Gold Mining Environmental Impact | బంగారం గనులతో పర్యావరణ పెను విధ్వంసం.. మరి ప్రత్యామ్నాయం?

బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ప్రత్యేకించి భారతీయులకు బంగారం అంతే ఎంతో ప్రతిష్ఠకు సంబంధించిన విషయం. కానీ.. బంగారం తవ్వకాలతో ఎంత విధ్వంసం జరుగుతున్నదో తెలుసా? పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్న అంశాల్లో బంగారం గనులు కూడా ప్రధానమైనవేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానికి ప్రత్యామ్నాయాలు సూచిస్తున్నారు.

Gold Mining Environmental Impact | బంగారం గనులతో పర్యావరణ పెను విధ్వంసం.. మరి ప్రత్యామ్నాయం?

Gold Mining Environmental Impact | బంగారం(gold)! ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న ఖరీదైన లోహాల్లో అత్యంత ప్రధానమైనది. ప్రపంచవ్యాప్తంగా బంగారు ఆభరణాలకు ఎంతో డిమాండ్‌ ఉంది. మన దేశంలో చెప్పనక్కర్లేదు. ఎంత పేదరాలైనా తులం బంగారం ఒంటిమీద ఉండాలని కోరుకుంటుంది. మధ్యతరగతి ప్రజలు ఎంతోకొంత బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. విలాసవంతమైన కుటుంబాల సంగతి చెప్పనక్కర్లేదు. స్పెయిన్‌కు చెందిన పదహారవ శతాబ్ది నాటి రాజు ఫెడ్రినాండ్‌.. తన సేవకులకు బంగారం కోసం ఆజ్ఞాపిస్తాడు. బంగారాన్ని సంపాదించండి. సాధ్యమైనమేరకు మానవత్వంతో సంపాదించుకురండి. కానీ.. ఎట్టిపరిస్థితుల్లోనూ నాకు బంగారం కావాలి’ అంటాడు. దీనర్థం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంగారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహాల్లో (most expensive substances) ఒకటిగా నిలిచినా.. దాని తవ్వకాలతో మాత్రం పర్యావరణానికి ఎనలేని విధ్వంసం (environmental impact) జరుగుతున్నదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తగినంత బంగారం ఉంది. అయినా ఆ యా దేశాలు బంగారం గనుల్లో తవ్వకాలను, బంగారం గనుల అన్వేషణను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. నిజానికి ఇలా తవ్వి తీసే బంగారం మొత్తం వినియోగంలోకి వెళ్లటం లేదు. అందులో దాదాపు ఏడు శాతం బంగారాన్ని పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞానం, వైద్యరంగాల్లో వినియోగిస్తున్నారు. మరి మిగిలిన బంగారం? డౌటే లేదు.. చాలా భాగం బంగారు ఆభరణాల రూపంలో మనుషుల ఒంటిమీదకు చేరుతున్నది. అంతకంటే ఎక్కువే బ్యాంకుల్లోని సీక్రెట్‌ లాకర్లలో భద్రంగా మూలుగుతూ ఉన్నది.

  • బంగారం గనుల తవ్వకాలు పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్నాయి.
  • ఒక్క ఏడాది వ్యవధిలో బంగారం గనుల నుంచి వెలువడే గ్రీన్‌హౌస్‌ వాయువులు ఐరోపా దేశాల ప్రజల విమాన ప్రయాణాల కారణంగా వెలువడే ఉద్గారాల కంటే ఎక్కువేనంటే ఆశ్చర్యమే.
  • ప్రపంచ వార్షిక మెర్క్యురీ ఉద్గారాల్లో 38 శాతం వాటాను బంగారం గనుల తవ్వకాలే ఆక్రమిస్తున్నాయి. వీటిలో పనిచేసే లక్షల మండి కార్మికుల ఒంటిలోకి దీర్ఘకాలంలో ప్రమాదకర స్థాయిలో పాదరసం చేరుతున్నది.
  • ప్రత్యేకించి చిన్నపిల్లల్లో ఇది పలు తీవ్ర వ్యాధులకు కారణమవుతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • గత శతాబ్దకాలంగా బంగారం తవ్వకాలకు సంబంధించిన పద్ధతులు ఎంతో మెరుగయ్యాయి. కొత్త సాంకేతికతను వాడుతున్నారు. తవ్వకాల ప్రభావాన్ని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త నియమాలు ఏర్పాటు చేస్తున్నారు.
  • ఇంత చేస్తున్నా.. బంగారం తవ్వకాలు ఒక్క అంటార్కిటికా తప్ప అన్ని ఖండాల్లోని భూములను విధ్వంసం చేస్తున్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ప్రత్యామ్నాయం ఏమిటి?

ఒక సరుకు మార్కెట్‌లో విరివిగా దొరికితే దాని ధర పడిపోతుంది. అదే సరుకుకు కొరత ఏర్పడితే దాని విలువ అమాంతం పెరుగుతుంది. ఇదే అంశాన్ని పరిశోధకులు ప్రస్తావిస్తున్నారు. బంగారం తవ్వకాలను ఆపేసి, పునరుత్పత్తిపైనే ఎక్కువగా దృష్టిసారించాలని కోరుతున్నారు. ఇప్పటికే ప్రపంచపు బంగారం అవసరాలను దాదాపు నాలుగో వంతు రీసైక్లింగ్‌ పద్ధతిలోనే తీర్చుతున్నారు. ఈ కారణంగానే అత్యధికంగా రీసైక్లింగ్‌కు గురయ్యే పదార్థాల్లో బంగారమే నిలిచింది. రీసైక్లింగ్‌లో పాదరసాన్ని ఉపయోగించరు. తవ్వితీసిన బంగారాన్ని ప్రాసెసెస్‌ చేయడంతో పోల్చితే రీసైక్లింగ్‌కు 1 శాతం కంటే తక్కువ నీరు సరిపోతుందని, కార్బన్‌ ముద్రతో పూర్తవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగారం తవ్వకాలు తగ్గినప్పటికీ.. ఆభరణాలు, సాంకేతిక పరిజ్ఞానంలో ఉపయోగం, పెట్టుబడి కింద వాడటం అనే ఈ మూడు అంశాల్లో పెద్ద నష్టం ఏమీ ఉండదని అంటున్నారు. బంగారాన్ని ఇండస్ట్రియల్‌ అవసరం కోసం అంటే.. ప్రధానంగా దంత చికిత్స, స్మార్ట్‌ ఫోన్‌లలో ఉపయోగించడానికి కావల్సిన నిల్వలు ఇప్పటికిప్పుడు బంగారం గనులు మూసేసినా మరో శతాబ్దం పాటు సరఫరా సమస్యలు ఉండబోవని అంచనా వేస్తున్నారు. నగల తయారీకి కూడా రీసైకిల్డ్‌ బంగారాన్ని ఉపయోగించడం కొనసాగించవచ్చని చెబుతున్నారు. పునర్వినియోగ బంగారం తక్కువగా అంటే 55 శాతం మేర లభ్యమవుతున్నా.. అవసరాలకు ఏ మాత్రం ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేస్తున్నారు. ఇక గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి విషయంలోనూ సమస్యలు ఉండబోవని అంటున్నారు. బంగారం అరుదైనది. కనుక అత్యంత విలువైనది. అయితే.. బంగారం తవ్వకాలు ఆగిపోయినా.. క్రయవిక్రయాలు ఆగిపోయే అవకాశాలు లేవని, పైగా ఇప్పటికే ఉన్న నిల్వల విలువ రానురాను మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మొత్తంగా లక్ష్యం ఒకటేనని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అది.. బంగారం తవ్వకలాను తగ్గించడమేనని అంటున్నారు. ఇటువంటి నిర్ణయాలు కఠినమే అయినప్పటికీ.. మానవాళిపై పర్యావరణ దుష్ప్రభావాలను తగ్గించడానికి ఇది అత్యంత సులభమైన విధానమని అంటున్నారు.

ఏం చేస్తామంటున్నారు? ఏం చేయాలి?

  • సాంకేతిక రంగంలో వాడకం విషయంలో రీసైక్లింగ్‌ బంగారం అనే అంశం ప్రాముఖ్యం సంతరించుకుంటున్నది.
  • పాండోరా తదితర ప్రధాన నగల తయారీ బ్రాండ్లు ఇక రీసైకిల్డ్‌ బంగారమే వాడుతామని చెబుతున్నాయి.
  • 2030 నాటికి తమ ఉత్పత్తుల్లో పూర్తిగా రీసైకిల్డ్‌ పదార్థాలే వాడుతామని యాపిల్‌ సంస్థ ప్రకటించింది.
  • బంగారాన్ని మాత్రమే వెలికి తీసే లక్ష్యంతో పనిచేసే గనుల సంస్థలు.. వాటిని ఆపాలి.
  • కొత్త బంగారు గనుల్లో పెట్టుబడులు పెట్టడాన్ని ప్రపంచ బ్యాంక్‌ వంటి సంస్థలు ప్రోత్సహించకూడదు.
  • బొగ్గు ఉత్పత్తిదారుల తరహాలో బంగారం గనుల సంస్థలను కూడా పెట్టుబడుల ఉపసంహరణ జాబితాలోకి చేర్చాలి.
  • బంగారు గనుల తవ్వకాలు ఆపేస్తే సుమారు రెండు కోట్ల గని కార్మికులు, వారి కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాయి. ఇటువంటివారిని వివిధ ప్రభుత్వాలు ఆదుకుని, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలి.

ఇవి కూడా చదవండి..

Earth Core Gold | భూమి లోపలి నుంచి ఉబికి వస్తున్న అపారమైన బంగారం! దాని విలువ ఎంతో తెలుసా?
Jabalpur Gold Mines| భారత్ లో లక్షల టన్నుల బంగారం నిక్షేపాలు..దేశానికే గేమ్ ఛేంజర్ !
Gold | గత 6ఏళ్లలో గోల్డ్ ధర ఎంత పెరిగిందో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!
Gold: విదేశాల నుంచి.. ఎంత బంగారం తెచ్చుకోవచ్చో తెలుసా?