పాకిస్తాన్ యూనివర్సిటీలో సంస్కృత బోధన.. మహాభారతం, భగవద్గీత కూడా!
భారత ఉపఖండపు ప్రాచీన భాష అయిన సంస్కృతాన్ని పాకిస్తాన్ యూనివర్సిటీలో బోధిస్తున్నారు. 2027 నాటికి ఏడాది పొడవునా బోధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
సంస్కృతం! భారతదేశపు అతి ప్రాచీన భాష! కనీసం 3500 నుంచి 4వేల సంవత్సరాల చరిత్ర దీనికి ఉందని చరిత్రకారులు అంచనా వేశారు. మహర్షి పాణి రచించిన ‘అష్టాధ్యాయి’ సంస్కృత వ్యాకరణానికి ప్రామాణిక గ్రంథంగా భావిస్తారు. ప్రతి అక్షరానికి స్పష్టమైన ఉచ్ఛారణ నియమాలు ఉండటం ఈ భాష ప్రత్యేకత. తక్కువ పదాలతోనే లోతైన అర్థాన్ని చెప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు, అనేక కావ్యాలు ఆదిలో సంస్కృత భాషలోనే వచ్చాయి. ప్రతి భాషకూ లిపి ఉంటుంది. కానీ.. సంస్కృతానికి లిపి లేదు. అన్ని భాషల్లోనూ పలికే అవకాశం ఉంది. ఇంతటి అద్భుతమైన భాషను భారతదేశంలోనే కాదు.. బ్రిటన్, జర్మనీ, ఇటలీ, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండోనేషియా వంటి దేశాల్లో బోధించే యూనివర్సిటీలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో పాకిస్తాన్ కూడా చేరింది.
దేశ విభజన తర్వాత మొట్టమొదటిసారిగా సంస్కృత భాష కోర్సును పాకిస్తాన్‌లోని లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (ఎల్‌యూఎంఎస్)లో ప్రవేశపెట్టినట్టు ది ట్రిబ్యూన్ పేర్కొన్నది. ఇందులో మహాభారతం, భగవద్గీత వంటివి సైతం బోధించనున్నారు. ‘సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నావని నన్ను చాలా మంది అడిగారు. దానికి నేను సంస్కృతం ఎందుకు నేర్చుకోకూడదని ఎదురు ప్రశ్నించాను. ఈ మొత్తం ప్రాంతాన్ని కలిపి ఉంచే భాష ఇది. సంస్కృత భాష వ్యాకరణవేత్త పాణి ఊరు కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. సింధు లోయ నాగరికత కాలంలో ఇక్కడ సంస్కృతంలో ఎన్నో రచనలు వచ్చాయి. సంస్కృతం అనేది ఒక శిఖరం. ఒక సాంస్కృతిక చిహ్నం. మనం దానిని సొంతం చేసుకోవాలి. ఇది మనది కూడా. ఇదేదో ఒక నిర్దిష్ట ప్రాంతంతో ముడిపడినది కాదు. అని అసోసియేట్ ప్రొఫెసర్ షాహిద్ రషీద్ చెప్పినట్టు ట్రిబ్యూన్ తెలిపింది. ఈ యూనివర్సిటీలో సంస్కృత బోధన ప్రారంభానికి ఈయన కీలక పాత్ర పోషించారు.
సంస్కృత భాషలోని అనేక తాళపత్ర గ్రంథాలను 1930 నాటికే జేసీఆర్ వూల్నర్ అనే పండితుడు క్యాటలాగ్ చేసి ఉంచారు. కానీ 1947 తర్వాత ఏ పాకిస్తానీ విద్యార్థి కూడా వాటిని ఉపయోగించుకోలేదు. విదేశీ పరిశోధకులు మాత్రమే వాటిని ఉపయోగించారు. స్థానికంగానే పండితులకు ఇందులో శిక్షణ ఇస్తే చాలా మార్పు వస్తుంది’ అని గుర్మని సెంటర్ డైరెక్టర్ అలీ ఉస్మాన్ ఖాస్మీ చెప్పారు. రానున్న పది పదిహేనేళ్లలో మహాభారతం, భగవద్గీతలో పాకిస్తాన్‌కు చెందిన పండితులను చూస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తొలుత మూడు నెలల పాటు వారాంతాల్లో కోర్సుగా దీనిని ప్రారంభించినప్పటికీ.. మంచి స్పందన లభించడంతో నాలుగు క్రెడిట్ల యూనివర్సిటీ కోర్సుగా మార్చారు. దీన్ని చూశాకే తాము సంస్కృతాన్ని పూర్తిస్థాయి యూనివర్సిటీ కోర్సుగా ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్టు అలీ ఉస్మాన్ ఖాసీ తెలిపారు. 2027 ప్రారంభంలో దీనిని ఏడాది పొడవునా బోధించే కోర్సుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ఈ పరిణామంపై కాంగ్రెస్ నేత హుసేన్ దల్వాయి స్పందిస్తూ.. భారతదేశ చరిత్రతో పాకిస్తాన్‌కు కూడా సంబంధం ఉందని, అక్కడి యూనివర్సిటీలో సంస్కృతం బోధించడం ఆహ్వానించతగిన పరిణామమని చెప్పారు. ‘భారతదేశం నుంచి విడిపోయి పాకిస్తాన్ ఏర్పడింది. కనుక భారత చరిత్రతో పాకిస్తాన్‌కు కూడా సంబంధం ఉంటుంది. పాకిస్తాన్‌లో కొంతమంది మంచి వ్యక్తులు ముందుకు రావడం మంచి విషయం. మనం దానిని స్వాగతించాలి’ అని ఆయన అన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram