న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో(Supreme Court) ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case) విచారణ వాయిదా పడింది. ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు(T. Prabhakar Rao) ముందస్తు బెయిల్ రద్దు చేయాలని(Bail cancellation petition)..అతను కోర్టుకు హామీ ఇచ్చినట్లుగా విచారణకు సహకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై జస్టిస్ బీవీ.నాగరత్నం, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసటర్ జనరల్ తుషార్ మోహతా వాదనలు వినిపించారు. ఫోన్ టాపింగ్ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చిందని..ఈ నివేదికలో కీలకమైన ఆధారాలు లభించాయని..నివేదికను కోర్టుకు సమర్పించారు.
అమెరికాలో ఉన్న సమయంలో ప్రభాకర్ రావు తన నివాసంలోని ల్యాప్‌టాప్‌లోని ఆధారాలను ధ్వంసం చేశారని ప్రభుత్వం ఆరోపించింది. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో దీనికి సంబంధించిన స్పష్టమైన వివరాలు, తేదీలతో పాటు మొత్తం డేటాను రీసెట్ చేసి ఆధారాలన్నీ చెరిపేసినట్లు పేర్కొంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నేతలు, అధికారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని.. కానీ వాటన్నింటినీ తొలగించే ప్రయత్నాలు చేశారని పేర్కొంది. అయితే విచారణకు ఎప్పుడు పిలిచినా ప్రభాకర్‌రావు వెళ్లారని ఆయన తరఫు సీనయర్ న్యాయవాది శేషాద్రినాయుడు కోర్టుకు తెలిపారు. 15సార్లు విచారణకు హాజరయ్యారని..రాజకీయ కారణాలతో ఆయన్ను వేధిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరినీ పిలిచి ప్రభాకర్‌రావుకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారని తెలిపారు. వాదనల అనంతరం కేసు విచారణను ఈనెల 14వ తేదీకి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.