సంచలన అంశాలు బయటపెట్టిన హేమ కమిటీ
ప్రతి స్థాయిలో లైంగిక వేధింపులు
రాజీపడాలని, సర్దుకుపోవాలనే మాటలు
శారీకసుఖాలూ అందించాలని డిమాండ్లు
చిత్రీకరణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు కరువు
దుస్తులు మార్చుకునేందుకు భద్రమైన గదులూ లేవు
Justice Hema Committee । మలయాళ సినిమా అనేది దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండస్ట్రీ. ఇక్కడ విభిన్న, వినూత్న కథాంశాలతో రూపొందే సినిమాలు.. జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందాయి. అంతటి గొప్ప ఇండస్ట్రీలోనూ అమానవీయ పరిస్థితులు ఉన్నాయని జస్టిస్ హేమ కమిటీ (Justice Hema Committee) తన నివేదికలో పేర్కొనడం సంచలనం సృష్టిస్తున్నది. అక్కడి పని పరిస్థితులు (working conditions) దయనీయంగా ఉన్నాయని, మహిళలు వేధింపులకు గురవుతున్నారని, వారికి న్యాయం జరగడం లేదని తెలిపింది. హేమ కమిటీ నివేదికలో బయటపడిన అంశాలు.. పని ప్రదేశాల్లో లింగ సమానత (gender equality) విషయంపై పెను చర్చను రాజేశాయి. కేరళలో కదులుతున్న వాహనంలో ఒక నటిపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) ఫిర్యాదు మేరకు ఈ కమిటీ కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేసులో నటుడు దిలీప్ ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నాడు.
మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, అక్కడి పని పరిస్థితులు, మహిళలకు అందుతున్న రెమ్యునరేషన్, సాంకతిక రంగాల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీని ఉద్దేశించారు. పరిశ్రమలో లింగసమానతను పరిరక్షించేందుకు, భద్రత, రక్షణ చర్యలను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు ఇవ్వాలని కమిటీని కోరారు. దీనిపై కార్యరంగంలోకి దిగిన కమిటీ.. తొలుత చాలా ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వచ్చింది. పరిశ్రమలోని వ్యక్తులను కలుసుకునేందుకు, కమిటీ అడిగిన అంశాలకు పలువురు సమాధానాలు ఇవ్వడంలో కాలయాపన, తమ కమిటీ రూపొందించే నివేదికను సిద్ధం చేసుకునేందుకు తగిన స్టెనోగ్రాఫర్ వంటి వారు లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ కమిటీ తనకు అప్పగించిన పనిని నెరవేర్చింది.
కమిటీ గుర్తించిన అంశాలివే..
పలువురు సాక్షులను సంప్రదించిన తర్వాత కమిటీ తన నివేదికను రూపొందించింది. వేధింపులు అనేవి పరిశ్రమ తొలి అంచెలోనే ఉన్నాయని తెలిపింది. మహిళలకు తగిన మరుగుదొడ్లు లేవని, దుస్తులు మార్చుకునేందుకు అనువైన గదులు (changing rooms) కూడా లేవని హేమ కమిటీ పేర్కొన్నది. ఈ సమస్యను పరిష్కరించేందుకు చిత్రీకరణ జరిగే ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మహిళా నటులు దుస్తులు మార్చుకునేందుకు కూడా సురక్షితమైన తాత్కాలిక గదులను ఏర్పాటు చేయాలని సూచించింది.
సర్దుకు పోవాలంటున్నారట..
ఒక మహిళ లేదా యువతి సినిమాలో అవకాశం కోసం ప్రొడక్షన్ కంట్రోలర్ లేదా ఎవరినైనా సంప్రదిస్తే.. ‘సర్దుకుపోవాలి’.. ‘రాజీపడాలి’’ అనే మాటలు వస్తున్నాయని కమిటీ తెలిపింది. ఇవి చేస్తే సినిమా రంగంలో శిఖరాలు అధిరోహిస్తారని చెబుతున్నారని పేర్కొన్నది. ‘సర్దుకుపోవడం (Adjustment), రాజీపడటం (compromise) అనే రెండు పదాలు మలయాళ సినిమాలో మహిళలకు తరచూ వినిపించే పదాలు. అవసరాన్ని బట్టి శారీరక సుఖాలు అందించేందుకు కూడా సిద్ధపడాలని చెబుతున్నారు’ అని నివేదిక బయటపెట్టింది.
పదే పదే తలుపు తట్టడం..
ఒంటరిగా ఉండటం అంత సురక్షితం కాదనే ఉద్దేశంతో మహిళా నటులు.. స్నేహితులనో, బంధువులనో దగ్గర ఉంచుకుంటారు. ‘వారు బస చేసిన హోటల్ గదుల తలుపులను సినిమాలో పనిచేస్తున్న పురుషులు పదేపదే తడుతుంటారు. అందులోనూ ఎక్కువమంది మద్యం ప్రభావంలో (intoxication) ఉంటారు. ఆ తలుపులు తట్టడం కూడా మర్యాదపూర్వకంగా, సున్నితంగా ఉండదని, తలుపులు గట్టిగా దబదబ బాదుతారని చాలా మంది చెప్పారు. చాలాసార్లు ఆ తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తారేమోనని భయపడేవాళ్లమని తెలిపారు’ అని నివేదిక పేర్కొన్నది.
ఈ నివేదిక ఒక నటి అనుభవాన్ని ఉదాహరణగా పేర్కొన్నది. ‘ఒక నటుడికి భార్యగా నటించాల్సి వచ్చిన ఒక నటిపై అంతకు ముందే లైంగిక దాడి జరిగింది. ఆ బాధ, కోపం అన్నీ ఆమె ముఖంలో ప్రతిఫలించాయి. దానితో ఒక చిన్న టేక్‌తో తీయాల్సిన సీన్‌కు 17 టేక్స్ పట్టాయి. ఇన్ని టేక్స్ తీసుకున్నందుకు దర్శకుడు ఆమెనే నిందించాడు’ అని నివేదికలో రాశారు.
పరువు పోతుందని ఎవరికీ చెప్పుకోలేక..
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు గురైన బాధితులు ఎక్కడ తమ ప్రాణాల మీదకు వస్తుందోనన్న భయంతో, తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొనే పర్యవసనాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం లేదని హేమ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ‘సాధారణ మహిళల కంటే వారు ఎంతో సంకట స్థితిని (embarrassment) ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే.. వారు పబ్లిక్ ఫిగర్స్. సైబర్ దాడులవంటివాటికి గురవుతామని భయపడుతున్నారు’ అని నివేదిక తెలిపింది.
గుత్తాధిపత్యం
గుప్పెడు బలమైన నిర్మాతలు, దర్శకులు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్ల గుత్తాధిపత్యంలో (all-powerful nexus) పరిశ్రమ నడుస్తున్నదని హేమ కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. గుత్తాధిపత్యం వహించే వారిలో ఎవరైనా లైంగికదాడికి పాల్పడితే.. సదరు మహిళ తనను ఈ సినిమా నుంచే కాకుండా.. వేరేవాళ్లు నిర్మించే సినిమాల్లో నుంచి కూడా తీసేస్తారనే భయంతో సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు సాహసించడం లేదని నివేదిక తెలిపింది. అదే జరిగితే ఆమె కెరీర్ అక్కడితో ముగిసిపోతుందని పేర్కొన్నది. ఈ గుత్తాధిపత్య శక్తుల చేతిలో పలువురు వర్ధమాన నటులు కూడా బాధితులుగా మారుతున్నారని తెలిపింది.
రెమ్యునరేషన్ కోసం పాట్లు
‘టాప్ స్టార్లకు మినహా మిగిలిన చాలా మందికి రెమ్యునరేషన్ (remuneration) విషయంలో రాతపూర్వక ఒప్పందం ఏమీ ఉండదు. మహిళా నటులు, జూనియర్ యాక్టర్‌లకు పూర్తి వేతనం ఇవ్వరు’ అని హేమ కమిటీ నివేదిక పేర్కొన్నది. తమకు హక్కుగా రావాల్సిన పూర్తి వేతనం కోసం మహిళా నటులు అడుక్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఈ సమస్యలను పరిష్కరించడం మహిళలకు న్యాయం చేయడం మాత్రమే కాదని, కేరళ సినీ పరిశ్రమలో సమ్మిళిత, సమాన అవకాశాలు కల్పించడం అవుతుందని నివేదిక సూచించింది.