రాజ్యసభ సభ్యురాలిగా సోనియా ప్రమాణం

  • Publish Date - April 4, 2024 / 05:30 PM IST

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ గురువారం (04.04.2024) రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. రాజస్థాన్‌ నుంచి ఆమె రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ పదవీకాలం ముగియడంతో ఎగువ సభలో ఏర్పడిన ఖాళీని కాంగ్రెస్‌ పార్టీ సోనియాగాంధీతో భర్తీ చేసింది. రాజ్యసభ సభాపక్ష నేత పీయూష్‌గోయల్‌, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సమక్షంలో సోనియా రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. ఈ సమయంలో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా, కుమారుడు రాహుల్‌గాంధీ, అల్లుడు రాబర్ట్‌ వాద్రా, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్‌, కాంగ్రెస్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఎక్స్‌లో పార్టీ చీఫ్‌ ఖర్గే ఒక పోస్ట్‌ పెడుతూ.. ‘కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ శ్రీమతి సోనియా గాంధీకి శుభాకాంక్షలు. రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేయడం ద్వారా ఆమె తన కొత్త ఇన్నింగ్స్‌ మొదలు పెడుతున్నారు. ఒడిదుడుకుల నేపథ్యంలో పార్లమెంటరీ వ్యూహాలలో ఆమె మార్గదర్శకత్వం కొనసాగుతుందని ఆశిస్తున్నాను. లోక్‌సభ సభ్యురాలిగా ఆమె 25 ఏళ్లు ఉన్నారు. ఇప్పుడు నేను, నా సహచర సభ్యులు ఆమె ఎగువ సభకు రావడం కోసం ఎదురు చూస్తున్నాను’ అని పేర్కొన్నారు. 2004 నుంచి వరుసగా ఐదు పర్యాయాలు సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆమె వయసు 77 సంవత్సరాలు.

గురువారం మొత్తం పద్నాలుగు మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. అందులో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కూడా ఉన్నారు. ఒడిశా నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ కర్ణాటక నుంచి, బీజేపీ నేత శామిక్‌ భట్టాచార్య బెంగాల్‌ నుంచి ఎన్నికై ప్రమాణం చేశారు. వారితో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఉపాధ్యక్షుడు జగ్దీప్‌ ధనకర్‌ ప్రమాణం చేయించారు. ఏపీ నుంచి వైఎస్సార్సీపీ నేతలు గొల్ల బాబూరావు, మేడ రఘునాథ్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు.

సోనియా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమె రాజ్యసభను కోరుకున్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. రాయబరేలీలో విజయావకాశాలపై అనిశ్చితి కూడా ఆమె నిర్ణయానికి కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. 2019 నుంచి యూపీలో రాయబరేలీ ఒక్కటే కాంగ్రెస్‌ గెలిచింది.

Latest News