Attack On NRI In Australia| ఆస్ట్రేలియాలో భారతీయుడిపై దాడి

విధాత: ఆస్ట్రేలియా (Australia)లో భారతీయుడి( NRI)పై దుండగుల దాడి తీవ్ర కలకలం రేపింది. ఈనెల 19న అడిలైడ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్‌కు చెందిన చరణ్‌ప్రీత్ సింగ్ (Charanpreet Singh) తన భార్యతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో తమ కారును ఓ చోట పార్కు చేసి వెలుతున్న క్రమంలో ఐదుగురు దుండగులు వేరే వాహనంలో అక్కడికి వచ్చి చరణ్‌పై భౌతిక దాడికి దిగారు. పదునైన వస్తువులతో కొడుతూ.. అతన్ని దూషించారు. ఈ ఘటనలో చరణ్ ముఖం, వెనక భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కారు పార్కింగ్ వివాదం నేపథ్యంలోని దాడి జరిగినట్లుగా స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఆస్పత్రిలో బాధితుగు చరణ్ మాట్లాడుతూ.. ఈ దాడి తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలనిపిస్తుందన్నారు. ఇక, దాడికి పాల్పడిన దుండగుల్లో 20 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మిగిలిన వారిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ పీటర్ మాలినాస్కస్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి జాత్యహంకార దాడులను సహించేది లేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.