Waste to Wealth | ప్లాస్టిక్ వ్య‌ర్థాలే వారి జీవ‌నోపాధి.. నెల‌కు రూ. 7 వేలు సంపాదిస్తున్న మ‌హిళ‌లు

Waste to Wealth | మాన‌వాళి మ‌నుగ‌డ‌కు అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారిన ప్లాస్టిక్ వ‌స్తువుల( Plastic ) ప‌ట్ల చాలా మంది నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు. ప‌ర్యావ‌ర‌ణానికి( Environment ) ప్లాస్టిక్ ముప్పు అని తెలిసీ కూడా ఎక్క‌డంటే అక్క‌డ ప‌డేసి కాలుష్యానికి( Pollution ) కార‌కులు అవుతున్నారు. కానీ ఈ మ‌హిళ‌లు మాత్రం.. ఆ ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను సేక‌రించి.. జీవనోపాధి( Livelihood )  పొందుతున్నారు. అదేలాగో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

  • By: raj |    national |    Published on : Feb 07, 2026 11:26 AM IST
Waste to Wealth | ప్లాస్టిక్ వ్య‌ర్థాలే వారి జీవ‌నోపాధి.. నెల‌కు రూ. 7 వేలు సంపాదిస్తున్న మ‌హిళ‌లు

Waste to Wealth | ప‌లు రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌( Plastic )పై నిషేధం విధించిన‌ప్ప‌టికీ.. స‌రిగ్గా అమ‌లు కావ‌డం లేదు. ఆయా రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌ను విరివిగా ఉప‌యోగిస్తున్నారు. ఆ ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో భూమి క‌లుషితం( Pollution ) కావ‌డంతో పాటు మ‌నుషులు కూడా రోగాల బారిన‌ప‌డుతున్నారు. క్యాన్స‌ర్( Cancer ) వంటి రోగాల బారిన ప‌డి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. మూగ జీవాలు కూడా బ‌లైపోతున్నాయి. స‌మ‌స్త మాన‌వాళికి ప్ర‌మాద‌క‌రంగా మారిన ప్లాస్టిక్ వ్య‌ర్థాలు భూమిలో క‌లిసిపోకుండా ఉండేందుకు కొంత మంది మ‌హిళ‌లు ప్ర‌తిన బూనారు. ఇంకేముంది ఆ ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను ఆదాయ వ‌న‌రులుగా మార్చుకుని జీవ‌నోపాధి( Livelihood )  ని పొందుతున్నారు. అంతేకాకుండా ప్ర‌కృతి ర‌క్ష‌కులుగా నిలిచిపోతున్నారు. మ‌రి ఆ మ‌హిళ‌ల గురించి తెలుసుకోవాలంటే జార్ఖండ్‌( Jharkhand )లోని జంషెడ్‌పూర్ వెళ్లాల్సిందే.

జంషెడ్‌పూర్‌(Jamshedpur )కు 60 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న గోబ‌ర్‌ఘుసి గ్రామం( Gobarghusi village ) అది. ఆ గ్రామంలోని మ‌హిళ‌లు జీవ‌నోపాధి ప‌ట్ల నిత్యం ఆలోచించేవారు. ఈ క్ర‌మంలో వారికి చాలానే ఐడియాలు వ‌చ్చాయి. కానీ కార్య‌రూపం దాల్చ‌లేదు. చివ‌ర‌కు ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌పై వారు దృష్టి సారించారు. వీటి వ‌ల్ల భూమి క‌లుషితం కావ‌డంతో పాటు నేల సార‌వంతం దెబ్బ‌తింటుంది. ఇంక మ‌న‌షుల‌కు, మూగ జీవాల ప్రాణాల‌ను బ‌లిగొనే ఈ ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను నిర్మూలించాల‌ని ఆ మ‌హిళ‌లు సంక‌ల్పించారు.

ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను శుభ్రంగా నీటితో క‌డిగి

ఈ క్ర‌మంలో గోబ‌ర్‌ఘుసి గ్రామ స‌మీపంలోని ప‌ది గ్రామాల్లో తిర‌గ‌డం మొద‌లుపెట్టారు. ఆ గ్రామాల్లో ప‌డేసిన పాస్టిక్ వ్య‌ర్థాల‌ను సేక‌రించ‌డం ప్రారంభించారు. ఇక సేక‌రించిన ఆ ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను శుభ్రంగా నీటితో క‌డిగి ఆర‌బెట్టి.. వాటితో ఏం త‌యారు చేయొచ్చో ఆలోచించేవారు.

ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో పూల‌కుండీలు, బుట్ట‌లు, టోపీలు

అలా మొద‌ట ప‌ది మంది మ‌హిళ‌లు ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో వివిధ ర‌కాల వ‌స్తువుల‌ను త‌యారు చేశారు. పూల‌కుండీలు, బుట్ట‌లు, టోపీలతో పాటు ఇత‌ర అలంక‌ర వ‌స్తువుల‌ను త‌యారు చేసి విక్ర‌యించ‌డం ప్రారంభించారు. ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో పాటు పాత బ‌ట్ట‌ల‌ను కూడా సేక‌రించేవారు. ఈ పాత‌బ‌ట్ట‌ల‌తో డోర్ మ్యాట్‌లు కూడా త‌యారు చేసి విక్ర‌యిస్తున్నారు.

నెల‌కు రూ. 5 వేల నుంంచి రూ. 7 వేల వ‌ర‌కు ఆదాయం

గోబ‌ర్‌ఘుసి గ్రామ మ‌హిళ‌ల చేత త‌యారైన వ‌స్తువుల‌ను దేశ రాజ‌ధాని ఢిల్లీ, ఆర్థిక రాజ‌ధాని ముంబై వంటి న‌గ‌రాల్లో విక్ర‌యించ‌డం ప్రారంభించారు. ఒక్కో వ‌స్తువు ధ‌ర‌ను రూ. 50 నుంచి రూ. 600 వ‌ర‌కు నిర్ణ‌యించి విక్ర‌యిస్తున్నారు. ఇలా నెల‌కు రూ. 5 వేల నుంంచి రూ. 7 వేల వ‌ర‌కు ఆదాయం ఆర్జిస్తున్నారు. ఏడాది క్రితం 10 మందితో ప్రారంభ‌మైన ఈ ఉద్య‌మం ఇప్పుడు 20 మంది దాకా చేరింది.

ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌డ‌మే మా ప్ర‌ధాన లక్ష్యం..

ఈ సంద‌ర్భంగా గోబ‌ర్‌ఘుసి మ‌హిళ‌లు మాట్లాడుతూ.. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌డ‌మే మా ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను సేక‌రించి.. వినూత్న ర‌కాల్లో వ‌స్తువుల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తున్నాం. త‌మ చేతుల‌తో త‌యారు చేయ‌బ‌డ్డ వ‌స్తువుల‌ను మార్కెట్లో మంచి డిమాండ్ ఉంద‌ని వారు పేర్కొన్నారు.