Union Budget 2026 | హైదరాబాద్ : ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం( Financial year ) ముగిసేలోపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రకారమే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala Sitaraman ) యూనియన్ బడ్జెట్( Union Budget )ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈసారి బడ్జెట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. దేశంలో తొలిసారిగా ఆదివారం( Sunday ) నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్.
ఆదివారమే ఎందుకు..? కారణం ఏంటి..?
2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 నుంచి బడ్జెట్ విషయంలో ప్రత్యేక మార్పులు తీసుకొచ్చింది. అంతకుముందు ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. కానీ 2017 నుంచి ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని అమలు చేసింది.. అమలు చేస్తుంది కూడా. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నాడు వస్తుంది. 2026లో ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడితే, అది ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే బహుశా మొదటిసారి ఆదివారం నాడు సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
గతంలో ఎప్పుడైనా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టారా..?
గతంలో ఎప్పుడూ కూడా ఆదివారం నాడు సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భాలు లేవు. 2017 నుంచి నేటి వరకు పరిశీలిస్తే.. రెండుసార్లు మాత్రం శనివారం నాడు సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2015లో అరుణ్ జైట్లీ, 2020లో నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 (శనివారం) నాడు సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీని కారణంగా స్టాక్ మార్కెట్‌ను కూడా ప్రత్యేకంగా ఓపెన్ చేశారు.
ఫిబ్రవరి 1న తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే..?
2017కి ముందు, సాధారణ బడ్జెట్ ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టేవాళ్లు. ఆ సమయంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదటి మూడు నెలల ఖర్చులకు ప్రభుత్వం అనుమతి పొందేది. అయితే, మొత్తం సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు తర్వాత ఆమోదం లభించేది. 2017లో కేంద్ర ప్రభుత్వం ఇందులో పెద్ద మార్పు చేయాలని నిర్ణయించుకుంది. నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 నుంచి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని ప్రారంభించారు. దీంతో మార్చి చివరి నాటికి బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం లభించేది. అంటే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని ప్రక్రియలు పూర్తయ్యేవి.
