న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు(Supreme Court of India) 53వ ప్రధాన న్యాయమూర్తిగా(New CJI) జస్టిస్ సూర్యకాంత్(Surya Kant) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2027, ఫిబ్రవరి 9 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు.
సీజేఐ సూర్యాకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సీపీ.రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 1962, ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 1981లో డిగ్రీ పూర్తి చేసిన సూర్యకాంత్..1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు.
అదే ఏడాది హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్, హర్యానా హైకోర్టులలో కూడా పనిచేశారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పని చేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగమయ్యారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బి.ఆర్.గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది.
