Shrikant Shinde । అప్పుడంటే శివసేనను చీల్చినందుకు బహుమతిగా ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిన బీజేపీ.. ఈసారి ఆ సీటును తన వద్దే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నది. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమైపోయింది. అదే సంకేతాలను ఏక్‌నాథ్ షిండేకు సైతం పంపడంతో మోదీని కలిసిన షిండే.. తాను కొత్త ముఖ్యమంత్రి ఎంపికలో అడ్డంకి కాబోనని చెప్పానని మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రిగా తాను పడ్డ కష్టాన్ని సైతం ఒకసారి మీడియాకు గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసినా.. తనకు కాదు.. తన కుమారుడు శ్రీకాంత్ షిండేకు ఇవ్వాలని ఆయన కోరినట్టు తెలుస్తున్నది. అయితే.. ఇదే అంశం శివసేన పార్టీ నాయకులను చిటపటలాడిస్తున్నది. ఏ మాత్రం అనుభవం లేని శ్రీకాంత్‌ను ఉన్నట్టుండి పెద్ద పదవి అప్పగిస్తే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉన్నదని సీనియర్ నాయకులు వాదిస్తున్నారని సమాచారం.
వృత్తి రీత్యా వైద్యుడు అయిన శ్రీకాంత్.. కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన వయసు 37 సంవత్సరాలు. ఎంబీబీఎస్, ఆర్థోపెడిక్స్‌లో ఎంఎస్ చేసిన శ్రీకాంత్.. 2014లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ముఖ్యమంత్రి పదవి కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంపై ఏక్‌నాథ్ షిండే మనస్తాపానికి గురయ్యారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో తాను అజిత్‌పవార్‌తో కలిసి ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటే ఉద్ధవ్ సేన ఎద్దేవా చేస్తున్నట్టుగా డిమోషన్ అవుతుంది. ఈ క్రమంలోనే తన కుమారుడి పేరును ఏక్‌నాథ్ ముందుకు తెచ్చారని తెలుస్తున్నది. తన డిమాండ్‌ను అంగీకరించిన పక్షంలో మంత్రి వర్గంలో కూడా తాను చేరబోనని హామీ ఇచ్చారని సమాచారం.
ఏక్‌నాథ్ వాదన ఎలా ఉన్నా.. పార్టీలో అనేక మంది సీనియర్లు మాత్రం శ్రీకాంత్ షిండేను ఉన్న పళాన ముఖ్యమంత్రిని చేయడాన్ని అంగీకరించడం లేదు. వాస్తవానికి ఇప్పుడు అసలైన శివసేనగా గుర్తింపు దక్కించుకున్న ఏక్‌నాథ్ షిండే చీలిక వర్గం కుటుంబ పార్టీ ఏమీ కాదు. దీంతో పార్టీలో ఏక్‌నాథ్ షిండే పెత్తనమేంటన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక యువ ఎంపీని డిప్యూటీ సీఎం పదవిలో కూర్చొనబెడితే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందనే సలహా పూర్వక బెదిరింపులు ఉంటున్నట్టు కనిపిస్తున్నది. కొసమెరుపు ఏమిటంటే.. ఆదిత్య ఠాక్రేను ఆయన తండ్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రమోట్ చేయడాన్ని ఇదే ఏక్‌నాథ్ షిండే అప్పట్లో గట్టిగా వ్యతిరేకించారు. ఈ విషయంలో ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలూ గుప్పించారు. తాము చేస్తే మాత్రం వేరు అన్నట్టు ఇప్పుడు అదే ఏక్‌నాథ్ షిండే.. తన కుమారుడి రాజకీయ భవితవ్యం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే.. రాజకీయంగానే కాకుండా, ప్రభుత్వం పరంగానూ ఎంతో అనుభవశాలి అయిన అజిత్‌పవార్‌తో సమానంగా శ్రీకాంత్ షిండేను ఉప ముఖ్యమంత్రిని చేసే విషయంలో బీజేపీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తున్నది.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర అధికార కూటమి మహాయుతి కన్వీనర్ పదవిని కూడా తనకు ఇవ్వాలని షిండే పట్టుబట్టినట్టు పలు మహారాష్ట్ర మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దానితోపాటు మధ్యప్రదేశ్ సీఎం పదవిని వదులుకున్నందుకు శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఇచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వంలో హోం శాఖ వంటి కీలక శాఖను సైతం ఏక్‌నాథ్ డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి బీజేపీ నాయకత్వం ఈ డిమాండ్లపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.