Site icon vidhaatha

Rama Setu | నాలుగు వారాల్లో సమాధానమివ్వాలి.. రామసేతు జాతీయ హోదాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

Rama Setu | విధాత : రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ నోటీసులిచ్చింది. హిందూ పురాణాల ప్రకారం సీతను రక్షించడానికి రాముడు, వానర సైన్యం లంకకు వెళ్లడానికి రామసేతును నిర్మించిందని చెబుతారు. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని సుబ్రమణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్థలం విశ్వాసానికి సంబంధించిన విషయమని ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. 2005 నుండి ఈ వంతెన వివాదంలో చిక్కుకుంది, అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం సేతుసముద్రం షిప్పింగ్ ఛానల్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. 12 మీటర్ల లోతు, 300 మీటర్ల వెడల్పు ఉన్న కాలువను తవ్వేందుకు అనుమతి ఇచ్చింది. అయితే షిప్ఫింగ్ ఛానల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని సుబ్రమణ్యస్వామి మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ పెండింగ్‌లో ఉంది. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ ఆయన గతంలోనే పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Exit mobile version