Agro Processing Hub | వ్యవసాయ సంక్షోభ నివారణకు అదే మార్గం!

ఒక సంస్థ వందలాది మందికి ఉపాధి కల్పించడమే కాదు, వ్యవసాయ ఉత్పత్తులను ముడిసరుకుగా ఉపయోగించి, అదనపు విలువను జోడించడం ద్వారా వ్యవసాయ రంగానికి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వేన్నీళ్ళకు చన్నీళ్ళలా ఉపయోగపడుతున్నది. ఈ తరహా వ్యవసాయాధార పరిశ్రమలను, శీతల గిడ్డంగులను, గ్రామీణ ప్రాంతాలలో నెలకొల్పడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి, పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, ప్రత్యేక దృష్టి సారించి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించాలి. తద్వారా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగం నిలదొక్కుకోవడానికి దోహదపడుతుంది.

Agro Processing Hub | వ్యవసాయ సంక్షోభ నివారణకు అదే మార్గం!

Agro Processing Hub | గ్రామీణ సమాజం, ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థ.. వ్యవసాయంపై ఆధారపడి ఉన్నది. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధరలు అటుంచి, కనీస ధరలు కూడా లభించక రైతాంగం విలవిల్లాడిపోతున్నది. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి చేతికి రాక, అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆత్మహత్యలు చేసుకొంటున్న హృదయవిదారకమైన దృశ్యాలు సమాజాన్ని కలచివేస్తున్నాయి. ఇటీవల కాలంలో అరటి, ఉల్లిపాయలు, టమోటా, మామిడి, బొప్పాయి, ఇలా పలు వ్యవసాయ ఉత్పత్తులను కొనే వారే కరువై.. పొలాల్లోనే వదిలేయడమో, తగలపెట్టడమో చేశారు. ఆ దృశ్యాలు రైతుల దుస్థితికి ప్రబల నిదర్శనాలు.

నిన్న నేను మా స్వగ్రామం కె.కందులవారిపల్లికి వెళ్ళాను. మా గ్రామం రైల్వే కోడూరు శాసనసభ నియోజకవర్గంలోని చిట్వేలి మండల కేంద్రానికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఐదు కిలోమీటర్ల దూరం కాలినడకన వచ్చి చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు 1968-73 మధ్య కాలంలో చదువుకున్నాను. విజయవాడ నుండి తిరుపతికి వెళ్ళి, దట్టమైన బాలాజీ అడవి గుండా ప్రయాణించి, అదే మార్గంలో తిరిగొచ్చి, రేణిగుంటలో రైలెక్కి వెనక్కివచ్చాను. చలికాలం. రహదారికి ఇరువైపులా కొంత దూరం అడవి, మిగిలిన ప్రాంతంలో ఉద్యానవన తోటలతో పచ్చదనం కళ్ళకు కనువిందు చేసిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనసారా ఆస్వాదించాను. గతంలో వెళ్ళినప్పుడు పొలాల్లో అధిక భాగం బొప్పాయి పంట కనిపించింది. ఈ దఫా బొప్పాయి కనిపించలేదు. అధికంగా అరటి తోటలు కనిపించాయి. ఒక మేరకు మామిడి తోటలు ఉన్నాయి. గుంజన వ్యాలీ ఉద్యానవన తోటలకు ఒక మేరకు ప్రసిద్ధి. శేషాచలం కొండల శ్రేణుల్లో పుట్టి, రైల్వే కోడూరు – చిట్వేలి – పెనగలూరు మండలాల మీదుగా ప్రయాణించి, చెయ్యేరులో కలిసే గుంజనేరు ఏడాదికి ఒకసారి ఉధృతంగా ప్రవహిస్తే, భూగర్భజలాలకు కొదవ ఉండదు. ఇటీవలి తుఫాను కారణంగా ఈ ప్రాంతంలో మంచి వర్షాలు పడ్డాయి. గుంజనేరులో వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహించింది. ఇప్పటికీ కొంత నీరు ప్రవహిస్తున్నది.

మార్గమధ్యంలో వెంకట్రాజుపల్లెకు వెళ్ళాను. మా చెల్లాయి కల్పన, చిట్వేలి పూర్వ జెడ్పీటీసీ సభ్యురాలు ఇచ్చిన కాఫీ తాగుతూ, నగరిపాడు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మలిశెట్టి రాహుల్, వాళ్ళ కుమారుడు జతిన్ (ఇంజనీర్ మరియు రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి ఉన్న యువరైతు నేత)లతో వ్యవసాయ రంగం, పంటలు, వర్షాలు, తదితర అంశాలపై మొదలైన సంభాషణ, కలిసి ప్రయాణం చేస్తూ మా వూరి వరకు కొనసాగింది. మంచి వర్షాల ఫలితంగా భూగర్భ జలాలు బాగా పెరిగాయని చెప్పారు. కోడూరు నుండి రేణిగుంట రహదారిలో ప్రయాణిస్తున్నప్పుడు, బాలాజీ అటవీ ప్రాంతంలో చిన్న చిన్న జలదారలను చూశాను. కొన్ని రోజుల క్రితమే పడిన వర్షం వల్ల ఆ వర్షపు దారాలు పారుతున్నాయి. వాటిని వీక్షించడంతో మనసు ఉల్లాసంతో నిండిపోయింది.

మా వూరికి వెళ్ళి, తిరుగు ప్రయాణంలో పారిశ్రామిక వేత్తలు కస్తూరి విశ్వనాధంనాయుడు మరియు విశ్వేశ్వరనాయుడులతో కలిసి, మంగంపేట గ్రే బెరైటీస్ సంబంధిత అంశాలతో పాటు కాస్త రాజకీయ అంశాలను మాట్లాడుకుంటూ వచ్చాం. నేను చిట్వేలి హైస్కూల్ ఎస్.పి.ఎల్. గా ఉన్నప్పుడు(1972-73) కస్తూరి విశ్వనాధంనాయుడుగారు రాజంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థి యూనియన్ ఛేర్మెన్ గా ఉండేవారు. ఆయనది మా వూరికి ప్రక్కనే ఉన్న మల్లెంపల్లి. చిన్నప్పటి నుండి కూడా అభిమానంగా మామా అని పిలుస్తుంటాను. మేమిరువురం అమరజీవి కా. యం.సి. ఆంజనేయులు(నన్ను కమ్యూనిస్టు భావాల వైపు ఆకర్షించిన గురువు)గారి శిష్యులం. “జై ఆంధ్ర” ఉద్యమం ఉదృతంగా ముందుకు వచ్చినప్పుడు మేమిరువురం గుత్తిలో జరిగిన ఏఐఎస్ఎఫ్ సమావేశానికి హాజరయ్యాం. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ కోసం గట్టిగా నిలబడాలని ఆ సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత కా. నీలం రాజశేఖరరెడ్డిగారు ఉద్భోదించారు. అలా మాఇరువురి మధ్య కాస్త ఉద్యమానుబంధం కూడా ఉన్నది. విశ్వేశ్వరనాయుడు మంగంపేట ముగ్గురాళ్ళ గనుల యాజమానుల సంఘం యొక్క అధ్యక్షుడు. ఆయనది కూడా మల్లెంపల్లి.

రైల్వే కోడూరు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయాధారంగాను, మంగంపేట ముగ్గురాయి ఖనిజం ఆధారంగా పారిశ్రామికాభివృద్ధి జరగాలి. దశబ్ధాలుగా ప్రజలు కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ముగ్గురాళ్ళ గనులను సొంతం చేసుకొని, కోట్లకు కోట్లు ఎలా అక్రమార్జనకు పాల్పడాలన్న ద్యాసే తప్ప సమాజ అభివృద్ధిపై దృష్టి లేదు. వైఎస్ రాజారెడ్డి కాలం నాటి నుంచి నేటి వరకు ఇదే తంతు నడుస్తున్నది. బెరైటీస్ ఆధారంగా పరిశ్రమలను నెలకొల్పలేదు. తొలిదశలో ఖనిజాన్ని వెలికి తీసి, రాయిగానే మద్రాసు ఓడరేవు ద్వారా ఎగుమతి చేసి, డబ్బు దండుకునేవారు. తర్వాత కాలంలో కొంత భాగం ఖనిజాన్ని, పౌడర్ చేసి ఎగుమతి చేసే వారు. పౌడర్ చేసే మిల్లులను ఇబ్బడి ముబ్బడిగా నెలకొల్పారు. కానీ, వాటికి ముగ్గురాయిని సరఫరా చేయకపోవడంతో మిల్లులు మూతబడ్డాయని యజమానులు గగ్గోలుపెడుతున్నారు. ప్రభుత్వం స్పందించలేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా వాయిదాల మీద వాయిదాలతో కాలం గడచిపోతున్నదని వాపోయారు.

మార్గమధ్యంలో శెట్టిగుంట మరియు రేణిగుంట సమీపంలో కస్తూరి విశ్వనాధంనాయుడుగారి శ్రీ వర్ష ఫుడ్ ప్రాడక్ట్స్ ఇండియా లిమిటెడ్ ను సందర్శించాను. మామిడి, జామ, బొప్పాయి, అరటి, సపోటా, తదితర పండ్లు మరియు ఉల్లిపాయలతో మొదలుకొని వివిధ రకాల కూరగాయలు, చింతపండు వరకు వ్యవసాయ ఉత్పత్తులను, పరిశుభ్రమైన వాతావరణంలో, అత్యాధునికమైన యంత్రాల ద్వారా ప్రాసెస్ చేసి పల్ప్‌లు, కాన్సంట్రేట్‌లను భారీ స్థాయిలో తయారు చేసి, అదనపు విలువను జోడించి, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వీటిలో వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. రేణిగుంట సంస్థలో అత్యధికులు మహిళలే పనిచేస్తున్నారు. ఒక సంస్థ వందలాది మందికి ఉపాధి కల్పించడమే కాదు, వ్యవసాయ ఉత్పత్తులను ముడిసరుకుగా ఉపయోగించి, అదనపు విలువను జోడించడం ద్వారా వ్యవసాయ రంగానికి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వేన్నీళ్ళకు చన్నీళ్ళలా ఉపయోగపడుతున్నది. ఈ తరహా వ్యవసాయాధార పరిశ్రమలను, శీతల గిడ్డంగులను, గ్రామీణ ప్రాంతాలలో నెలకొల్పడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి, పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, ప్రత్యేక దృష్టి సారించి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించాలి. తద్వారా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగం నిలదొక్కుకోవడానికి దోహదపడుతుంది. శ్రీ వర్ష ఫుడ్ ప్రాడక్ట్స్ ఇండియా లిమిటెడ్ నిర్వహణ బాధ్యతల్లో విశ్వనాధంనాయుడుగారి కుమార్తె వర్ష విశ్వనాథ్, కుమారుడు విశ్వాస్ విశ్వనాథ్ పూర్తిగా భాగస్వాములై నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా యువ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఈ సందర్శన నాకు చాలా సంతృప్తి కలిగించింది.

నేను హైస్కూలు విద్యార్థిగా ఉన్న కాలంలో నాకు మా స్వగ్రామంలో మంచి స్నేహితుడు (వయసులో నాకంటే పదిహేను, ఇరవై సంవత్సరాలు పెద్ద) కందుల గుండయ్యనాయుడుగారు. సెలవు రోజుల్లో పంటపొలాల మధ్య నడుస్తూ బోలెడు కబుర్లు చెప్పుకునే వాళ్ళం. తర్వాత కాలంలో కూడా మా వూరికి వెళ్ళిన ప్రతి సందర్భంలో ఆయనను కలవకుండా తిరిగొస్తే ఏదో కొరతగా ఉండేది. అలాంటి అనుబంధం పెనవేసుకున్న మా మామ కందుల గుండయ్యనాయుడు కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఆయన మా వూరి సర్పంచ్ గా, చిట్వేలి మండల ప్రజాపరిషత్ మాజీ అధ్యక్షుడుగా ప్రజల అభ్యున్నతికి తనకు చేతనైనంత కృషి చేశారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి మా వూరికి వెళ్ళాను. బంధు, మిత్రులను కలిశాను.

– టి. లక్ష్మీనారాయణ, ఆలోచన పరుల వేదిక నాయకుడు.

Read Also |

Nara Lokesh : విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్
Skydiver Left Dangling : విమానానికి వేలాడిన స్కై డైవర్ ..ప్రమాద ఘటన వైరల్
Health Tips | గుడ్డులోని ప‌చ్చ‌సొన తిన‌డం వ‌ల్ల గుండెపోటు వ‌స్తుందా..? ఎంత వ‌ర‌కు నిజం..!