Mahayuti coalition । క్యాబినెట్ విస్తరణకు ముందే మహారాష్ట్ర అధికార కూటమిలో అసంతృప్తి బయట పడుతున్నది. క్యాబినెట్ విస్తరణ, పోర్టుఫోలియోల కేటాయింపులపై చర్చలకు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే డుమ్మా కొట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌తోపాటు ఢిల్లీలో చర్చలకు వెళ్లాల్సిన ఏక్‌నాథ్ షిండే.. ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. హోం శాఖతోపాటు పలు కీలక పోర్ట్‌ఫోలియోల కోసం ఏక్‌నాథ్ షిండే పట్టుబట్టినా.. బీజేపీ అధిష్ఠానం అందుకు ససేమిరా అనడం మహాయుతి పక్షాల మధ్య టెన్షన్ పుట్టిస్తున్నది. షిండే రాకుండానే డిసెంబర్ 11వ తేదీన ఫడణవీస్, అజిత్‌పవార్ ఢిల్లీ వెళ్లారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన దగ్గర నుంచి హోం శాఖపై షిండే పట్టుదలతో ఉన్నారు.
డిసెంబర్ 16వ తేదీన మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రితోపాటు 43 మంది మహారాష్ట్ర మంత్రివర్గంలో ఉండే వీలున్నది. ఈ నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు శివసేన, ఎన్సీపీలు కీలక శాఖల కోసం మంతనాలు కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి బుధవారం ఫడణవీస్, షిండే, పవార్‌ల సమావేశం ఢిల్లీలో జరుగాల్సి ఉన్నది. ఆ సమావేశంలో పోర్టుఫోలియోల కేటాయింపుపై తుది నిర్ణయానికి రావాల్సి ఉన్నది. ఇంతటి కీలక సమావేశానికి షిండే దూరంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది.
‘ప్రభుత్వంలో మా పాత్రను పరిమితం చేసేందుకు బీజేపీ పద్ధతి ప్రకారం వ్యవహరిస్తున్నదని శివసేన భావిస్తున్నది. షిండేకు హోం శాఖను నిరాకరించడమే కాకుండా, రెవెన్యూ, పరిశ్రమలు, గృహ నిర్మాణ శాఖలను శివసేనకు ఇవ్వటానికి కూడా వారు సిద్ధంగా లేరు’ అని శివసేన నాయకుడొకరు వ్యాఖ్యానించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొన్నది. ఎన్సీపీ, బీజేపీ కలిసి మహాయుతి ప్రభుత్వంలో శివసేన అధికారాలకు కత్తెరవేసే విధంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నదని శివసేన వర్గాలు అంటున్నాయి. గృహ నిర్మాణ శాఖపై ఎన్సీపీ కన్నేయడంపై శివసేన గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. గత మహాయుతి ప్రభుత్వంలో ఈ శాఖ బీజేపీ వద్ద ఉన్నది. మహాయుతిలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 20 శాఖలను తన వద్ద ఉంచుకుంటుందని సమాచారం. శివసేన, ఎన్సీపీకి చెరొక పది శాఖలు లభిస్తాయని అంటున్నారు. హోం శాఖను బీజేపీ తన వద్దే ఉంచుకుంటుదని తెలుస్తున్నది. ప్రజా పనుల శాఖ, పట్టణాభివృద్ధి శాఖలు షిండే శిబిరానికి దక్కవచ్చని చెబుతున్నారు. అజిత్‌పవార్‌కు ఆర్థిక శాఖ ఇస్తారని సమాచారం.