ ట్యూబ్స్ ని, సేఫ్ గార్డ్ గా ఉపయోగించే విధంగా, లోపల ఏ ప్రమాదాలు జరిగినప్పుడైనా రక్షించబడే విధంగా ముందు ఏర్పాట్లు అవసరం. ఉత్తరకాశీ టన్నెల్ లోపల ట్యూబ్స్ గాని, ఇటువంటి పైప్స్ నిర్మించినట్లు లేదు.
ముఖ్యంగా కాంట్రాక్టులు తీసుకున్న కంపెనీలు తమ లాభాల కోసం నిబంధనలు వదిలేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నిజానికి ఉత్తరకాశి టన్నెల్ సంబందించి గత ప్రభుత్వాల తీవ్రమైన లోపం కూడా ఉంది. అసలు ఈ ప్రాంతంలో ఇటువంటి టన్నుల్ ఏర్పాటు చేయడం ఇక్కడి పర్యావరణానికి తీవ్రమైన ముప్పు. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఒక హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి, అది ఇచ్చిన సలహా మేరకు 7- 8 మీటర్ల వెడల్పు గల సొరంగాలు మాత్రమే నిర్మించాలని సుప్రీంకోర్టు సూచించింది. కానీ ప్రభుత్వం సుప్రీం సలహాను నిర్లక్ష్యం చేసి, పెద్ద ఎత్తున సొరంగ పనుల్లో పేలుడు పదార్థాల్ని ఉపయోగించిందని చెబుతున్నారు. నిపుణులు ముందుగానే ప్రమాదాల గురించి హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. పర్యావరణానికి ముప్పుగా సంభవించడానికి ఈ ప్రాజెక్టులే కాకుండా అనేక రాష్ట్ర హైవేలు, నేషనల్ హైవేలు కూడా కారణమవుతున్నాయి. గతంలో జోషి మఠ్ ఉదంతం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడి అనేకమంది చనిపోయారు, సిక్కింలో డ్యామ్ బద్దలవడం ద్వారా అనేక గ్రామాలు ముంపు గురై, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఆ సమస్యల నుండి బయట పడలేదు. గుజరాత్లో మోర్ బి బ్రిడ్జి కూలిపోవడం ద్వారా 135 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేలో జరిగిన ఘోర ప్రమాదంలో 20 ప్రాణాలు బలి అయ్యాయి. మోర్ బి బ్రిడ్జి, సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే, ఉత్తరకాశి టన్నెల్.. ఈ మూడింటి కాంట్రాక్టు సంస్థ ఒక్కటే కావడం గమనార్హం.