విధాత, హైదరాబాద్: భారత దేశంలో భారతదేశంలో వాహనాల ఫ్యాన్సీ, సింబాలిక్ నంబర్ ప్లేట్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతకాదు. తాజాగా జరిగిన ఒక ప్రత్యేక వాహనాల వేలంలో ఏపీ వాసి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ DDC 001 ను రూ. 2.08 కోట్లకు కొనుగోలు చేయడం సంచలనంగా మారింది. ఇది దేశంలోనే ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా రికార్డు సృష్టించింది. ఆక్షన్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ లగ్జరీ ఆటోమోటివ్ ప్లాట్‌ఫామ్ బిగ్ బాయ్ టాయ్జ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో అందరి దృష్టి DDC 001 నంబర్ పై పడింది. వేలం ప్రక్రియలో అనేక మంది సంపన్నులు ఈ నంబర్ ప్లేట్ కోసం పోటిపడ్డారు. చివరికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కిరణ్ కోల్పాకుల అత్యధికంగా రూ. 2.08 కోట్ల బిడ్ వేసి ఈ నంబర్‌ను దక్కించుకున్నారు. దేశంలోనే ఇది అత్యధిక ఖరీదైన నంబర్ ప్లేట్ వేలంగా నిలిచింది. రికార్డు ధర పలికిన ఈ “DDC 001” నంబర్ ప్లేట్ గతంలో బిగ్ బాయ్ టాయ్జ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ జతిన్ అహుజా పేరు మీద ఉండటం గమనార్హం.
ఇప్పటిదాక భారతదేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా HR88B8888 గుర్తింపు పొందింది. ఇది గత ఏడాది నవంబర్‌లో జరిగిన అధికారిక వేలంలో రూ. 1.17 కోట్లకు అమ్ముడవ్వడం విశేషం. దానికంటే ముందు KL 07 DG 0007 నంబర్ ప్లేట్ రూ. 46 లక్షలకు అమ్ముడై అప్పట్లో రికార్డుగా నిలిచింది. ఈ నంబర్‌ను లిట్‌మస్7 వ్యవస్థాపకుడు వేణు గోపాలకృష్ణన్ తన ఖరీదైన లాంబోర్గిని ఉరుస్ పెర్ఫార్మాంటే కోసం కొనుగోలు చేశారు. ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లకు నానాటికి పెరిగిపోతున్న డిమాండ్ ను చూస్తే.. భవిష్యత్తులో ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు కూడా కార్లు, బంగారం, వెండి వస్తువలతో సమానంగా విలువైన ఆస్తులుగా పరిగణించబడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వేలంలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి వాడిన మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి సొంతమైన మెర్సిడెస్-బెంజ్ CLA 200d, భారత క్రికెటర్ దినేష్ కార్తీక్‌కు చెందిన రేంజ్ రోవర్ స్పోర్ట్ SVR వంటి హైఎండ్ వాహనాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇవి కూడా చదవండి :
Oracle layoffs | ఉద్యోగులకు షాక్.. 30,000 మందిపై ఒరాకిల్ వేటు..?
Vermicompost Business | వర్మీకంపోస్ట్ బిజినెస్.. ఏడాదికి రూ. 70 లక్షలు సంపాదిస్తున్న ఇద్దరు స్నేహితులు..!
