విమానంలో సమస్య – రెండు గంటలు గాల్లోనే.. సురక్షితంగా క్రాష్​ ల్యాండింగ్​

తిరుచ్చి(Trichy) నుండి షార్జా(Sharjah) వెళ్తున్న ఎయిర్​ ఇండియా (Air India flight)విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్​ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే పైలట్​ ఎమర్జెన్సీ ప్రకటించారు. దాంతో దాదాపు రెండు గంటలుగా తిరుచ్చిపై గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు పైలట్​ చాకచక్యంతో విమానాశ్రయంలోనే సేఫ్​ ల్యాండింగ్​(Safe landed) చేసారు. రెండున్నర గంటల పాటు నరకం అనుభవించిన ప్రయాణీకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Publish Date - October 11, 2024 / 10:07 PM IST

తమిళనాడులోని తిరుచ్చి నుండి షార్జాకు బయలుదేరిన ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​(Air India Express) AXB-613 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం హైడ్రాలిక్​ వ్యవస్థ(Hydraulic System)లో లోపం ఏర్పడటంతో  చక్రాలు పూర్తిగా మూసుకోకపోవడంతో  మామూలుగా ల్యాండింగ్​ అయ్యే అవకాశం లేకుండా పోయింది. అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్​ (Emergency Landing)కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. విమానాన్ని నడుపుతున్న పైలట్​(Pilot) ఎంతో సాహసంతో, తన అనుభవాన్ని ఉపయోగించి రన్​వే పైనే సురక్షితంగా విమానాన్ని దింపాడు. ఇందులో ఎవరికీ ఎటువంటి హానీ జరుగలేదు. ప్రయాణీకులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు(All are safe).

ఈ ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ AXB-613 విమానంలో 140 మంది ప్రయాణీకులు (140 Passengers) న్నారు. టేకాఫ్​ అయిన కొద్ది నిమిషాల్లోనే హైడ్రాలిక్​ వ్యవస్థ పనిచేయడం లేదని గ్రహించిన పైలట్​ గ్రౌండ్​కు ఎమర్జెన్సీ సందేశం పంపించాడు. చక్రాలు పూర్తిగా మూసుకోకపోవడం వలన సాధారణ ల్యాండింగ్​ చేసే పరిస్థితి లేదు. కేవలం ఎమర్జెన్సీ ల్యాండింగ్​ మాత్రమే చేయాలి. ఇది చాలా ప్రమాదకరమైన పద్ధతి. కానీ ఇతర మార్గాలేవీ లేవు.  రన్​వేకు సమాంతరంగా విమానాన్ని నడుపుతూ, మెల్లగా రన్​వే మీదకు విమానాన్ని దింపాలి. ఆలా క్రాష్​ ల్యాండింగ్​ అయినప్పుడు ఏదైనా జరగొచ్చు. ముందు జాగ్రత్తగా 20 అగ్నిమాపక యంత్రాలు, 20 అంబులెన్సులు తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాయి.

ప్రతీ సెకండ్​ విమానం పైలట్​, గ్రౌండ్​ సిబ్బందితో మాట్లాడుతూ,  చాలా చాకచక్యంగా విమానాన్ని ఎయిర్​పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్​ చేయగలిగారు. అయితే తలెత్తిన సమస్య ఎలాంటిది? ఎలా పరిష్కరించారనేది తెలియాల్సిఉంది. మొత్తానికి 140 మంది ప్రయాణీకులు, సిబ్బంది సురక్షితంగా ఉండటంతో అంతా సంతోషించారు.