Groundwater Overuse | టర్కీ పొలాలను నాశనం చేస్తున్న వందల కొద్దీ గుంతలు.. ప్రపంచానికి హెచ్చరిక!

పై ఫొటోలో కనిపిస్తున్న బావులు.. రైతులు తమ వ్యవసాయ నీటి అవసరాల కోసం తవ్వుకున్నవి కావు.. భూగర్భ జలాలను మితిమీరి తోడేస్తే ఏమవుతుంది? దానికి కరువుకాటకాలు తోడైతే ఏమవుతుంది? అనేందుకు ఇవి ఉదాహరణలు. ఈ భారీ గుంతలు టర్కీలో వ్యవసాయాన్ని నిలువునా సమాధి చేస్తున్న రాక్షస బిలాలు!

Groundwater Overuse | టర్కీ పొలాలను నాశనం చేస్తున్న వందల కొద్దీ గుంతలు.. ప్రపంచానికి హెచ్చరిక!

Groundwater Overuse | టర్కీలో వ్యవసాయ భూములు కుంగిపోతున్నాయి. ఆ దేశంలోని కరువు పీడిత కొన్యా మైదాన ప్రాంతంలో వందల గుంతలు (సింక్‌హోల్స్‌) ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఏర్పడుతున్నాయి. వ్యవసాయ భూములను, వాటిపై పంటలను వాటిలో కలిపేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ అక్కడ సుమారు 684 భారీ గోతులను ప్రభుత్వం గుర్తించింది. డ్రోన్ల ద్వారా చిత్రీకరించిన దృశ్యాలు అత్యంత వేగంగా భూమి కుంగిపోతున్నదని వెల్లడిస్తున్నాయి. మధ్య టర్కీలోని వ్యవసాయ క్షేత్రాల్లో నాటకీయంగా ఏర్పడుతున్న ఈ భారీ సింక్‌హోల్స్‌.. భూమిలోపల భౌగోళిక మార్పులతోపాటు.. తీవ్ర కరువు, దశాబ్దాల తరబడి వ్యవసాయ అవసరాల కోసం యథేచ్ఛగా భూగర్భ జలాలను తోడివేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు.

కొత్తగా ఏర్పడుతున్న సింక్‌హోల్స్‌ అన్నీ కొన్యా సమీప పరివాహక ప్రాంతంలోనే కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ప్రాంతం టర్కీ వ్యవసాయానికి వెన్నెముకగా భావిస్తారు. అలాంటి ప్రాంతంలో ఈ పెను విధ్వంసం ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నది. విస్తారమైన ఈ వ్యవసాయ క్షేత్రాల భూమి లోపల కార్బొనేట్‌, జిప్సమ్‌ రాళ్లు ఉన్నాయి. ఇవి సహజంగా వేల సంవత్సరాల వ్యవధిలో ఇటువంటి బిలాలను ఏర్పర్చుతాయి. ఇటువంటి భూభాగాన్ని ‘కార్ట్స్‌ ప్రాంతం’గా పిలుస్తారు. ఇటువంటి ప్రాంతాల్లో భూమి కుంగిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2000 సంవత్సరం వరకూ ఇటువంటి సింక్‌హోల్స్‌ ఒకటి లేదా రెండు మాత్రమే ఉండేవని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మాత్రం ఒకేసారి పదుల సంఖ్యలో ఏర్పడుతున్నాయి.

భూగర్భ జలాలు అంతరించిపోతే ఆ భాగం మొత్తం ఖాళీ ఏర్పడుతుంది. ఫలితంగా పైనున్న భూమి ఒత్తిడిని అవి తట్టుకోలేవు. ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోతాయి. ఇప్పుడు ఏర్పడుతున్న గుంతలకు ఇది కూడా ఒక ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పులు, కరువు ప్రభావం కూడా మరో అంశమని అంటున్నారు. మధ్య టర్కీ ప్రాంతంలోని జలాశయాలు మాత్రమే కాదు.. అక్కడి భూగర్భ జలాలు కూడా తీవ్ర స్థాయిలో ఎండిపోయినట్టు ఉపగ్రహ విశ్లేషణలు చెబుతున్నాయి. వర్షపాతం తగ్గిపోవడంతో భూగర్భ జలాలు రీచార్జ్‌ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. అదే సమయంలో జలాశయాలు కూడా ఎండిపోయాయి. దీనితో కింది భాగం తీవ్ర ఒత్తిడికి గురై.. గుంతలు ఏర్పడేందుకు దారి తీస్తున్నది.

మధ్య టర్కీ ప్రాంతంలో స్వీట్‌ పొటాటో, మొక్కజొన్న వంటి పంటలు అధికంగా పండిస్తారు. వీటిని నీరు ఎక్కువగా అవసరం. దీనితో నీటిని తోడేయడం కూడా బాగా పెరిగింది. గత దశాబ్దాల కాలంలోనే భూగర్భ జలాల స్థాయి పదుల మీటర్లకు పడిపోయిందని కొన్యా పరివాహక ప్రాంతంపై నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. కొన్ని ప్రాంతాల్లో 1970ల నాటి స్థాయిలతో పోల్చితే ఇప్పటికి 60 మీటర్లకు పైగా తగ్గుదల నమోదైంది. నీటిని తోడేందుకు రైతులు చట్టబద్ధంగా తవ్వుకున్న బావులు వేల సంఖ్యలో ఉండగా.. అక్రమంగా తవ్విన బావుల సంఖ్య భారీగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి నుంచి నిరంతరం నీటిని తోడేస్తుండటం ప్రస్తుత దుస్థితికి కారణమైంది.

టర్కీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏఎఫ్‌ఏడీ చెబుతున్న వివరాల ప్రకారం.. ఒక్క కొన్యా సమీప పరివాహక ప్రాంతంలోనే 684 సింక్‌హోల్స్‌ ఉన్నాయి. కరపినార్‌ వంటి జిల్లాల చుట్టూ ఇవి పక్కపక్కనే గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. ఇవి కరపినార్‌ జిల్లా పొరుగునే ఉండే కరామాన్‌, అక్సరాయ్‌ వరకూ విస్తరించి ఉన్నాయి. కొన్ని గుంతలు 30 మీటర్ల లోతు వరకూ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ గుంతల ఏర్పాటు వల్ల పంటపొలాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రహదారులు నాశనమవుతున్నాయి. కొన్ని చోట్ల భవనాలకు సైతం ముప్పు ఏర్పడుతున్నది. ఈ పరిస్థితిలో అనేక మంది రైతులు తమ పొలాలను పడావు పెట్టాల్సి వస్తున్నది.

ఇది కేవలం టర్కీ సమస్య మాత్రమే కాదని అర్థమవుతున్నది. భారత్‌ సహా అనేక దేశాల్లో భూగర్భ జలాలను యథేచ్ఛగా తోడివేస్తున్నారు. ఇప్పటికైనా భూగర్భ జలాల వినియోగంపై కఠిన నియంత్రణలు లేకపోయినా, తక్కువ నీటిని వినియోగించే పంటలవైపు మళ్లకపోయినా భూమి కూలిపోవడం అనే ఒక సాధారణ ప్రక్రియగా మారిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also |

పాకిస్తాన్‌ యూనివర్సిటీలో సంస్కృత బోధన.. మహాభారతం, భగవద్గీత కూడా!
Gold Mining Environmental Impact | బంగారం గనులతో పర్యావరణ పెను విధ్వంసం.. మరి ప్రత్యామ్నాయం?