పతంజలి సంస్థకు సుప్రీం అక్షింతలు

పతంజలి ఆయుర్వేద సంస్థ కరోనాపై పోరాడేందుకు కరోనిల్ ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుందంటూ ఇచ్చిన ప్రకటనలపై మండిపడిన సుప్రీంకోర్టు మంగళవారం జరిగిన విచారణలో మరోసారి పతంజలి సంస్థకు అక్షింతలు వేసింది

  • Publish Date - April 23, 2024 / 03:31 PM IST

మీ ఉత్పత్తుల ప్రకటనల సైజులోనే క్షమాపణల ప్రకటన ఉందా

విధాత : పతంజలి ఆయుర్వేద సంస్థ కరోనాపై పోరాడేందుకు కరోనిల్ ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుందంటూ ఇచ్చిన ప్రకటనలపై మండిపడిన సుప్రీంకోర్టు మంగళవారం జరిగిన విచారణలో మరోసారి పతంజలి సంస్థకు అక్షింతలు వేసింది. పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్, బాలకృష్ణల తరుపున విచారణకు హాజరైన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ తాజాగా కోర్టుకు మరోసారి క్షమాపణ అఫిడవిట్లను సమర్పించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు గతంలో పతంజలి ఉత్పత్తులపై పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిన సైజ్ లోనే క్షమాపణ ప్రకటన కూడా ఉందా? అని ప్రశ్నించింది. విచారణకు బాబా రాందేవ్‌, బాలకృష్ణలు కూడా హాజరయ్యారు. సుప్రీం ప్రశ్నలకు ముకుల్ రోహత్గీ బదులిస్తూ “రూ. 10 లక్షలు ఖర్చుపెట్టి 67 వార్తాపత్రికల్లో క్షమాపణ ప్రకటనలు ఇచ్చాం” అని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ఘాటుగా స్పందించారు. “మీ క్షమాపణను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో మీరిచ్చిన ప్రకటనల తరహాలోనే అంతే పెద్ద అక్షరాలు, పెద్ద సైజులో క్షమాపణ ఉందా?” అని నిలదీశారు. అయితే క్షమాపణ చెప్పేందుకు కంపెనీ రూ. లక్షల్లో ఖర్చుపెట్టిందని ముకుల్ రోహత్గీ గుర్తుచేయగా ఆ విషయం తమకు అవసరంలేదని కోర్టు వ్యాఖ్యానించింది.

అదే సమయంలో పతంజలి సంస్థపై కోర్టుకెక్కిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు రూ. వెయ్యి కోట్ల జరిమానా విధించాలంటూ పిటిషన్ దాఖలు కావడంపై కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. “ఇది మీకు బదులుగా వేయించిన పిటిషనా? మా అనుమానం అదే” అని వ్యాఖ్యానించింది. అయితే ఈ పిటిషన్ తో తమ క్లయింట్లకు ఎలాంటి సంబంధం లేదని ముకుల్ రోహత్గీ వివరణ ఇచ్చారు. వార్తాపత్రికల్లో మరింత పెద్ద సైజులో క్షమాపణ ప్రచురిస్తామని చెప్పారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు వారంపాటు వాయిదా వేసింది.
ఈ కేసు మంగళవారం విచారణకు రానున్న నేపథ్యంలో అన్ని జాతీయ వార్తాపత్రికల్లో మంగళవారం పతంజలి ఆయుర్వేద సంస్థ క్షమాపణ ప్రకటన ఇచ్చింది. సుప్రీంకోర్టు అంటే తమకు అపార గౌరవం ఉందని.. ఇకపై తాము పొరపాట్లు చేయబోమని ఆ ప్రకటనలో పేర్కొంది. షుగర్, బీపీ లాంటి వ్యాధులను తమ ఉత్పత్తులు నయం చేస్తాయంటూ పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనలు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు గతంలో తప్పుబట్టింది. అలాగే ఈ విషయంపై ముందుగా మీడియాకు క్షమాపణ అఫిడవిట్లు విడుదల చేసి ఆ తర్వాత వాటిని కోర్టుకు సమర్పించడంతో న్యాయస్థానం వారి క్షమాపణలను తిరస్కరించింది.

Latest News