• Telugu News
  • /National

ఈడీ ‘ఆపరేషన్ బ్లాక్ డైమండ్’..రూ.600కోట్ల అక్రమాస్తుల జప్తు

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఈడీ చేపట్టిన 'ఆపరేషన్ బ్లాక్ డైమండ్'లో రూ.600 కోట్లకుపైగా బినామీ ఆస్తులు, రూ.160 కోట్ల మ్యూచువల్ ఫండ్లు, కోట్ల నగదు, 200కుపైగా ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 30, 2026, 2:43 pm IST
Read Time: 6 mins
ఈడీ ‘ఆపరేషన్ బ్లాక్ డైమండ్’..రూ.600కోట్ల అక్రమాస్తుల జప్తు

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో కోల్ మాఫియా(బొగ్గు మాఫియా)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్‌ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఈడీ ఏకకాలంలో 31 ప్రదేశాలపై దాడులు నిర్వహించింది. రూ. 600 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తులను (బినామీ ఆస్తులు) గుర్తించి జప్తు చేశారు.రూ. 160 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్‌లు, 200కు పైగా ఆస్తుల పత్రాలు, కోట్ల రూపాయల లెక్క చూపని అక్రమ నగదు బయటపడ్డాయి. రూ.1.02 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యాపారవేత్త లోపలి నుంచి తలుపుకు తాళం వేయడంతో అధికారులు నిచ్చెన సహాయంతో నేరుగా ఇంట్లోకి ప్రవేశించాల్సి వచ్చింది. ఒకే నగరంలో ఇంత మొత్తం బయటపడితే, దేశవ్యాప్తంగా లెక్కల్లో చూపని సంపద ఇంకెంత ఉందో అని ఆశ్చర్యం కలుగుతుంది.

ఆపరేషన్ బ్లాక్ డైమండ్ దెబ్బకు బద్దలైన బొగ్గు మాఫియా సామ్రాజ్యం

మనీ లాండరింగ్, అక్రమ బొగ్గు మైనింగ్, బలవంతపు వసూళ్ల నెట్‌వర్క్‌పై దర్యాప్తులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ‘ఆపరేషన్ బ్లాక్ డైమండ్’ పేరుతో భారీ దాడులకు దిగింది. బొగ్గు వ్యాపారి అనిల్ గోయల్, బీసీసీఎల్ (BCCL) అవుట్‌సోర్సింగ్ వ్యాపారి లాల్ బాబు సింగ్ (ఎల్‌బీ సింగ్), హరేంద్ర చౌహాన్, వారి అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయి. వారికి సంబంధించిన 31 ప్రాంతాలలో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈడీ రాంచీ డివిజనల్ బృందం తెల్లవారుజాము నుంచి ధన్‌బాద్‌లోని సరైధేలా, ఝరియా, కత్రాస్, బ్యాంక్ మోడ్ మరియు ఇతర ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు ప్రారంభించింది.

ప్రతిఘటనలు అధిగమించి సోదాలు

ఈ ఆపరేషన్‌లో రూ. 600 కోట్లకు పైగా విలువైన బినామీ ఆస్తులు, రూ. 160 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్‌లు, 200కు పైగా ఆస్తుల పత్రాలు, కోట్ల రూపాయల లెక్క చూపని నగదు బయటపడ్డాయి. ఆపరేషన్ సమయంలో కొన్ని చోట్ల ఈడీ బృందానికి ప్రతిఘటన కూడా ఎదురైంది. లోయాబాద్ ప్రాంతంలో మహిళలు అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఝరియాలోని షిమ్లా భవన్ ప్రాంతంలో ఒక బొగ్గు వ్యాపారి తన ఇంటి తలుపును లోపలి నుంచి గడియ పెట్టాడు. అయితే ఈడీ బృందం వెనకడుగు వేయలేదు. అధికారులు వెంటనే ఒక నిచ్చెనను తీసుకువచ్చి పైనుంచి ఇంట్లోకి ప్రవేశించి, ఇల్లంతా సోదాలు చేసి దర్యాప్తును కొనసాగించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో పెద్ద సంచలనం సృష్టించింది.

దర్యాప్తులో మరిన్ని సంచలన అంశాలు..

ధన్‌బాద్‌ను దేశ ‘బొగ్గు రాజధాని’గా పిలుస్తారు. గత కొన్ని దశాబ్దాలుగా, ఇక్కడ అక్రమ మైనింగ్, బొగ్గు దొంగతనం, మనీలాండరింగ్, సిండికేట్ నెట్‌వర్క్‌లు పనిచేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ నిర్వహించిన దాడులు బొగ్గు మాఫియా ఆర్థిక సామ్రాజ్యానికి అతిపెద్ద దెబ్బగా పరిగణిస్తున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో బొగ్గు మాఫియా అక్రమాస్తులకు సంబంధించి మరిన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలు తెలిపాయి.