విధాత, హైదరాబాద్ : దేశ రైతాంగం పంటల సాగు చేసేందుకు కీలకమైన నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం ఉదయం అండమాన్ దీవులను తాకినట్లు ఐఎండీ స్పష్టం తెలిపింది. ప్రతి సంవత్సరం ఈ రుతుపవనాలు మే 18 నుంచి 20 తేదీల మధ్యలో అండమాన్ తీరాన్ని తాకుతాయని.. ఇందులో భాగంగానే ఒక రోజు ముందుగా.. వచ్చాయని.. ఈసారి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయని.. వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్, మాల్దీవులు, కొమోరియన్ లోని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని.. మే 31న కేరళ, తీరానికి చేరుకుంటాయని.. జూన్ మొదటి వారంలో రాయలసీమకు, ఆ తర్వాత వారంలో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ సారి వర్షపాతం సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తుండటంతో రైతులు ఖరీఫ్ పంటల సాగు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.