- ఆరు నెలల వ్యవధిలో జన గణన పూర్తి అంటున్న బీజేపీ నేత
- ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలు
- గణన లెక్కలు తేలకపోతే 2011 లెక్కలే ప్రామాణికం?
విధాత, హైదరాబాద్:
Delimitation Telangana | దేశంలో జన గణన ఆరు నెలల్లో పూర్తవుతుందని, ఆ తరువాత నియోజకర్గాల పునర్విభజన మొదలవుతుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ చేసిన ప్రకటనతో రాజకీయ నాయకుల్లో ఆశలు పెరిగాయి. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపుతో పాటు మహిళలకు కూడా 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మూడు రోజుల క్రితం హైదరాబాద్ జరిగిన ఒక సమావేశంలో ఆయన వెల్లడించారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలో తెలంగాణలో ఒకేసారి పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఈయన ప్రకటన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా వాయిదా వేసి 2029లో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచుతామని కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో 119 నుంచి 153 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 నుంచి 23 వరకు పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెరగాలి. జనాభా ప్రకారం చూస్తే 161 వరకు పెరిగే అవకాశాలను తోసిపుచ్చలేము. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా జన గణన కారణంగా వాయిదా పడింది. కశ్మీర్‌తోపాటు తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని స్థానిక పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోని విషయం తెలిసిందే. 2002 తరువాత జమ్ముకశ్మీర్, అసోం వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రం మినహా దేశంలో ఎక్కడా నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు.
దేశంలో జన గణన–2027 కోసం డిసెంబర్ 12, 2025లో కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. జన గణన రెండు దశల్లో ఉంటుందని, రెండో దశలో కుల గణన జరుగుతుందని స్పష్టతనిచ్చారు. భారత దేశంలో ఇప్పటి వరకు 15 సార్లు జనాభా లెక్కలు సేకరించారు. 1872 సంవత్సరంలో ప్రారంభించి, ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి దీనిని చేపడుతూ వస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత హోం మంత్రిత్వ శాఖ జనాభా లెక్కల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అయితే చివరి గణన 2011 లో జరగ్గా, తదుపరి 2021లో చేయాల్సి ఉంది. కొవిడ్ కారణంగా వాయిదా పడిన 16వ జన గణన లెక్కలు మార్చి 1వ తేదీ, 2027 నుంచి ప్రారంభమవుతాయి. జన గణనలో భాగంగా రెండో దశలో కుల గణన చేపట్టనున్నారు.
మంచు ప్రభావిత రాష్ట్రాలు అయిన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లలో సెప్టెంబర్, 2026 లో, మిగతా మైదాన ప్రాంత రాష్ట్రాలలో ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే దీనికి ముందు మొదటి దశలో ఏమేమి చేస్తారనేది ఈ నెల 22వ తేదీన 33 ప్రశ్నలతో ఉన్న ఒక జాబితాను ప్రభుత్వం నోటిఫై చేసింది. కుటుంబ యజమాని పేరు, లింగం, ఎస్సీ లేదా ఎస్టీ వర్గాలు, నివాసం ఉంటున్నఇళ్ళు స్వంతమా, కిరాయికి ఉంటున్నారా? ఇంటి కోసం వాడిన ముడి సరకు, కుటుంబం తీసుకునే ఆహారం, వాహనాలు, ఇంటర్ నెట్, టీవీ, వివాహితుల సంఖ్య వంటి వివరాలు సేకరించనున్నారు. ఈ ప్రక్రియ ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రతి రాష్ట్రంలో తమకు కేటాయించిన తేదీలలో 30 రోజుల పాటు నిర్వహించనున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈ సారి డిజిటల్ పద్ధతిలో మొబైల్ యాప్‌ల ద్వారా వివరాలు సేకరించనున్నారు.
ఇదే కాకుండా స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత తొలిసారి కుల గణన చేస్తున్నారు. చివరిసారి సమగ్ర కుల అధారిత లెక్కలు 1881, 1931 మధ్య జరిగింది. జన గణన కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూ.574 కోట్లు కేటాయించగా, జన గణన ప్రక్రియలో 34 లక్షల మంది ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. అయితే మొత్తం వ్యయం రూ.13వేల కోట్ల వరకు ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.
జనాభా లెక్కలు సేకరించిన తరువాత అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని రాజ్యాంగం చెబుతోంది. రాజ్యాంగం చెప్పిన ప్రకారం 1951, 1961, 1971లో నియోజకవర్గాల పునర్విభజన చేశారు. అయితే 1971 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను విభజించిన సందర్భంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య పెద్ద వివాదాలు జరిగాయి. సాధారణంగా దక్షిణ భారత దేశంలో కుటుంబ నియంత్రణ పాటిస్తారు. అదే ఉత్తరాది రాష్ట్రాలో కుటుంబ నియంత్రణ అంతగా పట్టించుకోరు. దీంతో 1976 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజనను ఆపివేశారు. ఈసారి కూడా తమకు జనాభా ప్రకారం కాకుండా రాష్ట్రాలుగా పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని దక్షిణాది రాష్ట్రాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ నియంత్రణ అమలు చేస్తున్నందున ప్రోత్సాహకంగా వాటి సంఖ్యను పెంచాలని రాజకీయ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారు.
అమిత్ షా కీలక వ్యాఖ్యలు
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన తరువాతే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా డిసెంబర్ నెలలో స్పష్టం చేశారు. ఒకవేళ జనగణన పూర్తి కానట్లయితే 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆయన వెల్లడించారు. జన గణనకు, నియోజకవర్గాల విభజనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేస్తూ, డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నందను త్వరలోనే ప్రక్రయి పూర్తి కావచ్చని అన్నారు. అమిత్ షా చెప్పినట్లు ఒక వేళ 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాలకు సీట్లు కేటాయిస్తే తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు గణనీయంగా సీట్లను కోల్పోయే ప్రమాదముంది.
లోక్‌సభలో ప్రస్తుతం 543 స్థానాలు ఉండగా, పునర్విభజన తరువాత 821కు పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ఏడు ఉత్తరాది రాష్ట్రాలలో 204 ఉండగా, అవి 362కు, దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడున్న సంఖ్యపై 153 వరకు పెరగనున్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 80 లోకసభ స్థానాల నుంచి 137కి పెరగనున్నాయి.
ఇవి కూడా చదవండి..
Silver Gold Price Today : వేలల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు
India’s First Offshore Airport | అరేబియా సముద్రంపై దేశ తొలి విమానాశ్రయం.. ముంబైలో టెక్నాలజీ అద్భుతం
Kalpana | 69 ఏళ్లలోనూ అదే మ్యాజిక్.. ‘రంభా హో హో హో’తో మళ్లీ స్టేజ్ షేక్ చేసిన కల్పనా అయ్యర్
Reorganisation of the constituencies | దక్షిణాదిపై.. పునర్విభజన కత్తి!
