సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలన్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు బుధవారం అంగీకరించింది. అయితే.. ఉదయనిధికి నోటీసులు జారీ చేయకపోయినా.. ఉదయనిధి వ్యాఖ్యలు విద్వేషాన్ని రెచ్చగొట్టేవిగా ఉన్నాయని ఢిల్లీకి చెందిన న్యాయవాది వినీత్ జిందాల్ దాఖలు చేసిన పిటిషన్‌కు అతని పేరును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ట్యాగ్ చేసింది. ఉదయనిధిపై ఎఫ్‌ఐఆర్ దాఖలుకు తమిళనాడు ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతతో ఉన్న విషయం తెలిసిందే.
ఇదే విషయంలో పెండింగ్‌లో ఉన్న కేసుతో కలిపి దీనిని సుప్రీంకోర్టు విచారించనున్నది. బుధవారం ఈ అంశంలో సుప్రీంకోర్టులో స్వల్ప వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా తమిళనాడు అదనపు అడ్వొకేట్ జనరల్ అమిత్ ఆనంద్ తివారి తన వాదనలు వినిపిస్తూ.. పిటిషన్‌ను విచారణకు స్వీకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవి ప్రజాప్రయోజన వ్యాజ్యాల ముసుగులో వేసిన పబ్లిసిటీ ప్రయోజనాలతో కూడిన వ్యాజ్యాలని వాదించారు.
దేశంలోని వివిధ హైకోర్టుల్లో 40కిపైగా వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ పబ్లిసిటీ కోసం ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ బోస్ స్పందిస్తూ.. తాము నోటీసు జారీ చేయడం లేదని, వేరొకదానికి జోడిస్తున్నామని చెప్పారు. విద్వేష ఉపన్యాసాలపై తమంతట తాముగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న సుప్రీం కోర్టు మార్గదర్శకాలను తమిళనాడు ప్రభుత్వం ఎందుకు పాటించడం లేదని జిందాల్ తన పిటిషన్‌లో ప్రశ్నించారు. ఢిల్లీ, చెన్నై పోలీసులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరారు.