రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపవర్గీకరణ అధికారం
ఏడుగురు సభ్యుల ధర్మాసనం కీలక తీర్పు
వర్గీకరణకు మద్దతు పలికిన ఆరుగురు
వ్యతిరేకించిన జస్టిస్ బేలా ఎం త్రివేది
2004 నాటి తీర్పును పక్కనపెట్టిన సుప్రీం
ఎస్సీ, ఎస్టీ ఉపకులాలను సజాతిగా భావించలేం
వారి జనాభా మేరకు వర్గీకరించవచ్చు
వివక్షతో ఎదగలేకపోతున్న ఎస్సీ, ఎస్టీలు
వర్గీకరణను చిత్తశుద్ధితో నిర్వహించాలి
నిర్ణయాలు కోర్టు సమీక్షకు లోబడి ఉంటాయి
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్
విధాత, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టంచేసింది. ఎస్సీ, ఎస్టీ కోటాలో ఉప వర్గీకరణ ఉండదని చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఎస్సీలు హోమోజీనస్ వర్గం కిందకు వస్తారంటూ 2004లో ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెట్టింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఉన్నారు. వీరిలో ఒక్క జస్టిస్ త్రివేది మాత్రం వ్యతిరేకం తీర్పునిచ్చారు. వర్గీకరణ తప్పనిసరి అని, వర్గీకరణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీల్లో వెనుకబడిన కులాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల్లోని ఉప కులాలను హోమోజీనస్ వర్గం (ఒకే సమూహం)గా భావించలేమని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. వారి జనాభా లెక్కలు, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల వంటా వివరాల ఆధారంగా వారిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరించవచ్చునని తెలిపారు. వ్యవస్థలో ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ, ఎస్టీలు ఎదగలేక పోతున్నారని ధర్మాసనం పేర్కొన్నది. అదే విధంగా తమిళనాడులో అరుంధతీయర్ల (విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీలకు ప్రత్యేక రిజర్వేషన్) చట్టాన్ని కోర్టు సమర్థించింది. ఈ చట్టం తమిళనాడులోని ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నది. పంజాబ్ చట్టాన్ని సైతం సుప్రంకోర్టు సమర్థించింది. షెడ్యూల్డ్ కులాలు హోమోజీనియస్ కిందకు రారని చెప్పేందుకు చారిత్రక ఆధారాలను సైతం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో ప్రస్తావించారు. ఉప వర్గీకరణ అనేది రాజ్యాంగంలోని 14వ అధికరణం పేర్కొంటున్న సమానత్వం సూత్రాన్ని ఉల్లంఘించబోదని ఆయన స్పష్టం చేశారు. దానితోపాటు ఆర్టికల్ 341 (2)ను కూడా ఇది ఉల్లంఘించడం లేదని పనేర్కొన్నారు. ఉప వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో నిర్వహించాలని, రాజకీయ ప్రయోజనాల రీత్యా ఉండరాదని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు కోర్టు సమీక్షకు లోబడి ఉంటాయని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు.
పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ గుర్మిందర్ సింగ్‌తోపాటు అదనపు అడ్వొకేట్ జనరల్ షాదాన్ ఫరాసత్ వాదనలు వినిపించారు. వారితోపాటు ఇతర పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ శంకరనారాణ్, మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్, సిద్ధార్థ లూత్రా, సల్మాన్ ఖుర్షీద్, మురళీధర్ తదితరులు వాదనలు వినిపించారు. కేంద్ర తరఫున హాజరైన అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఉప వర్గీకరణకు ప్రభుత్వ మద్దతును తెలిపారు. సుప్రీం తీర్పుతో దేశవ్యాప్తంగా దళితులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో మూడు రోజులపాటు వర్గీకరణ అంశంపై విచారణ సాగింది. వర్గీకరణ సమర్థనీయమని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. సుదీర్ఘ వాదనలు అనంతరం ఫిబ్రవరి 8న తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు తుది తీర్పును గురువారం వెల్లడించింది.
ఉమ్మడి ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో కీలక మలుపు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సంబంధించి ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో బీజం పడింది. 2000-2004 వరకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను అమలు చేసింది. అయితే మాల మహానాడు వర్గీకరణను వ్యతిరేకించింది. హైకోర్టులో న్యాయపోరాటం చేసింది. హైకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దాంతో 2004లో అనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ అనంతరం వర్గీకరణను వ్యతిరేకించింది. కుల, సామాజిక వివక్షతో వెనుక బడిన వాళ్లందరిని ఒకే కేటగిరిలో ఉంచాలని ఆదేశాలిస్తూ.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పోరాటాలు ప్రజా ఉద్యమాలుగానూ, రాజకీయ ఉద్యమాలుగానూ జరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో 2011 జనాభా లెక్కల మేరకు కోటీ 38 లక్షల 78వేల ఎస్సీ జనాభాలో మాలల కంటే మాదిగలు 12లక్షలు అధికంగా ఉన్నారు. జనాభాలో అధికంగా ఉండి, అణిచివేతకు గురైన తమకు రిజర్వేషన్లలో న్యాయం జరుగడానికి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలన్న డిమాండ్‌ను మాదిగలు గట్టిగా వినిపించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో ఉధృతస్థాయిలో ఉద్యమాలు సాగాయి. సుప్రీంకోర్టులో ఎమ్మార్పీఎస్ న్యాయపోరాటం చేపట్టింది. అయితే పంజాబ్ ప్రభుత్వం తాజాగా వర్గీకరణ చేసేందుకు సిద్ధం అవడంతో అక్కడి హైకోర్టు సుప్రీం కోర్టులోని 2004 కేసుతో కలిపి విచారణకు రిఫర్ చేసింది. ఇటు ఇటీవల తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సహా, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమని బీజేపీ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ కూడా వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మూడు రోజుల పాటూ సుదీర్ఘ విచారణ జరిపింది. ఫిబ్రవరి 8 న తీర్పును రిజర్వ్ చేసి నేడు వెల్లడించింది. వర్గీకరణను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలవబోతుందనడంలో సందేహం లేదు.