ఆస్ట్రేలియా బీచ్‌లో కాల్పుల కలకలం.. 12 మంది మృతి

ఆస్ట్రేలియాలో ఘోరం చోటు చేసుకున్నది. యూదుల పండుగ ప్రారంభ సూచికగా జరిగే కార్యక్రమానికి బోండీ బీచ్‌వద్ద గుమిగూడిన ప్రజలపై ఇద్దరు సాయుధులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు.

ఆస్ట్రేలియా బీచ్‌లో కాల్పుల కలకలం.. 12 మంది మృతి

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బోండీ బీచ్‌ వద్ద దారుణం చోటు చేసుకుంది. ఎనిమిది రోజులపాటు సాగే యూదుల పండుగ హనుక్కా ప్రారంభానికి సూచికగా జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వందల మంది బీచ్‌లో గుమిగూడారు. ఈ సమయంలో సాయుధ దుండగులు విరుచుకుపడి.. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి సహా 12 మంది చనిపోయినట్టు తెలుస్తున్నది. మృతుల్లో పోలీసులు, చిన్నారులు కూడా ఉన్నారు. దాడికి పాల్పడిన మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చెట్టు చాటు నుంచి కాల్పులు జరుపుతున్న ఒక సాయుధుడిని ఒక నిరాయుధుడు సాహపించి.. పట్టుకోవడంతో మరింత ప్రాణనష్టం తప్పింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

బోండీ బీచ్‌లో ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం సాయంత్రం ఆరున్నరకు ఈ కాల్పులు మొదలయ్యాయి. దీంతో భీతావహులైన సందర్శకులు తలోదిక్కు పరుగులు తీశారు. ఈ సమయంలో తీవ్ర గందరగోళం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా మరో 29 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు సాయుధులు సుమారు 50 రౌండ్లు కాల్పలు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తాము ఈ ఘటనకు స్పందిస్తున్నామని, ప్రజలెవరూ సమీప ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని పోలీసులు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు తమ అదుపులో ఉన్నారని పోలీసులు ధృవీకరించారు. ఇది యూదుల హనుక్కా సంబరాలపై ఉగ్రదాడిగా పోలీసులు ప్రకటించారు. కాల్పులు జరిపిన ఒక సాయుధుడిపై పోలీసులు వరుస కాల్పులు జరిపారు. మరొకడిని అదుపులోకి తీసుకున్నారు.

బోండీ బీచ్‌ వద్ద దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంటోనీ అల్బెనీస్‌ అన్నారు. విద్వేషానికి, హింసకు, ఉగ్రవాదానికి తమ దేశంలో స్థానం లేదని స్పష్టంచేశారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారో కనిపెట్టే ప్రయత్నాల్లో పోలీసు అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. దాడి ఘటన నేపథ్యంలో ప్రధాన మంత్రి అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్‌ అత్యవసర సమావేశం నిర్వహించింది.

కొన్ని నెలల క్రితమే ఈ ఘటనకు ప్లాన్‌ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పాదచారుల వంతెన కింద ఒక మందుపాతర లభించిన నేపథ్యంలో మొత్తం ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు.

ప్రాణాలు కాపాడిన సాహసి

ఒకవైపున దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న సమయంలో నిరాయుధుడైన ఒక సాహసి చేసిన ప్రయత్నం ఎందరో ప్రాణాలను కాపాడింది. చెట్టు చాటున నక్కి కాల్పులు జరుపుతున్న వ్యక్తి సమీపానికి జాగ్రత్తగా వెళ్లిన వ్యక్తి.. అతడిని పట్టుకుని కదలకుండా చేసి, తుపాకీ లాక్కున్నాడు. అనంతరం ఆ తుపాకిని అతడికి గురిపెట్టాడు. అనంతరం పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయింది. అతడి సాహసాన్ని నెటిజన్లు అభినందించారు.

తాను కనీసం పది మృతదేహాలు నెత్తుటి మడుగులో పడి ఉండటాన్ని చూశానని స్థానికుడు హ్యారీ విల్సన్‌ తెలిపారు. తన కుమార్తులు ఇద్దరు బీచ్‌లో అడుకుంటున్న సమయంలో కాల్పులు మొదలయ్యాయని, తాను వెంటనే తన కుమార్తెలను అప్రమతం చేయడంతో వారు సురక్షిత ప్రాంతానికి వెళ్లి తలదాచుకున్నారని ఒక తల్లి చెప్పింది. ఈ ఘటనలో సాయుధులు మూడు తుపాకులు వాడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

బోడీ బీచ్‌.. సిడ్నీలోని తూర్పు తీరంలో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం. ఇక్కడికి రోజు వేల మంది వస్తూ ఉంటారు. ఈ బీచ్‌ సుమారు మూడు వేల అడుగల వరకూ ఉంటుంది.

ఆస్ట్రేలియాలో ఇలా సామూహిక కాల్పుల ఘటనలు చాలా అరుదు. 1996లో టాస్మానియాలో జరిగిన కాల్పుల్లో 35 మంది చనిపోయిన తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం తుపాకి చట్టాలను కఠినతరం చేసింది.

ఇవి కూడా చదవండి..

Groundwater Overuse | టర్కీ పొలాలను నాశనం చేస్తున్న వందల కొద్దీ గుంతలు.. ప్రపంచానికి హెచ్చరిక!
Manjeeraa Pipeline Road | ఈ అధికారులకు ఉద్యోగం చేసే నైతిక అర్హత ఉందా?
Parents Promotion | 2025లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సెలబ్రిటీలు.. అభిమానులకు డబుల్ సెలబ్రేషన్స్!