బంగారు నగలు కావాలి : బరువు తక్కువుండాలి –  ఇప్పటి ట్రెండ్ ‘గోల్డ్ మినిమలిజం’!

బంగారం కొనడం తగ్గలేదు కానీ భారీ సెట్ల బదులు చిన్న, లైట్ వెయిట్ నగలను ఎంచుకునే గోల్డ్ మినిమలిజం ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఈ కొత్త జ్యువెలరీ ఫ్యాషన్ ఏమిటి? ఎందుకు యువత దీనిని ఇష్టపడుతోంది?

బంగారు నగలు కావాలి : బరువు తక్కువుండాలి –  ఇప్పటి ట్రెండ్ ‘గోల్డ్ మినిమలిజం’! సింపుల్ పెండెంట్లు, స్లిమ్ చైన్స్‌తో కనిపిస్తున్న మినిమలిస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్లు.

Gold Minimalism Trend: Why Lightweight Jewellery Is the New Fashion

సారాంశం
బంగారం కొనుగోలు తగ్గకపోయినా దాన్ని ధరించే విధానం మారుతోంది. భారీ హారాలు, బరువైన సెట్ల బదులు చిన్న, లైట్ వెయిట్, సింపుల్ డిజైన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ట్రెండ్‌ను గోల్డ్ మినిమలిజం అంటారు.

 

విధాత లైఫ్​స్టైల్​ డెస్క్​ | 12 మార్చి 2026 | హైదరాబాద్​:

బంగారం అంటే భారతీయులకు ఎప్పటికీ ప్రత్యేకమైన ఇష్టం. పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాలు అన్నింటిలో మహిళలు బంగారు నగలతోనే మరింత మెరిసిపోతారు. అయితే ఇటీవలి కాలంలో బంగారం ధరలు పెరిగినా, బంగారం కొనుగోలు మాత్రం తగ్గలేదు. కానీ దాన్ని ధరించే విధానం మాత్రం పూర్తిగా మారుతోంది.

ఒకప్పుడు భారీ హారాలు, బరువైన గాజులు, పెద్ద బంగారు సెట్లు అంటేనే ఫ్యాషనే కాకుండా, సమాజంలో గౌరవం, హుందాతనం అనుకునేవారు. ఇప్పుడు మాత్రం ఫ్యాషన్ ప్రపంచంలో కొత్తగా గోల్డ్ మినిమలిజం అనే ట్రెండ్ వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. అంటే బంగారం తక్కువగా కొనడం కాదు… తక్కువ బరువుతో, సింపుల్ డిజైన్‌తో, రోజూవారీ వాడకానికి సరిపోయే నగలను ఎంచుకోవడం.

చిన్న స్టడ్స్‌, సన్నని చైన్స్‌, స్లిమ్ బ్రేస్‌లెట్లు, లైట్ పెండెంట్లు వంటి మినిమల్ డిజైన్లు ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. యువత నుంచి ఉద్యోగినుల వరకు చాలా మంది ఈ శైలిని ఇష్టపడుతున్నారు.

గోల్డ్ మినిమలిజం అంటే ఏమిటి?

Minimalist gold jewellery layered necklaces rings fashion trend

లేయర్డ్ చైన్స్‌, స్టాకబుల్ రింగ్స్‌తో కనిపిస్తున్న మినిమల్ గోల్డ్ ఫ్యాషన్ ట్రెండ్.

ఫ్యాషన్ ప్రపంచంలో “మినిమలిజం” అనే భావన ఇప్పటికే దుస్తులు, ఇంటీరియర్ డిజైన్‌, లైఫ్‌స్టైల్‌లో ప్రాచుర్యం పొందింది. అదే భావన ఇప్పుడు ఆభరణాలలోకి కూడా వచ్చింది.

గోల్డ్ మినిమలిజంలో రెండు రకాలున్నాయి. ఒకటి అమ్మాయిలకు, ఇంకోటి పెద్దవారికి. అంటే భారీగా కనిపించే నగల బదులు అమ్మాయిలు చిన్నగా, సొగసుగా, ఎప్పుడైనా ధరించగలిగేలా ఉండే బంగారు నగలను ఎంచుకోవడం. ఒకే భారీ హారం ధరించే బదులు, సన్నని చైన్ లేదా చిన్న పెండెంట్ వేసుకోవడం. చేతికి బరువైన గాజుల బదులు స్లిమ్ బ్రేస్‌లెట్ ధరించడం.  అలాగే పెద్దవారు పూర్తిగా నిండిఉండే నగల స్థానంలో బోలుగా(లోపల ఖాళీగా) ఉండే గాజులు లాంటివాటిని ఇష్టపడుతున్నారు. సైజు మామూలుగానే ఉంటుంది. కానీ, బరువు తక్కువుంటుంది.

ఈ అమ్మాయిల స్టైల్‌లో ముఖ్యమైన లక్షణం — సింప్లిసిటీ మరియు ఎలిగెన్స్. ఎక్కువ బంగారం చూపించకుండా, చిన్న డిజైన్‌తోనే స్టైల్‌ను చూపించడం. పెద్దవారికి చూడటానికి మామూలు నగలాగే ఉంటుంది. అందరికీ బరువుండే నగలాగే కనబడుతుంది. కానీ, బరువు మాత్రం చాలా తక్కువుంటుంది.

ఎందుకు పెరుగుతోంది ట్రెండ్?

Minimal gold rings chains bracelet modern jewellery trend

స్లిమ్ చైన్స్‌, చిన్న రింగ్స్‌తో రూపొందించిన ఆధునిక మినిమలిస్ట్ గోల్డ్ జ్యువెలరీ.

ఇటీవల సంవత్సరాల్లో జీవనశైలి మార్పులు కూడా దీనికి కారణమయ్యాయి. ఉద్యోగాలు, ఆఫీస్ కల్చర్, డిజిటల్ లైఫ్ స్టైల్ వల్ల రోజూవారీ కార్యక్రమాలకు అనువైన నగలపై డిమాండ్ పెరిగింది. భారీ నగలు ప్రతిరోజూ ధరించడం అసౌకర్యంగా ఉండటంతో చాలా మంది సింపుల్ జ్యువెలరీనే ఎంచుకుంటున్నారు.

ఇంకో కారణం ఫ్యాషన్ ట్రెండ్లు. ఇండో-వెస్ట్రన్ దుస్తులు, క్యాజువల్ వేర్‌తో సింపుల్ గోల్డ్ జ్యువెలరీ బాగా సరిపోతుంది. సోషల్ మీడియా, ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఈ స్టైల్‌ను ప్రోత్సహిస్తున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా, బంగారం ధరలు పెరగడం వల్ల కూడా చాలా మంది భారీ నగల బదులు చిన్న బంగారు పీసెస్ కొనడాన్ని ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు బంగారం మార్కెట్‌లో లైట్ వెయిట్, టైమ్‌లెస్ డిజైన్లు ప్రధాన ట్రెండ్‌గా మారాయి.