బెంగళూరు లో లాండన్ స్టైల్ టాక్స్…బిజీ రోడ్ల పై రద్దీ టాక్స్

బెంగళూరు నగర రోడ్లపై రద్దీ టాక్స్ (కంజెషన్ టాక్స్) విధించాలని కర్నాటక రాష్ట్ర ఐదవ ఆర్థిక కమిషన్ సిఫారసులు చేసింది. ఈ విధానంతో ఇబ్బడి ముబ్బడిగా తిరిగే ప్రైవేటు వాహనాలను నిరోధించవచ్చని పేర్కొంది.

  • By: Tech |    national |    Published on : Mar 13, 2026 10:41 PM IST
బెంగళూరు లో లాండన్ స్టైల్ టాక్స్…బిజీ రోడ్ల పై రద్దీ టాక్స్
  • బెంగళూరు లో లాండన్ స్టైల్ టాక్స్
  • బిజీ రోడ్ల పై త్వరలో రద్దీ టాక్స్
  • సిఫారసు చేసిన ఐదవ ఆర్థిక కమిషన్

విధాత, హైదరాబాద్ : బెంగళూరు నగర రోడ్లపై రద్దీ టాక్స్ (కంజెషన్ టాక్స్) విధించాలని కర్నాటక రాష్ట్ర ఐదవ ఆర్థిక కమిషన్ సిఫారసులు చేసింది. ఈ విధానంతో ఇబ్బడి ముబ్బడిగా తిరిగే ప్రైవేటు వాహనాలను నిరోధించవచ్చని పేర్కొంది. ఇలా వసూలు అయిన సొమ్మును అభివృద్ధి పనులకు వినియోగించుకోవాలని సూచించింది. లండన్ నగరం తరహాలో రాష్ట్రంలోని రద్దీ రోడ్లపై ఇరుకు టాక్స్ విధించాలని సిఫారసు చేసింది. రాష్ట్ర ఆర్థిక కమిషన్ చేసిన సిఫారసులను (2026—2030) నాలుగైదు రోజుల క్రితం కర్నాటక విధాన సౌధ లో ప్రవేశపెట్టారు.
బెంగళూరు నగరంలో ఏడాదికేడాదికి ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. ఎన్ని ఫ్లై ఓవర్లు నిర్మాణం చేసినా, మెట్రో రైలు విస్తరించినా నియంత్రించడం పెనుభారంగా మారింది. బెంగళూరు నగరంలో ప్రయాణించాలంటేనే స్థానిక పౌరులతో పాటు పర్యాటకులు హడలిపోతున్నారు. గత సెప్టెంబర్ నుంచి రద్దీ టాక్స్ (కంజెషన్ టాక్స్)పై చర్చ జరుగుతున్నది.

రవాణా పేరుతో ప్రజల దుబారాని నియంత్రించేందుకు, ట్రాఫిక్ ను రెగ్యులేట్ చేసేందుకు రద్దీ టాక్స్ విధించాలనే యోచనలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఉన్నారు. కమిషన్ సిఫారసులను ఇటీవలే విధాన సౌధలో ప్రవేశపెట్టారు. దీనిపై ప్రజల్లో చర్చ జరగడంతో పాటు తుది నిర్ణయం తీసుకునేందుకు మరికొద్ది నెలల సమయం తీసుకోవచ్చు. అయితే ఆర్థిక కమిషన్ కేవలం సిఫారసులు చేస్తుందని, అమలు చేయాలా వద్దా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా బిజీ రోడ్లపై రద్దీ టాక్స్ అమలు చేయడం మూలంగా ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా వాహనదారుల్లో మార్పు వస్తుందనే ఆశతో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. ఇదే కాకుండా ట్రాఫిక్ తగ్గుమఖం పట్టడంతో పాటు వాయు, శబ్ధ కాలుష్యం కూడా తగ్గనున్నది. పన్నుల రూపేణా సమకూరిన సొమ్మను ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు, రోడ్ల నిర్మాణానికి ఉపయోగించేందుకు వెసులుబాటు ఉండనున్నది. అత్యధిక రద్దీ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పై అమలు చేస్తే పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందనే లక్ష్యంతో ఉన్నారు. ప్రజా రవాణా సంపూర్ణంగా ఉన్న రోడ్లపై కూడా రద్దీ టాక్స్ అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం బెంగళూరు నగరంలో ఒక కోటి ఇరవై లక్షల వాహనాలు ఉండగా, ప్రతి రోజు 1,500 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఒక కోటి నలభై లక్షల మంది నివసిస్తున్న నగరంలో వ్యక్తిగత వాహనాల మూలంగా రద్దీ అధికమవుతున్నది, ట్రాఫిక్ సమస్య కు కారణమవుతున్నాయి.

1975 నుంచి సింగపూర్ లో
ప్రైవేటు వాహనాల వినియోగాన్ని నిరోధించేందుకు, ప్రజా రవాణా వైపు మళ్ళేలా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నగరాల్లో కంజెషన్ టాక్స్ అమలు చేస్తున్నారు. సింగపూర్ దేశంలో 1975 సంవత్సరంలో ఈ పన్ను విధానాన్ని ప్రారంభించారు. ఈ విధానం అమలు చేయడంతో ప్రజలు ఒక్కసారిగా వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించి, ప్రజా రవాణా వినియోగించుకోవడం మొదలెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత నగరం లండన్ లో 2003 సంవత్సరంలో కంజెషన్ టాక్స్ కు శ్రీకారం చుట్టారు. బిజీ రోడ్లపై నగరం బయట నుంచి వచ్చే వాహనాలు తగ్గించేందుకు, ప్రజా రవాణా ప్రోత్సహించడం, కాలుష్యం తగ్గించడం ప్రధాన లక్ష్యంగా మొదలుపెట్టారు. ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్న స్థానికులకు 90 శాతం డిస్కౌంట్ 2027 మార్చి నుంచి అమలు చేయలని నిర్ణయించారు. ఈ ఏడాది జనవరి 2వ తేదీ నుంచి ప్రతి రోజు ఒక్కో వాహనం నుంచి రద్దీ టాక్సీ పేరుతో 18 యూకే డాలర్ల చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రతి రోజు 7 గంటల నుంచి 18 గంటల వరకు, శనివారం, ఆదివారం, సెలవు రోజులలో 12 గంటల నుంచి 18 గంటల వరకు రద్దీ టాక్స్ అమలవుతున్నది. వ్యక్తిగత వాహనాలు, బైకులు, స్కూటర్లు, వ్యాన్లు, లారీలు, ట్రాక్సీ వాహనాలపై ఈ పన్ను విధానం అమలవుతోంది.
బెంగళూరు నగరంలో ఈ విధానం ప్రవేశపెట్టేందుకు వీలుగా గత సెప్టెంబర్ నెలలో సిద్ధరామయ్య సర్కార్ పెద్దలతో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీ యజమానులు చర్చించారు. అత్యధిక రద్దీ ఉన్న రోడ్లపై సింగిల్ గా ఫోర్ వీలర్ నడిపే యజమానిపై ఇరుకు టాక్స్ విధించాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదనపై పలువురి నుంచి వ్యతిరేకత వచ్చింది. రోడ్లపై, ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించకుండా తమపై పన్నులు ఎలా వేస్తారని పలువురు వాహన యజమానులు మండిపడ్డారు. నాణ్యమైన రోడ్లు లేకపోవడం, ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం, ప్రజా రవాణాకు నిధులు చాలినంతగా కేటాయించకపోవడం వంటి కారణాలు కూడా కారణమని నగర పౌరులు అభిప్రాయపడుతున్నారు.

Read more 
కొత్త ట్రెండ్​గా ‘గోల్డ్​ మినిమలిజం’ – అంటే ఏంటి?

దక్షిణాది రాష్ట్రాలలో మద్యం తాగడంలో తెలంగాణే నంబర్ వన్

వాట్సాప్ సంచలన అప్డేట్!..పేరెంట్‌-మేనేజ్డ్‌ మోడల్‌!!