NRI Open Plots Encroachment Issues  | ఉండేది విదేశాల్లో.. భూములు ఇక్కడ.. ప్లాట్ల కొనుగోలుపై ఎన్నారైల్లో భయం!

విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలు హైదరాబాద్‌ లేదా శివారు ప్రాంతాల్లో భూములు, ఓపెన్‌ ప్లాట్లు కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారా? వారి భయాలకు కారణాలేంటి? వారికి కల్పించాల్సిన భరోసా ఏంటి?

NRI Open Plots Encroachment Issues  | ఉండేది విదేశాల్లో.. భూములు ఇక్కడ.. ప్లాట్ల కొనుగోలుపై ఎన్నారైల్లో భయం!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 (విధాత ప్రతినిధి):

NRI Open Plots Encroachment Issues  | హైదరాబాద్‌లో లేదా శివారు ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ఓపెన్ ప్లాట్లు, భూములకు రక్షణ లేదని ఎన్ఆర్ఐలు ఆందోళన చెందుతున్నారనే మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పెట్టుబడి అవసరాల కోసమో లేక హైదరాబాద్‌లో భవిష్యత్తులో స్థిరపడే ఆలోచనతోనో కొనుగోలు చేసిన ప్లాట్లు ఆనవాళ్లే లేకుండాపోతున్నాయనే భయం ఎన్ఆర్ఐల్లో కనిపిస్తోంది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మందకొడిగా మారడానికి ఎన్ఆర్ఐలు పెద్దగా ఇన్వెస్ట్ చేయకపోవడం కూడా కారణమనే అభిప్రాయాలు లేకపోలేదు. రక్షణ కల్పించాల్సిన అధికారులు ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతున్న సందర్భాలు వెలుగు చూస్తుండటంతో ఎన్ఆర్ఐలు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఎన్ఐఆర్ఐల ఇబ్బందులు ఏంటి?

హైదరాబాద్, తెలంగాణల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగిన సమయంలో ఎన్ఆర్ఐల పెట్టుబడులు కూడా కారణమే. రియల్ ఎస్టేట్ రైజింగ్‌లో ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగానో, పరోక్షంగా కారణమనే అభిప్రాయాలున్నాయి. కొంత కాలంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. హైదరాబాద్ లోనో శివారు ప్రాంతాల్లోనో ఓపెన్‌ ప్లాట్లు, భూములు కొనుగోలు చేస్తే వాటికి రక్షణ ఎలా అనే ఆందోళన ఎన్నారైలలో కనిపిస్తున్నది. ఇటీవల కాలంలో వెలుగు చూసిన భూఆక్రమణల ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కీసర మండలం రాంపల్లిలో ఎన్ఆర్ఐ రజితా రెడ్డి భూమి ఆక్రమణకు గురైంది. దీనిపై అధికారులను ఆశ్రయించినా వారు కూడా అక్రమార్కులకు వత్తాసు పలికారని ఆమె ఆరోపణలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎన్ఆర్ఐకి వారసత్వంగా వచ్చిన భూమిని మరో కుటుంబం పేరున మార్చారు. ఈ భూమిని తిరిగి తన పేరును మార్పించుకొనేందుకు ఆ ఎన్ఆర్ఐ తిరగని అధికారి, కార్యాలయం లేదు. చివరికి ఈ సమస్యను ఆయనే తనకున్న పరిచయాల ద్వారా పరిష్కరించుకున్నారని సమాచారం. ఓ ప్లాట్ కొనుగోలు చేసి విదేశాలకు వెళ్లిన తమకు చెందిన స్థలం ఆనవాళ్లు కొందరు మార్చవేశారని ఒక ఎన్నారై వాపోయారు. ఆ స్థలంలో తప్పుడు పత్రాలతో భవనం నిర్మించడంతో తన స్థలం కోసం ఆ ఎన్ఆర్ఐ ఆవేదన అంతా ఇంతా కాదు. ఇటువంటి వివాదాలు ఎదుర్కొంటున్న కొందరు ఎన్నారైలు వాటిని పరిష్కరించుకునేందుకు సొంతూరికి రావాల్సి వస్తున్నది. అయితే ఆ పరిష్కారం ఎప్పుడు అవుతుందనే విషయంలో ఎవరికీ గ్యారెంటీ లేకుండా పోతున్నది. కొన్నిసార్లు కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వస్తున్నది. ఇటువంటి ఉదంతాలతో భవిష్యత్తులో ఇక్కడే సెటిల్ అవుదామనే కోరికతోనో పేరేంట్స్ కోసమో, భవిష్యత్తు అవసరాల కోసమో పెట్టిన పెట్టుబడి అక్రమార్కులు కబ్జా చేస్తారనే భయంతో ఎన్ఆర్ఐలు ముందుకు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమస్యలను ఎన్ఆర్ఐలు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే డెబ్బై శాతం సమస్య క్షేత్రస్థాయిలోనే తీరిపోతోంది. కానీ, ఆక్రమణదారులకు కొందరు అధికారులు వంతపాడుతున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.

భూముల కొనుగోలుకు ముందుకురాని ఎన్ఆర్ఐలు

రియల్ ఎస్టేట్ కొంత కాలంగా స్తబ్ధుగా ఉంది. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు బయటకు చేసే ప్రచారానికి వాస్తవానికి మధ్య చాలా తేడా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. డీటీసీపీ, హెచ్ఎండీఏ, రెరా అనుమతి లేకుండానే ప్లాట్ల విక్రయం జరుగుతున్న ఉదంతాలూ ఉంటున్నాయి. ఇలా అనుమతి లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారు. భూమిపై ఓనర్ షిప్ వివాదాలు, ఒకే ప్లాట్ లేదా ఒకేభూమిపై రెండు మూడు రిజిస్ట్రేషన్లు చేసిన ఘటనలు బయటకు వచ్చిన ఉదంతాలతో ఎన్ఆర్ఐలు ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదని రియల్‌ఎస్టేట్‌ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వారు విక్రయించే భూములు, ప్లాట్లపై కోర్టుల్లో కేసులున్న విషయాన్ని దాచిపెట్టి విక్రయించడంతో ఆ ప్లాట్లు లేదా భూములు కొనుగోలు చేసిన ఎన్ఆర్ఐలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్తులో రెండింతలు అవుతుందంటూ ఊదరగొట్టి పెట్టుబడులు పెట్టిస్తున్న కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.. ఆ తర్వాత ఆ హామీలను అమలు చేయకపోవడం కూడా మరో ప్రధాన కారణమని అంటున్నారు. మార్కెటింగ్ కు ఇచ్చిన ప్రాధాన్యత డెవలప్‌మెంట్‌కు ఇవ్వకపోవడం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నగరానికి దూరంగా ప్లాట్లు ఉండటం రీసేల్‌కు ఇబ్బందిగా మారుతున్నది. ఇక అసలు సమస్య మెయింటెనెన్స్, మానిటరింగ్ ఇబ్బందులు. ప్లాట్లు లేదా భూములు కొనుగోలు చేసిన తర్వాత దాన్ని రక్షించుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఫెన్సింగ్ చేయడం, రెగ్యులర్ గా చూసుకోవడం ఎన్ఆర్ఐలకు కష్టంగా మారింది. హైదరాబాద్‌లో ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు, బంధువులు ఉంటే కొంచెం రిస్క్ తక్కువ. లేకపోతే ఆ ప్లాట్లు, లేదా భూముల ఆక్రమణ రిస్క్ ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూములు, ప్లాట్ల ధరలు కూడా పెరిగాయి. మరో వైపు ఎల్ఆర్ఎస్, ప్రాపర్టీ ట్యాక్స్, వంటి అంశాలతో పాటు రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల కూడా ఎన్ఆర్ఐలు ఇక్కడ కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున టెక్ నిపుణులు అమెరికాలో విధులు నిర్వహిస్తున్నారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలతో టెక్కీలు ఇబ్బంది పడుతున్నారు. హెచ్ 1 బీ వీసా సమస్య, అమెరికాలో ఎంఎస్ కోసం వెళ్లే విద్యార్థులకు వీసా నిబంధనలు కఠినతరం చేయడం వంటి అంశాలు కూడా అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐలపై ప్రభావం చూపుతున్నాయి. టెక్ కంపెనీల్లో లే ఆఫ్ ల భయం నెలకొంది. దీంతో మరో ఉద్యోగం దొరికే వరకు తమ వద్ద డబ్బులు దాచుకోవడం కోసం పెట్టుబడులు వైపునకు ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.

ఎన్నారైలు కోరుకునేదేంటి?

తాము పెట్టుబడి పెట్టే ప్రతి పైసాకు రెట్టింపు వస్తుందనే నమ్మకం కలిగించినప్పుడు ఎన్ఆర్ఐలు భూములు, ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతారని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు చెబుతున్నాయి. కొనుగోలు చేసే ప్లాట్ లేదా భూమి లీగల్ గా పక్కాగా ఉండాలి. అన్ని అనుమతులుండాలి., ఓపెన్ ప్లాట్ అయితే డీటీసీపీ, రెరా, హెచ్ఎండీఏ వంటి సంస్థల అనుమతి ఉండాలి. ఈ భూములకు ఎలాంటి లీగల్ సమస్యలు ఉండవద్దు. స్పష్టమైన టైటిల్ ఉండాలి. అలాంటి వాటి కొనుగోలుకు ఎన్నారైలు ఆసక్తి చూపుతారని పేరు రాయడానికి ఇష్టపడని ఒక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ మేనేజర్‌ చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీఐఆర్, ఫార్మా సిటీ, ఎయిర్ పోర్ట్ గ్రోత్ కారిడార్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హార్డ్ వేర్ పార్క్, మెట్రో, జాతీయ రహదారులు, రింగ్ రోడ్డు, ఇండస్ట్రీయల్ కారిడార్లు, ఇన్ ఫ్రా ప్రాజెక్టుల వద్ద ప్లాట్ల కొనుగోలుకు ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపుతారు. ఇప్పుడు పెట్టే భూములు, లేదా ప్లాట్లపై పెట్టే పెట్టుబడి వచ్చే ఐదారేళ్లు లేదా భవిష్యత్తులో తమకు మంచి ఆదాయం తీసుకు వస్తుందనే నమ్మకం ఉంటే పెట్టుబడి పెడుతారు. హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలని భావించిన సమయంలో పెట్టుబడులు పెడతారు. ఇండియాలో ప్రాపర్టీ కొనుగోలు చేస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కూడా ఎన్ఆర్ఐలు భూములు, ప్లాట్ల కొనుగోలుకు ప్రధాన కారణమని అంటున్నారు.