Site icon vidhaatha

Supreme Court | కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్ధంగా ఉండండి

 

న్యూఢిల్లీ: కోర్టు ఉల్లంఘన కేసులో చర్యలకు సిద్ధంగా ఉండాలని పతంజలి ఆయుర్వేద్‌ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాలకృష్ణలకు సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఈ కేసులో ఉత్తరాఖండ్‌ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారినీ చీల్చి చెండాడుతామని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇచ్చిన నివేదికపైనా అసంతృప్తి వెలిబుచ్చింది. అలోపతి కంటే కరోనిల్‌ మందు బాగా పనిచేస్తుందంటూ కరోనా వేళ పతంజలి ఆయుర్వేద్‌ సంస్థ ప్రకటనలు ఇవ్వడంపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు విచారిస్తున్నది. ఈ కేసులో తాజాగా బుధవారం రెండోసారి బాబా రాందేవ్‌, బాలకృష్ణ చెప్పిన క్షమాపణలను ధర్మాసనం తిరస్కరించింది.

కాగా.. వారు చెబుతున్న క్షమాపణలు అఫిడవిట్‌కే పరిమితమై ఉంటున్నాయని వ్యాఖ్యానించింది. ఏదో మొక్కుబడిగా క్షమాపణలు కాగితంపై రాసి మాకు ఇచ్చారు. వాటిని మేం తిరస్కరిస్తున్నాం. అవి ఉద్దేశపూర్వకంగానే జరిగాయని పరిగణిస్తున్నాం’ అని పేర్కొన్నది. ఈ వ్యవహారంలో ఉన్నప్పుడు నిర్ణీత సమయంలో అఫిడవిట్లు సమర్పించాలన్న సోయి వారికి లేకుండా పోయిందని చీవాట్లు పెట్టింది. తాము గుడ్డిగా ఉండదల్చుకోలేదని, ఉదారంగానూ వ్యవహరించబోమని తేల్చి చెప్పింది. ఈ కేసులో వారిపై తీసుకోబోయే చర్యలను ఏప్రిల్‌ 16న ఖరారు చేస్తామని వెల్లడించింది. తమ క్షమాపణను పతంజలి సంస్థ కోర్టుకు సమర్పించడానికి ముందే బహిర్గం చేయడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘మాకు అప్‌లోడ్‌ చేయడానికి ముందే మొదట వారు దానిని మీడియాకు మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో పంపించారు. వారు పబ్లిసిటీ కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతున్నది’ అని జస్టిస్‌ కోహ్లి వ్యాఖ్యానించారు. వీరిద్దరి క్షమాపణలు హృదయపూర్వకంగా ఉన్నాయా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒక దశలో పతంజలి తరపున హాజరైన సీనియర్‌ అడ్వొకేట్‌ ముకుల్‌ రోహత్గీ.. అఫిడవిట్లలో లోపం ఉన్నదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. లోపం అనేది చిన్న మాట అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాము ఆదేశాలు ఇచ్చాక కూడా తప్పు చేశారని గుర్తు చేసింది. క్షమాపణలు చెబితే సరిపోదని, వాటి పర్యవసనాలకు కూడా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది.

తనకు విదేశీ ప్రయాణం ఉన్నందున కోర్టు విచారణ నుంచి మినహాయించాలని రాందేవ్‌ బాబా విజ్ఞప్తిపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ధిక్కరణ విషయంలో మీరు మినహాయింపు కోరే ముందు విదేశాలకు వెళ్లేందుకు నాకు టికెట్‌ ఉన్నది అని చెబుతారు.. మళ్లీ మీరే టికెట్ లేదంటారు. ఈ ప్రక్రియను మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇది అసత్య ప్రమాణం అవుతుంది’ అని వ్యాఖ్యానించింది. పతంజలి ఉత్పత్తులకు లైసెన్స్‌ జారీ చేయడంపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

డ్రగ్‌ లైసెన్సింగ్‌ అధికారులు ముగ్గురినీ తక్షణమే సస్పెండ్‌ చేయాలని ఆదేశించింది. పతంజలి సంస్థ ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? కూర్చొని గోళ్లు గిల్లుకుంటున్నారా? మేం వచ్చి గిల్లే దాకా ఎదురు చూస్తున్నారా? అని జస్టిస్‌ కోహ్లి అడిగారు. ఉత్తరాఖండ్‌ స్టేట్‌ లైసెన్సింగ్‌ అథార్టీ తరఫున వాదించిన సీనియర్‌ అడ్వొకేట్‌ ధృవ్‌ మెహతాను ఉద్దేశించి జస్టిస్‌ అమానుల్లా మాట్లాడుతూ.. అధికారులను వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు.

‘అధికారులను ఉద్దేశించి విశ్వసనీయులు అనే పదం వాడటంపై మేం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. దీన్ని మేం తేలిగ్గా తీసుకోవడం లేదు. మిమ్మల్ని చీల్చి చెండాడుతాం’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనిపై ఉత్తరాఖండ్‌ స్టేట్‌ లైసెన్సింగ్‌ అథార్టీ జాయింట్‌ డైరెక్టర్‌ మిథిలేశ్‌కుమార్‌ స్పందిస్తూ.. వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గతంలో పతాంజలి కంపెనీ కరోనా 19 వైరస్‌కు విరుగుడుగా తాము తయారు చేసిన కరోనిల్‌ పనిచేస్తుందని పేర్కొన్నది. ఇది అల్లోపతి మందుల కన్నా శక్తిమంతంగా పనిచేస్తుందని వ్యాపార ప్రకటనలు గుప్పించింది. సదరు వాణిజ్య ప్రకటనలపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అనుషనుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం నవంబర్‌ 21, 2023న బాబా రాందేవ్‌, బాలకృష్ణలకు నోటీసులు పంపింది. ప్రజలను తప్పుదోవ పట్టించే అన్ని వ్యాపార ప్రకటనలను పతంజలి ఆయుర్వేద్‌ వెంటనే నిలిపివేయాలని అందులో ఆదేశించింది. ఈ విషయంపై ఎటువంటి ఉల్లంఘన జరిగినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుదని సుప్రీం తెలియజేసింది.

ప్రతిఒక్క తప్పుదోవ పట్టించే ఉత్పత్తిపై కోటి రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుందని కూడా సుప్రీం హెచ్చరించింది. ఆ మరునాడే అంటే.. నవంబర్‌ 22, 2023న బాబా రాందేవ్‌ హరిద్వార్‌లో ఒక మీడియా సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా.. డిసెంబర్ 4, 2023న పతంజలి కంపెనీ గతంలో మాదిరిగానే మళ్ళీ వ్యాపార ప్రకటన ఇచ్చింది. దీనిపై ఏప్రిల్‌ 6వ తేదీన విచారించిన ధర్మాసనం.. తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. తాజా విచారణలో వారిపై తీసుకోబోయే చర్యలను ఏప్రిల్‌ 16న ఖరారు చేస్తామని ప్రకటించింది.

Exit mobile version