Ustad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ భావోద్వేగం.. మా వాడు తిరిగి ఇచ్చేస్తాడు..!

Ustad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందు ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

  • By: Sandeep |    movies |    Published on : Mar 16, 2026 8:20 AM IST
Ustad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ భావోద్వేగం.. మా వాడు తిరిగి ఇచ్చేస్తాడు..!

Ustad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందు ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ సినిమా విజయంపై తన ఆశలను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన జీవితంలో సినిమాకు ఎంతో ప్రత్యేక స్థానం ఉందన్నారు. “సినిమా అంటే నాకు చాలా ఇష్టం. నాకు అన్నం పెట్టింది సినిమా.. ప్రజలకు సేవ చేసే గుర్తింపు కూడా ఇచ్చింది సినిమా. అందుకే నా నిర్మాతలు, దర్శకులు బాగుండాలని, అభిమానులకు సినిమాతో ఆనందం కలగాలని ఎప్పుడూ కోరుకుంటాను” అని అన్నారు.

సినిమా కలెక్షన్ల గురించి తాను పెద్దగా పట్టించుకోనని పవన్ తెలిపారు. “సినిమా ఎంత కలెక్షన్లు సాధించింది అన్నది నాకు తెలియదు. ఏ సినిమా అయినా బాగుండాలని మాత్రమే కోరుకుంటాను. నేను తమిళ సినిమా, తెలుగు సినిమా అని వేరు చేసి చూడను. ఇండియన్ సినిమా అనే చూస్తాను. తెలుగు సినిమా ఇప్పుడు ఆస్కార్ స్థాయికి చేరడం మనందరికీ గర్వకారణం అని ఆయన అన్నారు.

దర్శకులు, రచయితలు రాసిన కథను ప్రేక్షకులకు చేరేలా తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ చెప్పారు. మన ప్రయత్నం ఎంత ఉన్నా ఫలితం ఎప్పుడూ మన చేతిలో ఉండదు. నా వరకు మాత్రం ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ ఈవెంట్‌కు ఆయన్ని పిలవాలని హరీష్ శంకర్ అనుకున్నాడు. కానీ ఆయన పక్కన ఉంటే నేను హీరోననే విషయం కూడా మర్చిపోతాను అంటూ చిరంజీవిపై తన అభిమానాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబుకి కూడా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీష్ శంకర్‌తో సినిమా చేయడానికి చాలా సమయం పట్టిందని పేర్కొన్నారు. దర్శకుడిని ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతానని, ఆయన చెప్పినట్లు పని చేస్తానని తెలిపారు.

మొదట ఈ సినిమాకు వేరే కథ అనుకున్నప్పటికీ తరువాత కథ మారిందని పవన్ చెప్పారు. మధ్యలో కోవిడ్ పరిస్థితులు రావడం, అలాగే తాను రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినిమా ఆలస్యమైందని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా విధులకు అంతరాయం కలగకుండా ప్లాన్ చేసుకుని తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేశానని తెలిపారు.సుమారు 40 నుంచి 45 రోజుల్లోనే మేజర్ షూటింగ్ పూర్తి చేశాం. పక్కాగా ప్లాన్ చేస్తే సినిమాల్లో నటించొచ్చని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నాకు మరోసారి నమ్మకం ఇచ్చింది. ఈ సినిమా ‘గబ్బర్ సింగ్’ స్థాయి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.

అలాగే దర్శకుడు హరీష్ శంకర్ గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా నేరుగా మాట్లాడే వ్యక్తి అని, అనవసరమైన వివాదాలకు వెళ్లొద్దని తాను చెప్పినా కొన్నిసార్లు ఆయన ఇచ్చిపడేస్తాడని సరదాగా వ్యాఖ్యానించారు. “నేను దెబ్బలు తీసుకుంటాను కానీ, మా వాడు తీసుకోడు.. తిరిగి ఇచ్చేస్తాడు” అంటూ నవ్వులు పూయించారు.