Parents Promotion | 2025లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సెలబ్రిటీలు.. అభిమానులకు డబుల్ సెలబ్రేషన్స్!

Parents Promotion | 2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ ఏడాది సినీ, రాజకీయ రంగాల్లో ఎన్నో మరిచిపోలేని ఘటనలు చోటుచేసుకున్నాయి. కొంతమంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెడితే, మరికొంతమంది విడాకులతో షాక్ ఇచ్చారు. అయితే ఈ ఏడాది కొంద‌రి జీవితాల్లో మరింత ప్రత్యేకంగా నిలిచింది.

  • By: sn |    movies |    Published on : Dec 14, 2025 2:05 PM IST
Parents Promotion | 2025లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సెలబ్రిటీలు.. అభిమానులకు డబుల్ సెలబ్రేషన్స్!

Parents Promotion | 2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ ఏడాది సినీ, రాజకీయ రంగాల్లో ఎన్నో మరిచిపోలేని ఘటనలు చోటుచేసుకున్నాయి. కొంతమంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెడితే, మరికొంతమంది విడాకులతో షాక్ ఇచ్చారు. అయితే ఈ ఏడాది కొంద‌రి జీవితాల్లో మరింత ప్రత్యేకంగా నిలిచింది. అందుకు కార‌ణం పలువురు ప్రముఖులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొంది తమ జీవితాల్లో కొత్త ఆనందానికి స్వాగతం పలికారు. అలా 2025లో పేరెంట్స్‌గా మారిన సెలబ్రిటీలెవరో ఇప్పుడు చూద్దాం.

కిరణ్ అబ్బవరం – రహస్య ఘోరక్

టాలీవుడ్ యంగ్ హీరోగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఈ ఏడాది తండ్రిగా మారారు. తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య ఘోరక్‌ను వివాహం చేసుకున్న కిరణ్, 2025 మే 22న పండంటి మగ బిడ్డకు తండ్రయ్యారు. హనుమాన్ జయంతి సందర్భంగా తిరుమలలో తమ కుమారుడికి “హను అబ్బవరం” అని నామకరణం చేయడం విశేషం.

కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా

బాలీవుడ్ హాట్ కపుల్ కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఈ ఏడాది పేరెంట్స్ అయ్యారు. 2025 జూలై 15న కియారా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్‌లో తమ కుమార్తెకు “సారయా మల్హోత్రా” అని పేరు పెట్టారు.

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి

మెగా హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులు 2025 సెప్టెంబర్ 9న పండంటి మగ బిడ్డకు జ‌న్మ‌నిచ్చారు. అక్టోబర్‌లో తమ కుమారుడికి “వాయువ్ కొణిదెల” అని నామకరణం చేశారు. మెగా ఫ్యామిలీలో మరో వారసుడి రాకతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

రాఘవ్ చద్దా – పరిణీతి చోప్రా

రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా దంపతులు 2025 అక్టోబర్ 19న మగ బిడ్డకు జ‌న్మ‌నిచ్చారు. వారు తమ కుమారుడికి “నీర్” అని పేరు పెట్టారు.

రాజ్‌కుమార్ రావ్ – పత్రలేఖ

బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్, నటి పత్రలేఖ 2025 నవంబర్ 15న తమ మొదటి బిడ్డను స్వాగతించారు. ఆడపిల్ల పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ “ఇది మా జీవితంలో గొప్ప ఆశీర్వాదం” అని పేర్కొన్నారు. తమ పెళ్లిరోజునే కుమార్తె పుట్టడం మరింత ప్రత్యేకమని తెలిపారు.

విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్

బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ 2025 నవంబర్ 7న మొదటి మగ బిడ్డకు జ‌న్మ‌నిచ్చారు. నాలుగేళ్ల వివాహ జీవితం తర్వాత బిడ్డ పుట్టడంతో సినీ పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

తిరువీర్ – కల్పన

‘మసూద’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్ కూడా ఈ ఏడాది తండ్రిగా మారారు. గతేడాది కల్పనను వివాహం చేసుకున్న ఆయనకు 2025 డిసెంబర్ 12న పండంటి మగ బిడ్డ జన్మించాడు. “నాయినొచ్చిండు” అంటూ సోషల్ మీడియాలో ఆనందం పంచుకున్నారు.

ఇలా 2025లో పలువురు సెలబ్రిటీలు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొంది తమ అభిమానులకు శుభవార్త అందించారు. ఈ చిన్నారులు వారి జీవితాల్లోనే కాదు, అభిమానుల హృదయాల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.