Urea shortage | ఎంత పని చేశావయ్యా తుమ్మలా! ఎరువులపై ముందుచూపు ఏది?

స్వయానా రైతు అయిన తుమ్మలకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై అపారమైన పట్టుంది. అయినప్పటికీ ఈ వర్షాకాలం సీజన్‌లో రైతులకు యూరియా బస్తాలను సకాలంలో అందించడంలో ఘోరంగా విఫలమయ్యారనే అపవాదును మూటగట్టుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ముందుచూపు లేకపోవడం మూలంగానే రేవంత్ రెడ్డి సర్కార్‌ను రైతులు, ప్రతిపక్షాలు నిత్యం దుమ్మెత్తిపోస్తున్నాయనే వాదనలూ ఉన్నాయి.

Urea shortage | ఎంత పని చేశావయ్యా తుమ్మలా! ఎరువులపై ముందుచూపు ఏది?

హైదరాబాద్, ఆగస్ట్‌ 25 (విధాత):

Urea shortage | రాష్ట్ర రాజకీయాల్లో మూడు దశాబ్ధాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు గుర్తింపు ఉంది. ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద కీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. స్వయానా రైతు అయిన తుమ్మలకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై అపారమైన పట్టుంది. అయినప్పటికీ ఈ వర్షాకాలం సీజన్‌లో రైతులకు యూరియా బస్తాలను సకాలంలో అందించడంలో ఘోరంగా విఫలమయ్యారనే అపవాదును మూటగట్టుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలం సీజన్‌కు ముందే దిగుమతి చేయించడంలో నిర్లక్ష్యం వహించారా? లేక ఇందులో ఏమైనా లోగుట్టు ఉందా? అనే విషయంలో కాంగ్రెస్ వర్గాల్లో లోతుగా చర్చ నడుస్తోంది. మంత్రి ముందుచూపు లేకపోవడం మూలంగానే రేవంత్ రెడ్డి సర్కార్‌ను రైతులు, ప్రతిపక్షాలు నిత్యం దుమ్మెత్తిపోస్తున్నాయనే వాదనలూ ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలలో తుమ్మల నాగేశ్వర్ రావు సుపరిచితులు. ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్ రావు మంత్రివర్గాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కాలంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కలేదు. కానీ ఈనాడు ఎన్నడూ లేని విధంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక్క బస్తా ఇస్తే చాలు అనే విధంగా ప్రాధేయపడుతున్నారు. ఈ పరిణామం రాజకీయంగా మూడు పార్టీల మధ్య కాక రేపింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తుండగా, తమ తప్పేమీ లేదని మంత్రి తుమ్మల ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ సీజన్ లో 62 లక్షల ఎకరాల్లో వరి, 49 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. వరి, పత్తి పంటలకు ఒక సీజన్‌లో మూడు నుంచి నాలుగు సార్లు యూరియా చల్లుతారు. తొలుత వరంగల్, మహబూబ్ నగర్, అదిలాబాద్ జిల్లాల్లో కొరత కన్పించగా ఆ తరువాత అన్ని జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఉదయం పూట వెళ్తే గంటన్నర లోనే స్టాక్ అయిపోయిందని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఈ సీజన్ కు 9.80 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి యూరియా అవసరం మొదలవుతుంది. మరుసటి సీజన్ కు తగ్గట్టుగా ముందే నిల్వలు చేసుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖపైనే ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ వార్షిక ప్రణాళిక విడుదల చేయడం లేదు. ఎందుకు విడుదల చేయడం లేదని కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. అదే ఆనవాయితీని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం దారుణమని రైతు సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పంటలవారీగా వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేయాలని రైతు సంఘాలు ఎన్నో వినతులు చేసినా విన్పించుకోవడం లేదని అంటున్నారు. వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేస్తే దాని ప్రకారం ఎరువుల డిమాండ్ పై ప్రభుత్వం ఒక అంచనా వస్తుంది. అందుకు తగ్గట్టుగా నిల్వలు చేసుకోవచ్చు. ఎరువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇండెంట్ ను పంపిస్తే, ఆ ప్రకారంగా కేంద్రం కేటాయింపులు చేస్తుంది. రాష్ట్రానికి దిగుమతి అయిన తరువాత జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ కేటాయింపులు చేస్తుంది. అయితే అలా కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు కేటాయిపులు చేస్తున్నారు.

రామగుండం కంపెనీలో ఉత్పత్తి ఆగింది తెలియదా?

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 2021లో తిరిగి ప్రారంభించారు. ప్రతి ఏడాది ఉత్పత్తి అయ్యే 12 లక్షల టన్నుల యూరియా సామర్థ్యంలో రాష్ట్రానికి 11 శాతం వాటాను సరఫరా చేస్తారు. ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 145 రోజులు ఉత్పత్తి జరగాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో 67 రోజులు మాత్రమే పనిచేసింది. షట్ డౌన్ కారణంగా తెలంగాణకు రావాల్సిన యూరియా తగ్గింది. అయితే ఆర్ఎఫ్ సీఎల్ లో ఉత్పత్తి ఆగిపోతే ఆ వివరాలు జిల్లా అధికార యంత్రాంగం లేదా వ్యవసాయ శాఖ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తాయి. ఇప్పటి పరిస్థితిలో ఈ విషయంపై అప్రమత్తం చేశారా, చేయనట్లయితే బాధ్యత ఎవరిదనేది విచారణ చేయాలని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. ఇండెంట్ ప్రకారం సరఫరా చేయనట్లయితే ఆ విషయాన్ని ఆర్ఎఫ్ సీఎల్ యాజమాన్యం కూడా వ్యవసాయ శాఖకు సమాచారం పంపిస్తుంది. రైతుల రోడ్డెక్కిన ఘటనలను పరిగణనలోకి తీసుకుంటే ఉత్పత్తి నిలిచిపోయిన విషయాన్ని, ముందస్తు దిగుమతులు చేసుకోవడంతో వ్యవసాయ శాఖ డైరెక్టర్ విఫలమయ్యారని ఇక్కడ స్పష్టమవుతున్నదని రైతు సంఘాల నాయకులు స్పష్టంచేస్తున్నారు.

రెండు రోజుల క్రితం సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్ఎఫ్ సీఎల్ సీఈఓ అలోక్ సింఘాల్, ఎన్ఎఫ్ సీఎల్ సేల్స్ మేనేజర్ రాజేశ్ తో సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి ఆర్ఎఫ్ సీఎల్ నుండి రావలసిన యూరియా కోటాలో ఇంకా 62,473 మెట్రిక్ టన్నులు అందలేదని మంత్రి వివరించారు. ముందుగా కనీసం 50 శాతం యూరియాను ఈ వారంలోనే రెండు కంపెనీల నుండి గాని రాష్ట్రానికి పంపేలా చూడాలని సూచించారు. రైతులకు అసౌకర్యం కలగకుండా ఎరువుల పంపిణీ తక్షణమే జరగాలని మంత్రి స్పష్టం చేశారు. దీనికి స్పందించిన ఆర్ఎఫ్ సీఎల్ ఎండీ.. రాష్ట్రానికి కావలసిన యూరియాను త్వరలోనే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

కేటాయింపులు 9.80 లక్షల మెట్రిక్ టన్నులు అయితే..

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఈ వానాకాలం సాగుకు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. ఆగస్ట్ 31 నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలి కానీ ఇప్పటివరకు 5.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయింది. ఇంకా 2.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉంది. దీంతో తెలంగాణలో యూరియా కొరత నెలకొంది. ఆగస్ట్‌ నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల రైతులు ఆందోళనగా ఉన్నారు.

బద్నాం అవుతున్న రేవంత్ రెడ్డి!

సాధారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అనే పేరుంది. రైతులకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఈ సీజన్ లో యూరియా బస్తాలు లభించకపోవడంతో రైతులు ఉడికిపోతున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. అయినా తమ చేతికి అవి అందకపోవడంతో విధ్వంసాలకు దిగుతున్నారు. రైతు రుణ మాఫీ ఒకేసారి చేయడం, రైతు భరోసా మొత్తాన్ని పది రోజుల వ్యవధిలోపే వారి ఖాతాల్లో జమ చేయడం తో మంచి పేరు వచ్చింది. ఆ మంచి పేరు కాస్తా.. యూరియా కొరతతో మసకబారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ అంటే రైతులు ఏవగించుకునే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. పాలనపై రేవంత్ రెడ్డికి అనుభవం లేకపోవచ్చు.. కానీ తుమ్మల నాగేశ్వర్ రావుకు అపారమైన అనుభవం ఉందని, ఎంతో అనుభవం ఉన్న ఆయన ఇలా చేశారేంటి అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రేవంత్ సర్కార్‌ను బద్నాం చేసేందుకు ఏమైనా కుట్ర కోణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. కేటాయింపుల ప్రకారం యూరియా సరఫరా చేయలేదని చెబుతున్నప్పటికీ ఇది ఒక్కరోజులో వారం రోజుల్లో జరిగే ఘటన కాదని, ఏప్రిల్ ముందు నుంచే సరఫరా లోటు సంకేతాలు ఉంటాయని వ్యవసాయ శాఖ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కొరత అనేది వ్యవసాయ శాఖ వైఫల్యం తప్ప, ప్రభుత్వానికి సంబంధం లేదని అంటున్నారు.