హైదరాబాద్: ‘ఒకే భాష.. ఒకే సిద్ధాంతం.. ఒకే ఎన్నిక.. అనేవి రాజ్యాంగానికి వ్యతిరేకమైనవి. అప్రస్వామికమైనవి’ అని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత దేశ రాజకీయాలల్లో భారత రాజ్యాంగంపై మనువాదుల కుట్ర దాఖలాలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జ్యోతిబా ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనా విధానం వెలుగులో దేశంలోని బహుజనుల వాదాన్ని ముందుకు తీసుకొని పోవడమే నిజమైన ప్రజాస్వామ్యమని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్‌పీఏ) 3వ జాతీయ సదస్సు హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న జేఎన్టీయూలో ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి.. ఓబీసీ సమాజ కులగణన జరగకుండా పాలకవర్గాలు చేస్తున్న కుట్రలపై చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏమరపాటుకు గురికావద్దని సూచించారు.
ఈ కుట్రలు విజయవంతమైతే భారత రాజ్యాంగం ప్రాణం గాల్లో కలిసిపోతుందని హెచ్చరించారు. భారత రాజ్యాంగాన్ని సజీవంగా నిలపాలంటే న్యాయవాదులు న్యాయమూర్తులు కలిసి ఇటువంటి కుట్రలను ఎండగట్టాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రస్తుతం వృత్తిలో ఉన్న న్యాయవాదులు, రిటైర్డ్ అడ్వొకేట్స్, జడ్జీలు న్యాయమూర్తులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు, కళాకారులు, ప్రజాస్వామ్యవాదులు, పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే లాంటి ప్రజాస్వామ్యవాదులు, సిద్ధాంతవేత్తలు, భాషాకోవిదులు 21వ శతాబ్దంలో ప్రపంచంలోకానీ, దేశంలోకానీ దొరకరేమోనని వ్యాఖ్యానించారు. తాను ఆలోచించినది ప్రజాస్వామ్య బద్ధమైన సూత్రం అనుకుంటే దానిని రాసి ఉంచేవారని, వివిధ సభల్లో వివరించేవారని తెలిపారు. తద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపర్చేవారని పేర్కొన్నారు. అంబేద్కర్ నిరంతరం ప్రతి విషయంలోనూ ప్రజాస్వామ్యాన్ని తు.చ. తప్పక పాటించేవారని చెప్పారు. మన రాజ్యాంగంలోనూ దానిని పొందుపర్చారని గుర్తు చేశారు. దానిని మనం అన్నివేళలా మన దేశ పౌరులకు అందించాలని, అప్పుడే మన రాజ్యాంగం సఫలీకృతం అవుతుందని సుదర్శన్‌రెడ్డి అన్నారు.
ప్రశ్నిస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ
ప్రతి విషయాన్ని ప్రశ్నించడం ద్వారానే ప్రజాస్వామ్యం యొక్క విలువైన సూత్రం నిలబడుతుందని అన్నారు. ఏ విషయమైనాసరే ప్రశ్న లేకుండా ఆమోదించటం అంటే అది జీవచ్ఛవంలాంటిదే అన్నారు. అందువల్ల అది ఉపనిషత్తులైనా, వేదాంతమైనా, అది తత్వశాస్త్రమైనా మనం ప్రశ్నించాల్సిందేనని చెప్పారు. ప్రశ్న అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం లాంటిదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా రాజ్యాంగబద్ధమైన, విలువైన అంశమని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. బలమైన ప్రతిపక్షం ఉండటం ద్వారానే ప్రజాస్వామ్యం బలంగా అమల్లోకి వస్తుందని నొక్కి చెప్పారు. దేశంలో ప్రతి భాషకు స్థానం ఉండాలని సుదర్శన్‌రెడ్డి అన్నారు.
ఒకే భాష అందరూ మాట్లాడాలనడం, ఒకే భాషను మిగతా వారిపై రుద్దటం అది ప్రజాస్వామికం కాదని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతివారికీ వారి సొంత మాతృభాష ఉంటుందని, ఆ మాతృభాషకు మన రాజ్యాంగంలో స్థానం కల్పించాలని చెప్పారు. అలా మన దేశంలోని ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా వారి భాషకు, సంస్కృతికి, వారి జీవన విధానానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్యం అని అంబేద్కర్ పదేపదే మనని చెప్పేవారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్ర్మంలో ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, ఓబీసీ జాతీయ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య, మాన్యశ్రీ వామన్, సీనియర్ జర్నలిస్టు సతీష్ చంద్ర, మోకా సత్తిబాబు, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు సునీల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.