Maoists Surrender||లొంగుబాటలో దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిలు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ అటవీప్రాంతం నుంచి తెలంగాణ స్పెషల్ ఇంటెలీజెన్స్ వర్గాల అదుపులోకి ఈ ఇద్దరు నేతలు వెళ్ళినట్లు సమాచారం.

devji target karregutta combing operation

విధాత, ప్రత్యేక ప్రతినిధి: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిలు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ అటవీప్రాంతం నుంచి తెలంగాణ స్పెషల్ ఇంటెలీజెన్స్ వర్గాల అదుపులోకి ఈ ఇద్దరు నేతలు వెళ్ళినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నట్లు చెబుతున్నారు. నేడో, రేపో ఈ ఇద్దరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పెద్దపల్లికి చెందిన తిప్పిరి తిరుపతి విద్యార్ధి దశలోనే అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనట్లు చెబుతున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన తిరుపతిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అంశం పై ఆ పార్టీ లొంగిపోయిన నేతలే భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు నేతలు లొంగిపోవడంతో ప్రధాన నాయకత్వమంతా అమరులుకావడమో? లొంగిపోవడమో? జరిగినట్లు భావించాల్సి వస్తోంది.

డీజీపీ ప్రకటన ఉద్దేశ్యమిదేనా?

కొద్ది రోజుల క్రితమే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చేసిన ప్రకటన అంతర్యమిదేనా? అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో మిగిలిన మావోయిస్టు నేతలు కూడా లొంగిపోవాలని, సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టుల లొంగబాటుకు సహకరిస్తున్నట్లు, వారికి పునరావాస చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందే ఈ ఇద్దరు నేతల నుంచి ఏవైన సానుకూల సంకేతాలు వెలువడ్డాయా? అనే చర్చ ఇప్పుడు సాగుతోంది. అదే విధంగా ఆదిలాబాద్, మహదేవ్ పూర్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు తెలంగాణ పోలీసు బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. ఇవన్నీ చూస్తే తెలంగాణ పోలీసులకు ముందస్తు సమాచారం ఉండచ్చంటున్నారు. తాజాగా లొంగిపోయిన ఆ పార్టీ నేత మల్లోజు వేణుగోపాల్ కూడా ఈ ఇద్దరు నేతలు లొంగిపోవాలంటూ ఆకాక్షించడం గమనార్హం. ఈ క్రమంలో దేవ్ జీ, రాజిరెడ్డి లొంగిపోయినట్లు తాజా సమాచారం బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది.

దామోదర్ కూడా ఉన్నారా? గణపతి జాడెక్కడ?

దేవ్ జీ, రాజిరెడ్డి ఇద్దరు నేతలే లొంగిపోయారా? వీరి వెంట మరి కొంతమంది నాయకులున్నారా? అనే చర్చ సాగుతోంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దామోదర్ కూడా ఇటీవల మేడారం అటవీ ప్రాంతంలో సంచరించినట్లు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఇదిలా ఉండగా మరో కీలక నేత ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి తప్పుకున్న గణపతి అలియాస్ ముల్పాల లక్ష్మణరావు ఎక్కడ ఉన్నారనేది కూడా ఆసక్తిరేపుతున్న ప్రశ్న. ఒక మైపు ముఖ్యనాయకులు లొంగుబాటలో ప్రయాణిస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున సాయుధ బలగాలతో మరి కర్రెగుట్టల్లో ఆపరేషన్ ఎందుకు నిర్వహిస్తున్నారు .అక్కడ ఏ నాయకులున్నారనే ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నంబాల తర్వాత దేవ్ జీ

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు ఎన్ కౌంటర్ అనంతరం ఆ పార్టీ మిలటరీ చీఫ్ గా వ్యవహరిస్తున్న పొలిట్ బ్యూరో సభ్యుడు దేవ్ జీని అందుబాటులో ఉన్న సభ్యులు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికున్నారు. ఈ వార్తలు కొందరు లొంగిపోయిన పార్టీ నాయకులు దృవపరచగా, మరి కొందరు ఎన్నిక ఎప్పుడు జరిగిందో తెలియదని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే హిడ్నా ఎన్కౌంటర్ సందర్భంగా దేవ్ జీ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. విజయవాడలో అరెస్టైన 30 మంది మావోయిస్టుల్లో 9 మంది దేవ్ జీ సెక్యూరిటీ టీమ్ ఉన్నట్లు ఏపీ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా దేవ్ జీ, రాజిరెడ్డిల లొంగుబాటు నిజమైతే మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వమంతా చనిపోవడమో? లొంగిపోవడమో? .జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

మార్చి 31కి ముందే మావోయిస్టుల తుడిచివేత

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ప్రారంభమైన అపరేషన్ కగార్ తుది దశకు చేరినట్లేనని భావిస్తున్నారు. కేంద్రం డెడ్ లైన్ కు మరో 40 రోజుల సమయం ఉండగానే కీలక నేతలు సైతం లొంగుబాట పట్టడంతో అగ్రనాయకత్వాన్ని అంతమొందించడమో? లేదా లొంగుబాటు పట్టించడమో చేసినట్లేనని భావిస్తున్నారు. ముఖ్యంగా దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు చేసిన మావోయిస్టులపై కేంద్రబలగాలు పూర్తి పట్టుసాధించినట్లు చెబుతున్నారు. ఎవరైనా నాయకులు మిగిలిన ఉంటే ఈ నెలరోజుల సమయంలో ఎన్ కౌంటర్లలో తుడిచిపెట్టడమో? లొంగిపోవడమో? జరుగుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రకటించిన తుది గడువుకు ముందే అమిషా విజయోత్సవం నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. తాజాగా ఆయన శనివారం చేసిన ప్రకటన ఉదాహరణగా చెబుతున్నారు.

 

Latest News