ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గించండి.. ఇండియా కూటమి పక్షాల డిమాండ్‌

ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని తొలగించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు డిమాండ్ చేశాయి. మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనకు దిగాయి. బీమా ప్రీమియంలపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించిన సంగతి తెలిసిందే.

  • Publish Date - August 6, 2024 / 06:19 PM IST

పార్లమెంటు ప్రాంగణంలో నిరసన

న్యూఢిల్లీ : ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని తొలగించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు డిమాండ్ చేశాయి. మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనకు దిగాయి. బీమా ప్రీమియంలపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించిన సంగతి తెలిసిందే. ఈ జీఎస్టీని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎన్సీపీ (పవార్‌) తదితర పార్టీల ఎంపీలు ప్లకార్డులు చేబూని నిరసన వ్యక్తం చేశారు. ఇది పన్ను ఉగ్రవాదమని ప్రతిపక్షాలు అభివర్ణించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.

జీవిత బీమా వంటి అత్యంత కీలకమైనవాటిపై 18 శాతం జీఎస్టీ విధించడం సరైంది కాదని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. ‘2047 కల్లా అందరికీ జీవిత బీమా, ఆరోగ్య బీమాపై కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించింది. కానీ.. అందుకు అవకాశం లేని విధంగా వాటిపై పన్నులు విధిస్తున్నారు’ అని శశిథరూర్‌ ఏఎన్‌ఐ వార్తా సంస్థతో అన్నారు.

18 శాతం జీఎస్టీ అనేది అన్యాయమని జార్ఖండ్‌ ముక్తి మోర్చా ఎంపీ మహువా మాజీ విమర్శించారు. ఈ నిర్ణయంతో మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతారని అన్నారు. ఆరోగ్య రంగంపై జీఎస్టీని తగ్గించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రాణాధార ఔషధాలు, బీమాల ప్రీమియంపై జీఎస్టీని తగ్గించాలని ఇటీవల పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సైతం ఇదే విషయంలో నిర్మలకు లేఖ రాశారు. వీటిపై పన్నులు పరిశ్రమ వృద్ధిని దెబ్బతీస్తాయని, వీటిని ఉపసంహరించాలని ఆ లేఖలో గడ్కరీ కోరారు.