New CJI | కొత్త సీజేఐ నవంబర్ 24న ప్రమాణం.. ఎవరీ సూర్యకాంత్?

భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పదవీకాలం నవంబర్ 23తో ముగిసింది.

భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పదవీకాలం నవంబర్ 23తో ముగిసింది. దీంతో బార్ అసోసియేషన్ నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. న్యాయవిద్యార్థిగా తాను సంస్థను విడిచిపెడుతున్నట్టు గవాయి తెలిపారు. సోమవారంనాడు సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ గా ప్రమాణం చేసే జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకు సీజేఐగా కొనసాగుతారు.

ఎవరీ సూర్యకాంత్?

1962 ఫిబ్రవరి 10న ఆయన హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 1981లో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోహ్ తక్ లోని మహర్షి దయానంద్ యూనివర్శిటీ నుంచి న్యాయపట్టా పొందారు. 1985లో హిస్సార్ జిల్లా కోర్టులో ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1985లో ఆయన పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 వరకు హర్యానా అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు.2004 జనవరి 9న ఆయన హర్యానా హైకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యారు.2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

ఆర్టికల్ 370 తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో సూర్యకాంత్

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలకమైన తీర్పుల్లో జస్టిస్ సూర్యకాంత్ భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు చెల్లుతుందని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ కూడా ఉన్నారు. వలస పాలన కాలం నాటి దేశద్రోహం చట్టాన్ని నిలిపివేసిన ధర్మాసనంలో కూడా జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్నారు. ప్రభుత్వం ఈ చట్టాన్ని సమీక్షించే వరకు దీని కింద కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకూడదని తీర్పులో ఆదేశించారు.బీహార్‌లో ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మంది వివరాలను బహిరంగంగా ప్రకటించాలని ఆదేశించారుసుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తో సహా న్యాయవాదుల సంఘాలలో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని కోరారు.పెగాసస్ స్పైవేర్ సంబంధిత కేసును విచారించిన ధర్మాసనంలో కూడా ఆయన సభ్యుడు. “జాతీయ భద్రత పేరుతో ప్రభుత్వానికి మినహాయింపు ఇవ్వలేం” అని అన్నారు. చట్టవిరుద్ధమైన నిఘా ఆరోపణలపై విచారణకు సైబర్ నిపుణుల కమిటీని నియమించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ NALSA ఛైర్మన్ గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు.

సీనియర్ న్యాయమూర్తికే…

సుప్రీంకోర్టులో పనిచేసే సీనియర్ న్యాయమూర్తికే దేశంలోని అత్యున్నత కోర్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించేందుకు తొలి ప్రాధాన్యత ఉంటుంది. వయస్సు ఆధారంగా కాకుండా సుప్రీంకోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తుల్లో సీనియర్ ను సీజేఐగా నియామకం కోసం తొలి ప్రాధాన్యత ఇస్తారు. అసాధారణ పరిస్థితులు తలెత్తకపోతే ఇదే పద్దతిని పాటిస్తారు.సిట్టింగ్ చీఫ్ జస్టిస్ పదవీ విరమణ చేయడానికి దాదాపు ఒక నెల ముందు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ చీఫ్ జస్టిస్‌కు లేఖ రాస్తుంది. తన తదుపరి సీజేఐను ఎంపిక చేసేందుకు సిఫారసు చేయాలని కోరుతుంది. వారి వారసుడిని సిఫార్సు చేయమని అడుగుతుంది. సుప్రీంకోర్టులో విధులు నిర్వహిస్తున్న సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫారసు చేస్తారు. సీనియర్ న్యాయమూర్తి గురించి పదవీ విరమణ చేసే సీజేఐకి ఆందోళనలు ఉంటే కొలీజియంతో సంప్రదింపులు చేపట్టవచ్చు. అయితే అలాంటి పరిస్థితులు అసాధారణం.

ప్రభుత్వ పాత్ర..

సీజేఐ సిఫార్సు చేసిన పేరును కేంద్ర న్యాయ మంత్రి ప్రధానమంత్రికి పంపుతారు. ప్రధానమంత్రి రాష్ట్రపతికి నియామకం చేయాలని సలహా ఇస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి విషయంలో ప్రభుత్వం సిఫార్సును పునఃపరిశీలించమని కోరదు. ఈ నిర్దిష్ట నియామకానికి సిట్టింగ్ చీఫ్ జస్టిస్ సిఫార్సు తుది నిర్ణయం.

అధికారిక నియామకం

ప్రధానమంత్రి సిఫారసు అందుకున్న తర్వాత సీజేఐ నియామకంపై సంతకం చేస్తారు. ఆ తర్వాత కొత్త ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు వచ్చే వరకు ఈ పదవీకాలం కొనసాగుతుంది.

Latest News