Elephant | బెంగళూరు : కాఫీ తోట సందర్శనకు వెళ్లిన ఓ ఐపీఎస్ సతీమణిపై ఏనుగు దాడి చేసింది. దాంతో తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లాలో చోటు చేసుకుంది.
నాగలాండ్ కేడర్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ అచయ డిప్యూటేషన్‌పై కర్ణాటకలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన సతీమణి సంధ్య అచయ(51) మరో ఇద్దరితో కలిసి తితిమట్టి సమీపంలోని కొననకట్టే గ్రామంలోని కాఫీ తోటల్లోకి వెళ్లారు. కాఫీ తోట సందర్శన అనంతరం తిరిగి వెళ్తుండగా.. ఆకస్మాత్తుగా ఏనుగు దాడి చేసింది.
ఏనుగు దాడిలో సంధ్య అచయ తీవ్ర గాయాలపాలయ్యారు. అప్రమత్తమైన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు.
ఈ దాడికి ముందు స్థానికంగా ఉన్న కాఫీ తోటల్లో పని చేస్తున్న ఇద్దరు కార్మికులపై అదే ఏనుగు దాడి చేయగా, వారు తీవ్రంగా గాయపడినట్లు కార్మికులు తెలిపారు. ఏనుగుల దాడులు కొనసాగుతున్నప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.