Tribal Woman Delivers Triplets | భువనేశ్వర్ : ఓ గిరిజన మహిళ( Tribal Woman ) ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అది కూడా అరకొర వసతులతో కూడి ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నార్మల్ డెలివరీ( Normal Delivery ) ద్వారా పండంటి బిడ్డలకు ఆమె జన్మనిచ్చింది.
ఒడిశాలోని కందమాల్ జిల్లా డ్యుగాన్ గ్రామానికి చెందిన రంజిత(26) అనే గిరిజన మహిళకు నెలలు నిండాయి. దీంతో ఆమెకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో భర్త స్థానికంగా ఉన్న బెల్ఘర్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించాడు. ఈ హెల్త్ కేర్ సెంటర్‌లో వసతులు కూడా సరిగా లేవు. కేవలం ఒక డాక్టర్, నర్సు మాత్రమే విధుల్లో ఉన్నారు.
అయితే రంజిత కడుపులో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు డాక్టర్ కనిపెట్టలేదు. కేవలం ఒక బిడ్డనే ఉండొచ్చని భావించాడు. మొదట ఒక బేబిని రంజిత ప్రసవించింది. అప్పుడు మరో ఇద్దరు శిశువులు ఆమె కడుపులో ఉన్నట్లు డాక్టర్ గ్రహించాడు. కాసేపటికే మరో బిడ్డను ప్రసవించింది. రెండో బిడ్డలో చలనం లేదు. దీంతో అప్రమత్తమైన నర్సు.. ఆ పసిబిడ్డను ప్రాణాలతో కాపాడింది. మరో క్షణంలోనే మూడో బిడ్డను రంజిత ప్రసవించింది. ముగ్గురిలో ఇద్దరు 1.4 కేజీల బరువు చొప్పున, మరో బిడ్డ 1.6 కేజీల బరువు ఉన్నట్లు వైద్యుడు తెలిపాడు. మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీబిడ్డలను ప్రత్యేక అంబులెన్స్‌లో బాలిగూడ సబ్ డివిజనల్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
రంజితకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురి జన్మతో ఆమెకు ఐదుగురు పిల్లలకు తల్లైంది. తన కడుపులో ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలియదన్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఎలాంటి స్కానింగ్స్ చేయించుకోలేదని రంజిత తెలిపింది. ఈ కాన్పులో తాను ముగ్గురికి జన్మనివ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు.