Train accident | రైల్వే క్రాసింగ్ దగ్గర కారు ఢీ.. దెబ్బతిన్న ఐదు రైలు బోగీలు..!

  • Publish Date - April 7, 2024 / 08:56 AM IST

Train accident : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం, పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్ నగరాల మధ్య రాకపోకలు సాగించే హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయిదు బోగీలు దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంవల్ల రైలు ఆరు గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని అనూప్‌పూర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. 20807 నంబర్ గల సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం తెల్లవారుజామున 12:41 గంటలకు విశాఖపట్నం నుంచి అమృత్‌సర్‌కు బయలుదేరింది. విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపూర్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, సంబాల్‌పూర్ జంక్షన్, బిలాస్‌పూర్ జంక్షన్ మీదుగా అనూప్‌పూర్ జంక్షన్‌ సమీపంలోకి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.

అనూప్‌పూర్ సమీపంలో ఒక కారు అదుపు తప్పి లెవెల్ క్రాసింగ్ దగ్గర మూసివున్న రైల్వే గేటును ఢీకొట్టింది. మితిమీరిన వేగం కారణంగా రైల్వే గేటు విరిగిపోయి కారు రైలు మీదకు దూసుకెళ్లింది. అనంతరం రైలు చక్రాల మధ్య ఇరుక్కుపోయింది. రైలు కొన్ని మీటర్ల వరకు కారును ఈడ్చుకెళ్లడంతో హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ బోగీలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రైలు ప్రయాణికులెవరికీ ఏం కాలేదు. అయితే శనివారం రాత్రి 11:25 నిమిషాలకు అమృత్‌సర్‌కు చేరుకోవాల్సిన రైలు ఆదివారం తెల్లవారుజామున చేరుకుంది.

Latest News