విధాత : విదేశాల నుంచి బంగారు ఆభరణాలు తెచ్చుకునే అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2016నుంచి అమలులో ఉన్న డ్యూటీ-ఫ్రీ దిగుమతి పరిమితిని పెంచుతూ.. కొత్తగా రూ. 75 వేల వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా భారత్‌కు తీసుకురావడానికి అనుమతి ఇచ్చింది. ఈ మార్పులు ‘బ్యాగేజ్ రూల్స్, 2026’ కింద చేపట్టగా.. ఫిబ్రవరి 2, 2026 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ఈ మేరకు అధికార ప్రకటన విడుదల చేసింది. పదేళ్ల తర్వాత మార్పులు చేసిన కొత్త బ్యాగేజ్ నిబంధనల మేరకు విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలు.. విమాన మార్గం లేదా సముద్ర మార్గం ద్వారా భారత్‌కు వచ్చే క్రమంలో తమ వ్యక్తిగత వినియోగానికి సంబంధించిన వస్తువులను రూ. 75 వేల విలువ వరకు కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. ఈ పరిమితి ప్రయాణికుడు వెంట తెచ్చుకునే పర్సనల్ బ్యాగేజ్, చెక్-ఇన్ లగేజ్ రెండింటికీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండేళ్ల లోపు వయసున్న పిల్లలకు ఈ మినహాయింపు వర్తించదు.
ఇంతకు ముందు ఈ డ్యూటీ-ఫ్రీ పరిమితి రూ. 50 వేలు మాత్రమే ఉండేది.పెరిగిన ధరలు, అంతర్జాతీయ మార్కెట్లలో వస్తువుల ఖర్చులు, ప్రయాణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పరిమితిని పెంచింది. ఈ మార్పులు భారతీయులకు మాత్రమే కాకుండా, విదేశీ పర్యాటకులకు కూడా వర్తిస్తాయి. విదేశీ ప్రయాణికులు ఇప్పుడు రూ. 25 వేల వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా తీసుకురావచ్చు. గతంలో ఈ పరిమితి కేవలం రూ. 15 వేలు మాత్రమే ఉండేది. ఈ పెంపు వల్ల భారత్‌కు వచ్చే పర్యాటకులకు మరింత సౌకర్యం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే సుంకం మినహాయింపు పరిమితి పూర్తిగా వ్యక్తిగతం. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఉంటే, వారికి విడివిడిగానే ఈ పరిమితులు వర్తిస్తాయి. ఒక ప్రయాణికుడికి ఉన్న పరిమితిని మరొకరితో పంచుకునేందుకు, కలపడానికి కుదరదు అని స్పష్టంగా పేర్కొన్నారు.
40గ్రాముల వరకు బంగారు ఆభరణాలు తెచ్చుకోవచ్చు
కొత్త బ్యాగేజ్ నిబంధనల మేరకు బంగారు ఆభరణాల విషయంలోనూ పరిమితిని పెంచారు. మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను, పురుషులు లేదా ఇతర ప్రయాణికులు 20 గ్రాముల వరకు బంగారాన్ని డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. అయితే వీరు ఏడాదికి పైగా విదేశాల్లో నివసిస్తూ, తిరిగి వస్తున్న వారు లేదా భారత సంతతి పర్యాటకులైనా కావచ్చు. అయితే ఈ ఆభరణాలు వ్యక్తిగత వినియోగానికి సంబంధించినవై ఉండాలని, వాణిజ్య ఉద్దేశంతో ఉండకూడదని నిబంధనలో పేర్కొన్నారు. బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉండే బంగారానికి ఈ మినహాయింపు లభించదు. ఇప్పటివరకు మహిళలు రూ.1 లక్ష, పురుషులు రూ.50 వేల విలువైన ఆభరణాలే ఇలా తెచ్చుకునే వెసులుబాటు ఉండేది.
డ్యూటీ-ఫ్రీ పరిమితి పెరగడం వల్ల ప్రయాణికులు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, బహుమతులు, వ్యక్తిగత వినియోగ వస్తువులు వంటి వాటిని తక్కువ ఖర్చుతో భారత్‌కు తీసుకురాగలుగుతారు. దీంతో విదేశీ కొనుగోళ్లపై వచ్చే అదనపు భారం తగ్గుతుంది. ఈ కొత్త నిబంధనలతో ప్రధానంగా లబ్ధి పొందేది భారతీయ పౌరులు అని చెప్పవచ్చు. ప్రయాణానికి ముందే ఈ నియమాలను తెలుసుకుని, అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటే కస్టమ్స్ వద్ద ఎలాంటి సమస్యలు ఎదురుకావని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు.
విదేశీయులకు ప్రత్యేక పరిమితి : కొత్త నిబంధనలతో విమానం లేదా నౌకలపై వచ్చే విదేశీ పర్యాటకులు రూ.25,000 విలువైన కొత్త వస్తువులనే సుంకం లేకుండా తీసుకురావచ్చు. భూమార్గం (రోడ్డు లేదా రైలు) ద్వారా వచ్చే ప్రయాణికులకు వారి వ్యక్తిగత అవసరాలకు వాడే పాత వస్తువులపైనే మినహాయింపు అమలవుతుంది.
ఇకపోతే ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న ప్రయాణికులు (విమాన సిబ్బంది కాకుండా) అదనంగా ఒక కొత్త ల్యాప్‌టాప్ లేదా నోట్‌ప్యాడ్‌ను సుంకం లేకుండా తమ లగేజీలో తీసుకురావచ్చు. ప్రయాణంలో వ్యక్తిగత అవసరాల కోసం తెచ్చుకునే పాత వస్తువులపై (దుస్తులు, ఇతర పరికరాలు) ఎలాంటి సుంకం ఉండదని కేంద్రం పేర్కొంది.
శాశ్వతంగా స్వదేశానికి తిరిగి వచ్చే వారికి ప్రత్యేక మినహాయింపులు ప్రకటించారు. ఉద్యోగ రీత్యా లేదా ఇతర కారణాల వల్ల విదేశాల్లో ఉండి, ఇప్పుడు శాశ్వతంగా భారత్‌కు తిరిగి వచ్చే వారికి, నివాస కాలం ఆధారంగా గృహోపకరణాలపై ప్రత్యేక మినహాయింపులు వర్తించనున్నాయి. విదేశాల్లో 3-12 నెలలు నివాసం ఉన్న వారికి రూ.1,50,000 విలువైన గృహోపకరణాలు, గత రెండేళ్లలో ఏడాదిపాటు విదేశాల్లో ఉన్న వారు రూ.3 లక్షల విలువైన వస్తువులను తీసుకురావొచ్చు. కనీసం రెండేళ్లు విదేశాల్లో ఉండి, తిరిగి వచ్చేవారు గరిష్ఠంగా రూ.7.50 లక్షల విలువైన వస్తువులను సుంకం లేకుండా తెచ్చుకోవచ్చు.
ఇవి కూడా చదవండి :
PM Kisan Funds : రైతులకు గుడ్ న్యూస్..పీఎం కిసాన్ నిధులు ఈ నెలలోనే !
India US Trade Deal| భారత్ తో అమెరికా ట్రేడ్ డీల్..స్టాక్ మార్కెట్ల పరుగులు
